మైసూర్ హోటల్ లో దోసెలు వేసిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే టీ స్టాల్ వాలా వద్దకు వెళ్లిన సమయంలో టీ కాయడం, హోటల్ కు వెళ్లిన సమయంలో తినుబండారాలను తయారు చేయడం, లాండ్రీ వ్యక్తి వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది సేపు బట్టలకు ఇస్త్రీ చేయడం, పొలాల్లోకి వెళితే రైతులతో కలిసి నాట్లు వేయడం వంటివి చేస్తూ ఉంటారు నాయకులు. అక్కడి ప్రజలను ఆకట్టుకుంటారు. అలానే ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ […]

Share:

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే టీ స్టాల్ వాలా వద్దకు వెళ్లిన సమయంలో టీ కాయడం, హోటల్ కు వెళ్లిన సమయంలో తినుబండారాలను తయారు చేయడం, లాండ్రీ వ్యక్తి వద్దకు వెళ్లిన సమయంలో కొద్ది సేపు బట్టలకు ఇస్త్రీ చేయడం, పొలాల్లోకి వెళితే రైతులతో కలిసి నాట్లు వేయడం వంటివి చేస్తూ ఉంటారు నాయకులు. అక్కడి ప్రజలను ఆకట్టుకుంటారు. అలానే ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచార పర్వంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంగ గాంధీ.. మైసూర్ లోని ఓ హోటల్ లో దోసెలు వేసి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. మైసూర్ లోని మైలారి అనే ఓ పురాతన హోటల్ కు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకె శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూరేవాలా, కేఆర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి సోమశేఖర్ తో వెళ్లిన ప్రియాంకా గాంధీ.. ఆ హోటల్ యజమానితో మాట్లాడి వంట గదిలోకి వెళ్లారు.  తాను దోశలు వేస్తానని చెప్పారు. అనంతరం హోటల్ యజమాని పిల్లలతో ముచ్చటించారు. తనకు ఈ అవకాశం కల్పించిన హోటల్ యజమానికి కృతజ్ఞతలు తెలిపి వారి కుటుంబంతో ఫోటోలు దిగారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రియాంకా గాంధీ దీని గురించి ప్రస్తావిస్తూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

అంతకు ముందు మైసూర్ లో జరిగిన ర్యాలీలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగించారు. మాజీ ప్రధాన మంత్రి (మా నానమ్మ) ఇందిరా గాంధీ గురించి అందరికీ తెలుసు. ప్రజల నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదని అన్నారు.   బీజేపీ కర్ణాటకలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రదాని నరేంద్ర మోడీ కర్ణాటకలో ప్రతిపక్ష నేతల సమాధులు తవ్వాలనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు ఏ నాయకుడి మాటలు విని ఓటు వేయకూడదనీ, మనసాక్షి ని అనుసరించి ఓటు వేయాలని సూచించారు.  

అదే విధంగా బొమ్మై సర్కార్ ను తీవ్రంగా విమర్శించారు ప్రియాంకా గాంధీ. గత ఎన్నికల్లో ప్రజలు జేడీఎస్, కాంగ్రెస్ ను ఎన్నుకుంటే బీజేపీ డబ్బు బలంతో ప్రభుత్వాన్ని కూలదోసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. కర్ణాటకలోని బీజేపీ సర్కార్ ప్రజా ధనాన్ని లూటీ చేసిందని, రూ.1.5 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. అమూల్ పాలను కర్ణాటకలో తీసుకువచ్చేందుకు బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నందిని పాల ఉత్పత్తిని తగ్గించిందని ఆరోపించారు. గతంలో నందిని పాలు ఉత్పత్తి 90 లక్షల లీటర్లు ఉండేదనీ, కానీ నేడు 70 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. 

కాగా 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనున్నది. మరో సారి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచారాన్ని నిర్వహిస్తొంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సభలు, ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ పై అనర్హత వేటు, కేంద్రంలో బీజేపీ నిరంకుశ పాలన, రాష్ట్రంలో అవినీతి  తదితర విషయాలు వివరిస్తూ ఈ సారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తొంది.