నా కూతురిని ఎలా చంపాడో అఫ్తాబ్ చెప్పాడు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తనతో సహజీవనం చేసిన శ్రద్ధను చంపిన అఫ్తాబ్ పూనావాలా.. ఆమె శరీరాన్ని ముక్కముక్కలుగా నరికి అడవిలో విసిరేసిన ఘటన సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో తన కూతురు హత్య గురించి తనతో అఫ్తాబ్ పూనావాలా చెప్పాడని శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ మదన్ వాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో సాక్ష్యం చెప్పారు.  ఎలా చంపాడో వివరించాడు.. […]

Share:

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తనతో సహజీవనం చేసిన శ్రద్ధను చంపిన అఫ్తాబ్ పూనావాలా.. ఆమె శరీరాన్ని ముక్కముక్కలుగా నరికి అడవిలో విసిరేసిన ఘటన సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో తన కూతురు హత్య గురించి తనతో అఫ్తాబ్ పూనావాలా చెప్పాడని శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ మదన్ వాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో సాక్ష్యం చెప్పారు. 

ఎలా చంపాడో వివరించాడు..

శ్రద్ధను ఎలా చంపాడో, ఆమె శరీరాన్ని తన చేతులో ఎలా ముక్కలు చేశాడో అఫ్తాబ్ అమీన్ పూనావాలా తనకు చెప్పాడని వికాస్ మదన్ వాకర్ తెలిపారు. తన కూతరు హత్య కేసు విచారణ సందర్భంగా సోమవారం అదనపు సెషన్స్ కోర్టు జడ్జి మనీషా ఖురానా కక్కర్ ఎదుట సాక్ష్యం చెప్పారు. ‘‘2022 నవంబర్ 11న మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. అక్కడ అఫ్తాబ్ ఉన్నాడు. అతడు ఎవరో తెలుసా? అని పోలీసులు అడిగారు. అతడు అఫ్తాబ్ పూనావాలా అని, నా కూతురితో మూడేళ్లుగా కలిసి ఉంటున్నాడని తెలిపాను. నా బిడ్డతో చాలా సార్లు గొడవ పడ్డాడని, కొట్టాడని కూడా వివరించాను” అని వికాస్ చెప్పారు. 

‘‘మే 20న (హత్య జరిగిన రెండు రోజుల తర్వాత) శ్రద్ధా వాకర్ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేయడం గురించి అఫ్తాబ్‌ను పోలీసు అధికారులు విచారించడం నేను చూశాను. కంగారు పడిపోయిన అఫ్తాబ్.. అలాంటిదేమీ లేదని చెప్పాడు. తర్వాత అతడితో నేను మాట్లాడాను. నా కూతురు ఎక్కడుంది అని అడిగితే.. ‘ఇక లేదు’ అని చెప్పాడు. షాక్‌కు గురైన నేను.. నా కూతురిని ఏం చేశావని అడిగాను. 2022 మే 18న శ్రద్ధతో గొడవ పడ్డానని, తర్వాత తన చేతులతోనే ఆమె శరీరాన్ని ముక్కలు చేశానని చెప్పాడు” అని కోర్టుకు తెలిపారు. ‘‘శ్రద్ధను చంపిన తర్వాత.. రంపాన్ని, రెండు బ్లేడ్లు, ఓ సుత్తిని కొన్నానని అఫ్తాబ్ చెప్పాడు. రాత్రి శ్రద్ధ శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని పాలిథిన్ కవర్‌‌లో పెట్టానని తెలిపాడు” అని వికాస్ వాకర్ వివరించారు. 

2020 జనవరిలో తొలిసారి చూశా

2020 జనవరిలో తొలిసారి అఫ్తాబ్ ను చూశానని వికాస్ వాకర్ తెలిపారు. అతడిని శ్రద్థ ముంబైలోని తమ ఇంటికి తీసుకువచ్చిందని చెప్పారు. ‘‘అఫ్తాబ్‌తో సహజీవనం చేస్తానని 2019లో శ్రద్ధ చెప్పినప్పుడు మేం వ్యతిరేకించాం. దీంతో తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తాను తీసుకోగలనని శ్రద్ధ చెప్పి వెళ్లిపోయింది” అని వికాస్ చెప్పారు. తర్వాత విచారణ వాయిదా పడింది. వికాస్ సాక్ష్యాన్ని ఆగస్టు 5న రికార్డు చేయనున్నారు. 

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య

అఫ్తాబ్ పూనావాలాతో శ్రద్ధా వాకర్ సహజీవనం చేసింది. ఇందుకోసం తన ఫ్యామిలీతో విభేదించి మరీ అఫ్తాబ్ వెంట వెళ్లిపోయింది. అయితే వీరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గతేడాది మే 18న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు చేసి.. ఫ్రిడ్జిలో దాచాడు. శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచి.. కొన్ని రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. కొన్ని రోజులకు అతడి ఇంటికి కొంత దూరంలో శ్రద్ధ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు.