హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు.. ఫ్రీగా ప్రయాణించొచ్చు

ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. అయితే చాలామంది ఆ బస్సులను ఆసక్తిగా చూడటమే కాకుండా అందులో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందేవారు. కాలక్రమేణా ఆ బస్సులు కనుమరుగైపోయాయి. అయితే ఆ బస్సులు మళ్లీ తీసుకొస్తే బాగుంటుందని కొన్నాళ్ల నుంచి నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ని కోరుతున్నారు. నెటిజన్ల కోరిక మేరకు మంత్రి కేటీఆర్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. నగరంలో డబుల్ […]

Share:

ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. అయితే చాలామంది ఆ బస్సులను ఆసక్తిగా చూడటమే కాకుండా అందులో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందేవారు. కాలక్రమేణా ఆ బస్సులు కనుమరుగైపోయాయి. అయితే ఆ బస్సులు మళ్లీ తీసుకొస్తే బాగుంటుందని కొన్నాళ్ల నుంచి నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ని కోరుతున్నారు. నెటిజన్ల కోరిక మేరకు మంత్రి కేటీఆర్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. రూ. 12 కోట్లు వెచ్చించి మెుత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను హెచ్‌ఎండీఏ (HMDA) సహకారంతో నగరంలో ప్రారంభించారు.

కాగా, పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక రూట్‌ను హెచ్‌ఎండీఏ సిద్ధం చేసింది. ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌, తారామతి బారాదరి, తీగల వంతెన, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ జిల్లా ప్రాంతాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నారు. ఉదయం ట్యాంక్‌ బండ్‌ వద్ద మొదలై ఆయా రూట్లలో తిరుగుతూ తిరిగి ట్యాంక్‌ బండ్‌కు చేరుకుంటాయి. ఛార్జింగ్‌ కోసం ఖైరతాబాద్‌ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు.

ఈ డబుల్ డెక్కర్ బస్సులను నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లో రెండు నెలల నుంచి తిప్పుతున్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు నడుస్తున్నాయి. ‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులను ఉచితంగా తిప్పుతున్నారు. కానీ, ఆశించినంతమేర ప్రయాణికులు ఈ బస్సులను ఎక్కటానికి మక్కువ చూపటం లేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ బస్సులు ఏ రూట్లలో నడుస్తున్నాయో తెలియక, ప్రజలు ఎక్కటం లేదని సమాచారం. సరైన రూట్ మ్యాప్ ఉంటే ప్రయాణికులు ఎక్కటానికి ఆసక్తి చూపుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒక్కో డబుల్ డెక్కర్ కోసం హెచ్ఎండీఏ రూ.2 కోట్లు వెచ్చించి కొన్నది. మొత్తం 6 బస్సులకు రూ.12 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో బస్ కి నెలకి రూ.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు చెప్తున్నారు. కాగా, ఈ బస్సుల్లో ప్రయాణిస్తే టికెట్ ధర ఎంత? ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తాయి? ఏయే స్టాపుల్లో ఆగుతాయి?  లాంటి సందేహాలను ఆ బస్సులను చూసినవారు వ్యక్తం చేస్తూ అసలు ఎక్కడం లేదు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ బస్సులను ఎక్కడెక్కడ నడపాలి? ఎంత చార్జీ వసూలు చేయాలి? అనే అవగాహన అధికారుల్లోనే లేనట్లు కనిపిస్తోంది. రూట్ మ్యాప్, స్టేజీల విషయంలోనూ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ట్రయల్ రన్ చేస్తున్నామంటూ తప్పించుకుంటున్నారు.

ఈ బస్సుల్లో ప్రస్తుతానికి జర్నీ ఉచితం. టికెట్ అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు. కొన్ని రోజుల తర్వాత కనీస ఛార్జీ విధించే అవకాశం ఉంటుందని ఓ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్కో ట్రిప్‌కి ఒక్కొక్కరి నుంచి రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అది ఎప్పటి నుంచి టికెట్ అందుబాటులోకి తీసుకొస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. పర్యాటకుల స్పందనని బట్టి మరి కొన్ని రూట్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.