ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా పాల్గొనగా మిగిలిన ప్రాంతాల్లో వర్చువల్‌గా ప్రారంభించారు. ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి విజయనగరంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సిఎం లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. విజయనగరంలో మెడికల్ […]

Share:

ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా పాల్గొనగా మిగిలిన ప్రాంతాల్లో వర్చువల్‌గా ప్రారంభించారు.

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి విజయనగరంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సిఎం లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు.

విజయనగరంలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సీఎం జగన్ తిలకించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్ల విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రూ.8,480 కోట్లతో మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తుండగా వీటిలో ఐదు కాలేజీలలో ఈ ఏడాది నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తున్నారు.

ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా పేదవారికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలని అకాంక్ష వ్యక్తం చేవారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన సీఎం జగన్..వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు.

వైద్య కళాశాల ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ వైయస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, అనంతరం వివిధ విభాగాలకు చెందిన ల్యాబులను సీఎం పరిశీలించారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రారంభించి అనంతరం వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికి మంచి జరగాలన్నదే మా ఆలోచన. ఏ చదువైనా పేదవారికి అందుబాటులో ఉండాలి అని అన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టామన్నారు.

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా వేగంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ స్థాయిలో సదుపాయాలతో కాలేజీ నిర్మాణం అద్భుతం. మెడిసిన్‌ చదవాలనుకున్న మా కల సాకారమవుతోంది. సీఎం జగన్‌కు మా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు..

వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో విద్యాబోధన ప్రారంభిస్తారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తోందని వివరించారు.

ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో వస్తాయని తెలిపారు. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెరిగాయని వివరించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 1902 ద్వారా నేరుగా తెలపొచ్చన్నారు.

మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తూ.. ప్రతి మెడికల్ కాలేజీలో రూ. 500 కోట్ల వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు. ఒక్కో కాలేజీలో 8.5 లక్షల  చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్‌తో పాటు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు.. అత్యాధునిక సాంకేతికతతో లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీ టీవీల ఏర్పాటు చేశారు.

2024-25 లో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లెలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఏడాది 2025-26లో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండలలో అందుబాటులో వస్తాయి.