జీ20 సమిట్‌తో అనుకున్న లక్ష్యాలను చేరుకున్న ఇండియా!

ఢిల్లీలో రెండు రోజుల జీ20 సమిట్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ప్రపంచ నేతలతో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం దౌత్యపరంగా అద్వితీయ విజయం సాధించింది. కీలకమైన ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌’ను ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న వేళ.. ఏకాభిప్రాయం అసాధ్యమని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సభ్య దేశాలను ఏకతాటి పైకి తెచ్చింది. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్‌ను కూటమిలోకి చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదననను దేశాలన్నీ అంగీకరించాయి. ప్రపంచ దేశాల నేతలకు […]

Share:

ఢిల్లీలో రెండు రోజుల జీ20 సమిట్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ప్రపంచ నేతలతో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం దౌత్యపరంగా అద్వితీయ విజయం సాధించింది. కీలకమైన ‘న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌’ను ఏకాభిప్రాయంతో ఆమోదింపజేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న వేళ.. ఏకాభిప్రాయం అసాధ్యమని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సభ్య దేశాలను ఏకతాటి పైకి తెచ్చింది. మరోవైపు ఆఫ్రికన్ యూనియన్‌ను కూటమిలోకి చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదననను దేశాలన్నీ అంగీకరించాయి. ప్రపంచ దేశాల నేతలకు మంచి ఆతిథ్యం కల్పించి, సమిట్‌ను పూర్తి చేసి ఇప్పుడు ఇండియా ఊపిరిపీల్చుకుంటోంది.

జీ20 సమిట్, ఢిల్లీ డిక్లరేషన్, ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలు.. భారత దేశ విదేశాంగ విధాన ప్రాధాన్యతలను, ముఖ్యమైన దేశాలతో సంబంధాలను ప్రతిబింబించాయి. మరోవైపు న్యూఢిల్లీ డిక్లరేషన్ వల్ల.. అమెరికా, రష్యా, చైనాలతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో, గ్లోబల్ సౌత్ వాయిస్‌గా ఉండాలనే భారతదేశం తపన, అంతర్జాతీయ వ్యవస్థలో బహుపాక్షికతను పునరుద్ధరించే ప్రయత్నాల విషయంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ‘ది ఇండియా వే’ అనే పుస్తకంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు కీలక విషయాలను రాసుకొచ్చారు. ‘‘అమెరికాతో ఎంగేజ్ అవ్వడానికి, చైనాను మేనేజ్ చేయడానికి, యూరప్‌ను దగ్గర చేసుకోవడానికి, రష్యాకు భరోసా ఇవ్వడానికి, జపాన్‌ను తిరిగి పోటీలోకి తీసుకురావడానికి, పొరుగు దేశాలను ఆకర్షించడానికి, స్నేహబంధాలను ఇతర దేశాలతో విస్తరించడానికి, అంతర్జాతీయ కూటములను పెంచుకోవడానికి ఇది మాకు సమయం” అని ఆయన చెప్పారు. ఈ అన్ని విషయాల్లో భారతదేశం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధించింది. 

ఎంగేజింగ్ అమెరికా

జూన్‌లో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన గ్రేట్ లీప్ ఫార్వర్డ్‌ (ఆర్థిక ప్రణాళిక)ను సూచిస్తే.. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పటిష్టం చేసింది. ఇది ప్రపంచ, ప్రాంతీయ, ద్వైపాక్షిక స్థాయిల్లో సహకారాల సమయంలో ప్రతిబింబిస్తుంది. ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో ఇండియాకు మద్దతుగా అమెరికా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే.. డిక్లరేషన్‌పై జోబైడెన్ సంతకం చేశారు. తర్వాత బైడెన్‌ను యూరోపియన్లు అనుసరించారు. అమెరికా ఇలా చేయడం వల్ల.. గ్లోబల్ సౌత్‌ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి, రష్యాపై ఒత్తిడిని తీసుకురావడానికి అవకాశం కలిగింది. 

ఇక ప్రాంతీయ పరంగా.. భారతదేశం–మిడిల్ ఈస్ట్– యూరప్ కారిడార్‌‌ ప్రకటనపై ఇప్పుడే ఎక్కువగా ఊహించుకోలేం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పడుతుంది. అయితే ఉత్తర అమెరికా, యూరప్, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లోని విభిన్న దేశాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టుకు సహకరిచాయి. ఇది చైనా వన్ బెల్డ్ వన్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా నిలవడమే కాకుండా.. భారతదేశానికి అద్భుత వాణిజ్య అవకాశాలను తెరవగలదు. 

ఇక జూన్‌లో తమ భేటీ సందర్భంగా జరిగిన ఒప్పందాలను వేగంగా అమలు చేయాలని బైడెన్, మోదీ నిర్ణయించారు. కొత్తగా కొన్ని ప్రకటనలు కూడా చేశారు. జీఈ జెట్ ఇంజిన్, ఎంక్యూ –9బీ ఒప్పందాలు జావుగా సాగుతున్నాయి. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐసెట్), స్పేస్, సెమీ కండక్టర్, డిఫెన్స్ ఇన్నోవేషన్, విద్య, క్వాంటమ్, బయోటెక్, టెలికాం సహాకరం విషయంలో ముందడుగు పడింది. 

రష్యాకు భరోసా

మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రష్యా వెన్నంటి ఉంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ మనకు మద్దతుగా నిలబడింది. ఆ సాయాన్ని గుర్తుపెట్టుకున్న ఇండియా.. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో తటస్థంగా నిలబడింది. ఉక్రెయిన్‌కో, రష్యాకో మద్దతుగా ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. తాము యుద్ధానికి వ్యతిరేకమని మాత్రమే చెప్పింది. ఇదే సమయంల పాశ్యాత్య దేశాల హెచ్చరికలను, విమర్శలను పట్టించుకోకుండా రష్యాతో తన వాణిజ్యాన్ని కొనసాగించింది. బ్యారెల్స్‌ కొద్దీ చమురును తక్కువ ధరకే కొనుగోలు చేసింది. విమర్శలు చేసిన పాశ్చాత్య దేశాలకు కేంద్ర మంత్రి జైశంకర్ దీటుగా సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ డిక్లరేషన్ సమయంలోనూ ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లుగా భారత్ వ్యవహరించింది. దీంతో భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు ఇది యుద్ధాల యుగం కాదని భారత్ తేల్చి చెప్పింది. ఏ సమస్యకైనా దౌత్యం, చర్చల ద్వారానే శాంతి నెలకొంటుందని పునరుద్ఘాటించింది. అణు ఆయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం సరికాదని హితవుపలికింది. ఆహార ధాన్యాల సరఫరా విషయంలోనూ కీలక ప్రకటన చేసింది. పౌరులు, మౌళిక సదుపాయాలపై దాడి చేయకూడదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టే పరిస్థితులను తీసుకురావద్దని, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించింది. 

చైనాను మేనేజ్ చేయడం

చైనా కొన్నేళ్లుగా సరిహద్దుల్లో దూకుడుగా ఉంటోంది. చొరబాట్లకు దిగుతోంది. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో జీ20 సమిట్‌కు చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ గైర్హాజరయ్యారు. ఇది ఒకరకంగా ఇండియాకు మంచి చేసింది. ఒకవేళ జిన్‌పింగ్ వచ్చినప్పుడు.. మోదీ కరచాలనం చేసినా, భేటీ అయినా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చేవి. సరిహద్దుల్లో చొరబాట్లకు దిగుతున్న చైనా విషయంలో దేశ నాయకత్వం బలహీనంగా ఉందన్న విమర్శలు వచ్చేవి. అయినప్పటికీ ఇప్పుడేమే సజావుగా లేదు. జీ20 విషయంలో ఇండియా సాధించిన విజయం.. చైనా కారిడార్‌‌కు పోటీ ఇంకో కారిడార్‌‌ను ప్రకటించడం, చైనాతో చేసుకున్న ఒప్పందం నుంచి బయటికి వస్తామని ఇటలీ ప్రకటించడం వంటివి రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశమూ లేకపోలేదు. 

అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటే.. చైనా మాత్రం రష్యాకు సపోర్టు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పక్షాలు ఢిల్లీ డిక్లరేషన్‌పై సంతకం చేశాయి. రష్యా కోసం ఈ డిక్లరేషన్‌పై చైనా సంతకం చేయాల్సి వచ్చింది. మరోవైపు గ్లోబల్ సౌత్‌ను సమీకరించే పనిలో ఇండియా పడింది. ఇప్పటికే చాలా దేశాలు చైనాపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఇవన్నీ మన దేశానికి కలిసొచ్చేవే. 

దేశాలతో సత్సంబంధాలు

జీ20 సమావేశాలకు కొన్ని దేశాలను ఇండియా ఆహ్వానించింది. ఇందులో బంగ్లాదేశ్ ఒకటి. ఈ చర్య వల్ల ప్రపంచ రాజకీయ ప్రముఖులను కలిసే, చర్చలు జరిపే అవకాశం బంగ్లాదేశ్‌కు దక్కింది. యూఏఈ, సౌదీ అరేబియాతో ఇన్ఫ్రా కారిడార్‌‌, గ్లోబల్‌ సౌత్ దేశాలను సమీకరించడం కూడా ఇలాంటివే. జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌ను చేర్చడం గొప్ప ముందడుగు. అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ఏర్పాటైన ప్రపంచంలోని ప్రధాని కూటమిలో ఆఫ్రికా నుంచి ఒకే ఒక దేశం ఉంది. అది దక్షిణాఫ్రికా మాత్రమే. ఒక ఖండం నుంచి ఒకే ఒక్క దేశం ఉండటం ప్రపంచ అసమానతలను తెలియజేస్తోంది. దీన్ని గొప్ప అవకాశం ఇండియా మలుచుకుంది. ఆఫ్రికన్ యూనియన్ తరఫున వాయిస్ వినిపించింది. సభ్య దేశాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి ఒప్పించింది. ఎట్టకేలకు జీ20లో ఏయూని భాగం చేసింది. 1999లో జీ20ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ఇప్పుడు మాత్రమే విస్తరణ జరిగిందంటే భారత్ ఏ స్థాయిలో దౌత్యం నెరిపిందో అర్థం చేసుకోవచ్చు. ఇది జీ20 భారత ప్రెసిడెన్సీ చరిత్రలో నిలిచిపోతుంది. గ్లోబల్ సౌత్ గురించి, ఆహార భద్రత గురించి కూడా డిక్లరేషన్‌లో భారత్ ప్రస్తావించింది. ఇక జీ20 దిగ్విజయంతో ఇక జరగబోయేదంతా కొత్త అధ్యాయమే.