కశ్మీర్‌లో తెగబడ్డ ఉగ్రవాదులు..

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు సైనికాధికారులతో పాటు ఓ పోలీసు అధికారి, మరో జవాన్ వీరమరణం పొందారు. అలాగే సైనికులను కాపాడే క్రమంలో ఓ ఆర్మీ జాగిలం ప్రాణాలు కోల్పోయింది. అనంత్‌నాగ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సైన్యం మంగళవారం సాయంత్రం ఆపరేషన్ చేపట్టింది. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు […]

Share:

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు సైనికాధికారులతో పాటు ఓ పోలీసు అధికారి, మరో జవాన్ వీరమరణం పొందారు. అలాగే సైనికులను కాపాడే క్రమంలో ఓ ఆర్మీ జాగిలం ప్రాణాలు కోల్పోయింది. అనంత్‌నాగ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సైన్యం మంగళవారం సాయంత్రం ఆపరేషన్ చేపట్టింది. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

జమ్మూ కశ్మీర్‌లో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ముగ్గురు అధికారులు అమరులయ్యారు. అనంతనాగ్‌ జిల్లాలోని కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో దాక్కున్న తీవ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్‌లో ఆర్మీ కర్నల్‌, మేజర్‌, డీఎస్పీ ప్రాణత్యాగం చేశారు. వారు కన్నుమూసిన విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ నిషేధిత రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నుంచి గడోల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతాదళ సిబ్బంది గాలింపు చేపట్టారు.  బుధవారం ఉదయం ఓ రహస్య ప్రాంతంలో వారు నక్కి ఉన్నట్లు సమాచారం అందింది. ఎదురు కాల్పులు కొనసాగుతూ వచ్చాయి.

కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశీష్.. దీనికి సారథ్యాన్ని వహించారు. దీంతో కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం అక్కడకు చేరుకుని గాలిస్తుండగా.. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల కాల్పుల్లో కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తోపాటు మేజర్‌ ఆశిష్‌ ధొనక్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమయూన్‌ భట్‌లు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అత్యవసర చికిత్సను అందించారు. వారి ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి వారు తుదిశ్వాస విడిచారు.

ముష్కరుల తూటాలకు బలైన 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ (41) ఘటనకు కొద్ది సేపటి ముందే కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ఉదయం 6.45 గంటలప్పుడు మేం మాట్లాడాం.. తర్వాత మాట్లాడుతాను అని చెప్పారు.. చాలా మంచి వ్యక్తి.. విధి నిర్వహణలో గతేడాది సేనా మెడల్ వచ్చింది.. ’ అని కల్నల్ బావమరిది వీరేంద్ర గిల్ అన్నారు.

మేజర్ ఆశిష్ ధోనక్ బంధువు మాట్లాడుతూ.. ‘ఫోన్‌లో చివరిసారిగా మాట్లాడాం.. నెలన్నర కిందటే ఇంటికి వచ్చారు.. అక్టోబరులో మళ్లీ రావాల్సి ఉంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. మేజర్ ఆశిష్‌కు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు.

జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి డీఎస్పీ హిమయూన్ భట్… రిటైర్డ్ ఐజీ గులామ్ హసన్ భట్ కుమారుడు. కాల్పుల్లో గాయపడిన డీఎస్పీ భట్.. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు విడిచారు. రెండు నెలల కిందటే భట్‌కు ఓ పాప పుట్టింది.

ఎన్‌కౌంటర్ జరిగిన కోకెర్‌నాగ్ అటవీ ప్రాంతం నుంచి కల్నల్, మేజర్, డీఎస్పీ మృతదేహాలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఆర్మీ 15 కార్ప్స్ కమాండర్, ఇతర ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్ ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అధికారులను.. ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చోటుచేసుకుంది. ముష్కరులు తూటాల వర్షం కురిపిస్తుండటంతో వారిని అక్కడ నుంచి తరలించడానికి వీలుపడలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ఆగస్టు 4న ముగ్గురు జవాన్ల మృతికి కారణమైన ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆర్మీ భావిస్తున్నది.