ఇస్కాన్ పై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు

ఇస్కాన్ హరేకృష్ణ ఉద్యమం.. ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ సమాజం. ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వాలను భక్తి యోగాలను ప్రచారము చేస్తుంది. భారత్‌లోని ప్రతి ప్రధాన నగరంలో ఇస్కాన్‌ కృష్ణ మందిరాలు ఉన్నాయి. అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తోంది. అయితే, వీరి ఆలయాల పరిధిలోని గోశాలల్లో గోవులను కసాయిలకు అమ్మేస్తున్నట్టు ఆరోపణలు చేశారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.  అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ […]

Share:

ఇస్కాన్ హరేకృష్ణ ఉద్యమం.. ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ సమాజం. ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వాలను భక్తి యోగాలను ప్రచారము చేస్తుంది. భారత్‌లోని ప్రతి ప్రధాన నగరంలో ఇస్కాన్‌ కృష్ణ మందిరాలు ఉన్నాయి. అనేక నగరాలలో రాధాకృష్ణ మందిరాలు నిర్మిస్తోంది. అయితే, వీరి ఆలయాల పరిధిలోని గోశాలల్లో గోవులను కసాయిలకు అమ్మేస్తున్నట్టు ఆరోపణలు చేశారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ. 

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన గోశాలలోని ఆవులను కసాయిలకు అమ్ముకుంటోన్న ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసకారి అని మేనకా గాంధీ విమర్శించారు. 

‘ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద చీటర్.. గోశాలల ఏర్పాటుకు భూమి, నిర్వహణ సహా ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతోంది’ అని మేనకా గాంధీ ఆరోపించారు. ఆమె ఆరోపణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఇస్కాన్ పర్యటనను ఆమె గుర్తు చేసుకున్నారు. అనంతపురం ఇస్కాన్ గోశాలలో పాలిచ్చిన ఆవులు లేదా దూడలను తాను చూడలేదన్నారు. ‘డెయిరీ మొత్తంలో ఎండిపోయిన ఆవు లేదు.. అక్కడ ఒక్క దూడ కూడా లేదు. అంటే అన్నీ అమ్ముడయ్యాయి’ అని మేనకా గాంధీ దుయ్యబట్టారు.

‘తన వద్ద ఉన్న మొత్తం గోవులను కసాయిలకు ఇస్కాన్ అమ్మేస్తోంది.. వారు చేసినంతగా మరెవరూ చేయరు. మళ్లీ రోడ్లపై ‘హరే రామ్ హరే కృష్ణ’ అని పాడతారు. అప్పుడు తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతారు.. బహుశా కసాయిదారులకు వీళ్లు అమ్మినంతగా పశువులను ఎవరూ అమ్మి ఉండరు’ అని ఆమె ఆరోపణలు చేశారు.

హరే కృష్ణ ఉద్యమంలో అనుబంధమైన ఇస్కాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా వందలాది దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమ హంసలపై కొన్ని నెలల కిందట విమర్శలు చేసి ఇస్కాన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అమోఘ్ లీలా దాస్ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీయడంతో ఆయనను నిషేధించి తప్పుదిద్దుకునే ప్రయత్నం చేసింది.

అయితే, మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై ఇస్కాన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ యుధిష్టిర్ గోవింద దాస్ స్పందించారు.. బీజేపీ ఎంపీ ఆరోపణలు నిరాధారం, అవాస్తవమని స్పష్టం చేశారు. ఆవులు, ఎద్దులను వాటి జీవితాంతం వరకు పోషిస్తున్నట్లు తెలిపారు. తమ గోశాలలో పాలు ఇవ్వని ఆవులను కసాయిలకు అప్పగిస్తున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. భారతదేశంలోనే కాకుండా , ఎక్కువగా బీఫ్ తినే పలు దేశాల్లోనూ తమ సంస్థ గోవులను కాపాడి గోశాలలు ఏర్పాటు చేసి పరిరక్షణ చర్యలకు దిగుతోందని తెలిపారు. ఆమె అనంతపూర్ గోశాలను సందర్శించినట్లు వీడియోలో చెప్పినప్పటికీ.. ఆమె గోశాలను సందర్శించినట్లు అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరూ ధృవీకరించలేదని తెలిపారు.  పాలు ఇవ్వని ఆవులు, ఎద్దులను సంరక్షిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. 

మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ జంతు హక్కుల కార్యకర్తగా గుర్తింపు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత, కృష్ణ తత్వంపై ఇస్కాన్ సంస్థ ప్రచారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్‌కు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయి.  వేలాది గోశాలలను కూడా నిర్వహిస్తోంది.  తాజాగా ఇస్కాన్ సంస్థపై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఇస్కాన్ భక్తులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.