మాజీ ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం(Skill Development Scam)లో నిందితుడు నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)కు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులకు అదనంగా ఎలాంటి షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వాదనను హైకోర్టు(High court) తోసిపుచ్చింది. ఎక్కడా బహిరంగ ర్యాలీలు(Public rallies) నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయరాదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. అలాగే బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది.
అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు(Public comments) చేయకూడదని కూడా ఆయన్ను ఆదేశించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్(Bail) మంజూరు సమయంలో విధించిన షరతులకు అదనంగా తాజా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించకుండా చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలన్న సీఐడీ(CID) అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జున రావు(Justice Tellapragada Mallikarjuna Rao) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్కిల్ స్కామ్ కేసు(Skill scam case)లో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స(Eye surgery) నిమిత్తం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధించిన షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ(CID) అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు కేవలం అరోగ్య పరిస్థితి ఆధారంగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తాజా ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను కస్టోడియల్ బెయిల్(Custodial bail)తో సమానంగా పరిగణించడనికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు.
‘చంద్రబాబు(Chandrababu)ను చూడకుండా ప్రజలను నియంత్రిస్తూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌లో చంద్రబాబు ఎక్కడా ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరలేదు. మెడికల్ బెయిల్(Medical bail)కు అదనంగా బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు చంద్రబాబు అనుమతి కోరి ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
మా ముందున్న ఆధారాలను పరిశీలించిన తరువాత రాజకీయ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా చంద్రబాబును ఆదేశించేందుకు ఈ కోర్టు సుముఖత చూపుతోంది. ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులను హరించడం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది కోర్టు విధిస్తున్న సహేతుక ఆంక్ష మాత్రమే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో ఈ నెల 31న విధించిన షరతులకు అదనంగా ఈ షరతులు విధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బుధవారం హైదరాబాద్ లో చంద్రబాబు ర్యాలీ(Chandrababu Rally)పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ర్యాలీ చేశారని బేగంపేట పోలీసులు ర్యాలీపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఎస్ఐ జయచందర్(SI Jayachander) ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ర్యాలీ ద్వారా 2 గంటల పాటు రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీ నాయుడు(Jeevi Naidu) సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సుమారు 400 మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ చేశారని పోలీసులు తెలిపారు. 2 గంటలు రోడ్లపై అలా వెళ్లడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వెల్లడించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు.