చంద్రయాన్–3, జీ20 సమిట్ విజయంతో ప్రజల సంతోషం రెట్టింపు

చంద్రయాన్–3, జీ20 సమిట్‌లో సాధించిన విజయాలను తన నెల వారీ మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ను సభ్యుడిగా చేర్చుకోవడం ద్వారా ఇండియా నాయకత్వాన్ని ప్రపంచం అంగీకరించినట్లు అయిందని ఆయన అన్నారు. ముందు చంద్రయాన్–3, తర్వాత జీ20 సమిట్‌తో అంతర్జాతీయంగా భారతదేశం తిరుగులేని విజయాన్ని అందుకుంది. ప్రపంచదేశాల నుంచి ప్రశంసలు అందుకుంది. చంద్రయాన్‌–3తో చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డు సృష్టించగా.. జీ20 సమిట్‌లో డిక్లరేషన్‌ […]

Share:

చంద్రయాన్–3, జీ20 సమిట్‌లో సాధించిన విజయాలను తన నెల వారీ మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ను సభ్యుడిగా చేర్చుకోవడం ద్వారా ఇండియా నాయకత్వాన్ని ప్రపంచం అంగీకరించినట్లు అయిందని ఆయన అన్నారు.

ముందు చంద్రయాన్–3, తర్వాత జీ20 సమిట్‌తో అంతర్జాతీయంగా భారతదేశం తిరుగులేని విజయాన్ని అందుకుంది. ప్రపంచదేశాల నుంచి ప్రశంసలు అందుకుంది. చంద్రయాన్‌–3తో చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డు సృష్టించగా.. జీ20 సమిట్‌లో డిక్లరేషన్‌ విషయంలో అసాధ్యమనకున్న ఏకాభిప్రాయాన్ని సుసాధ్యం చేసింది. ఇవే విషయాలను ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

దేశంలోని ప్రతి ఒక్కరి సంతోషం రెట్టింపు అయింది

ఆదివారం నిర్వహించిన 105వ మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామీ.. డెహ్రాడూన్‌లో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ తదితరులు.. ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని విన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో యూట్యూబ్ చానల్‌లో 80 లక్షల మందికి పైగా లైవ్‌లో చూశారు. ఇదో రికార్డు. చంద్రయాన్‌–3తో దేశ ప్రజలు ఎంతగా అనుబంధం పెంచుకున్నారనే దానికి ఇది ఉదాహరణ. చంద్రయాన్–3 ల్యాండర్ దిగుతున్న సమయంలో కోట్లాది మంది ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠతో చూశారు” అని ఆయన వివరించారు.  

ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సమిట్‌లో ప్రతిపాదించిన ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ కారిడార్.. భవిష్యత్తులో వందల ఏళ్లు ప్రపంచ వాణిజ్యానికి ఆధారంలా నిలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్–3 సక్సెస్ తర్వాత జీ20 సమిట్ కూడా విజయవంతం కావడంతో దేశంలోని ప్రతి ఒక్కరి సంతోషం రెట్టింపు అయిందని ఆయన అన్నారు. జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్‌ను కూడా సభ్యుడిగా చేర్చుకోవడం ద్వారా ఇండియా నాయకత్వాన్ని ప్రపంచం అంగీకరించినట్లు అయిందని అన్నారు. 

‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి

గాంధీ జయంతికి ఒకరోజు ముందు అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించే ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీకి మనమిచ్చే నిజమైన నివాళి ఇదేనని అన్నారు. అక్టోబర్ 2న ఖాదీ ఉత్పత్తులను కొనాలని కోరారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులను కొనడం ద్వారా ‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని కోరారు. మన దేశ సంస్కృతి, సంగీతానికి ప్రపంచ గుర్తింపు దక్కుతోందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్‌లో యువత ‘గుర్రంపై గ్రంథాలయం’ ద్వారా గ్రామీణ చిన్నారులకు పుస్తకాలను చేరవేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన బాలికనూ ఆయన ప్రశంసించారు. హైదరాబాద్‌ పబ్లిక్ స్కూలులో 7వ క్లాస్ చదువుతున్న 11 ఏళ్ల ఆకర్షణ సతీశ్ అనే బాలిక గురించి ప్రధాని ప్రస్తావించారు. పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్న ఆమె.. తన తండ్రి సహకారంతో పిల్లల కోసం ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోందని అభినందించారు. తోటి పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా చిన్న వయసులోనే విశేష కృషి చేస్తున్న ఆకర్షణ సతీశ్.. గతంలో రాష్ట్రపతి నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం గమనార్హం.