మన దేశంలో అత్యంత ధనిక సీఎం, పేద సీఎంలు ఎవరో తెలుసా?

మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారతదేశంలో అత్యంత ధనిక సీఎం కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘పేద సీఎం’గా నిలిచినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక విడుదల చేసింది  భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్  నివేదిక విశ్లేషించింది. జగన్ మోహన్ రెడ్డికి 510 కోట్ల రూపాయల చర, స్థిరాస్తులు ఉన్నాయి, ఇది దేశంలోని అందరు సిఎంల  ఆస్తుల కంటే ఎక్కువ అని పేర్కొంది. మరోవైపు మమతా […]

Share:

మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారతదేశంలో అత్యంత ధనిక సీఎం కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘పేద సీఎం’గా నిలిచినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక విడుదల చేసింది 

భారతదేశంలోని ముఖ్యమంత్రులందరి ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్  నివేదిక విశ్లేషించింది. జగన్ మోహన్ రెడ్డికి 510 కోట్ల రూపాయల చర, స్థిరాస్తులు ఉన్నాయి, ఇది దేశంలోని అందరు సిఎంల  ఆస్తుల కంటే ఎక్కువ అని పేర్కొంది.

మరోవైపు మమతా బెనర్జీ నికర ఆస్తులు కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఆమె స్థిరాస్తులు సున్నా. ఇక భారతదేశంలో కోటి రూపాయల లోపు ఆస్తులు కలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఈమెనే కావడం విశేషం. కేవలం కోటి రూపాయల ఆస్తులతో కేరళ సీఎం పినరయి విజయన్ ‘పేద సీఎం’ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

ఏపీ సీఎం తర్వాత రూ.163 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమ ఖండూ 2వ స్థానంలో ఉండగా, రూ. 63.87 కోట్ల విలువైన చర, స్థిరాస్తులతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 3వ స్థానంలో, రూ. 46 కోట్ల ఆస్తులతో నాగాలాండ్ సీఎం నీఫియు రియో 4వ స్థానంలో, రూ. 38 కోట్లతో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగసామి 5వ స్థానంలో ఉన్నారు.

నివేదిక ప్రకారం, భారతదేశంలోని 29 మంది సీఎంలు ‘కోటీశ్వరులు’ గానే ఉన్నారు. వారి సగటు ఆస్తులు రూ. 33.96 కోట్లుగా ఉంది.

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రూ. 17 కోట్లు ఆస్తులు కలిగి ఉండగా, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా  రూ. 14 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. ఇక రూ. 3 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య ఆస్తులున్న సీఎంల జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు. 

తక్కువ ఆస్తులున్న సీఎంలను పరిశీలిస్తే.. మమతా బెనర్జీ రూ. 15 లక్షలతో మొదటి స్థానంలో ఉండగా, కేరళ సీఎం పినరాయి విజయన్, హరియాణ సీఎం మనోహర్ లాల్ ఆస్తి విలువ రూ. కోటిగా ఉన్నాయి. ఇక బీహార్, ఢిల్లీ సీఎంలు నితీశ్ కుమార్, అర్వింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ సుమారు రూ. 3 కోట్లుగా ఉంది.

భార‌త రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడు, తెలంగాణ సిఎం కె చంద్ర‌శేఖ‌ర్ రావు అత్య‌ధిక అప్పులు ఉన్న సిఎంల జాబితాలో అగ్ర‌స్థానంలో నిలిచారు. కేసీఆర్ నికర ఆస్తులు 23.5 కోట్లు కాగా, ఆయన అప్పులు దాదాపు 8.8 కోట్లు.

కేసీఆర్ తర్వాత రూ.8.92 కోట్ల ఆస్తులకు రూ.4.9 కోట్ల అప్పులతో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రెండో స్థానంలో నిలవగా, రూ.11.6 కోట్ల విలువైన ఆస్తులలో రూ.3.75 కోట్ల అప్పులతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే 3వ స్థానంలో ఉన్నారు.

30 మంది ముఖ్యమంత్రులలో 13 మందిపై సీనియర్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేరం రుజువైతే ఐదేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.