సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ సాహసం భేష్: మోదీ

Indian PM Modi: సమద్ర దొంగలు హైజాక్ చేసిన వాణిజ్య నౌకను చాకచక్యంగా విడిపించిన భారత నావికాదళాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Courtesy: x

Share:

జైపుర్: సమద్ర దొంగలు హైజాక్ చేసిన వాణిజ్య నౌకను చాకచక్యంగా విడిపించిన భారత నావికాదళాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తాజాగా జైపూర్‌లో జరిగిన డీజీపీ, ఐజీపీల 58వ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలు.. భారత నేర న్యాయవ్యవస్థలో మార్పులకు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళలు, బాలికలకు వారి హక్కులు, రక్షణ గురించి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 

పోలీసులు ఇప్పుడు డండా(లాఠీ)కు బదులుగా డేటా (సమాచారం)తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఎదగాలనే ఆశయాన్ని నెరవేర్చేందుకు.. పోలీసులు తమను తాము అత్యాధునిక, ప్రపంచ స్థాయి శక్తిగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలు.. సముద్రపు దొంగల ఆట కట్టించిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రోజుల క్రితం ఇండియన్‌ నేవీ వీరోచిత ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. భారత తీరానికి 2 వేల కిలోమీటర్ల దూరంలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన వాణిజ్య నౌకను చాకచక్యంగా రక్షించినట్లు ప్రశంసించారు. 

ఆదిత్య ఎల్‌-1 సక్సెస్ పైనా ప్రశంసలు
ఇక ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన ఆదిత్య ఎల్‌-1 విజయంపై కూడా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది దేశ శక్తి, శాస్త్రవేత్తల పరాక్రమానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఆదిత్య ఎల్‌-1, పదిహేను లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఆదిత్య ఎల్‌-1 లగ్రాంజ్ పాయింట్‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ఇది మన శాస్త్రవేత్తల అద్భుత పనితీరుకు నిదర్శమని కొనియాడారు. ఇదిలా ఉంటే ఆదిత్య ఎల్‌-1 హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్‌కు సేవలు అందించనుంది.

భారత పార్లమెంటు ఇటీవల ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధార చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ పేరుతో కొత్త చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. వలస పాలన తాలూకు గుర్తులను చెరిపేస్తూ.. భారత నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.