కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడ్డ సుప్రియా సులే..

మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏడాది కిందట శివసేనను ఏక్‌నాథ్ షిండే చీలిస్తే.. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని అజిత్ పవార్ చీల్చారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వెళ్లి.. శివసేన–బీజేపీ ప్రభుత్వంతో కలిశారు. నెల రోజుల కిందట ఈ వ్యవహారం రేపిన ఈ అలజడి ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శరద్‌ పవార్‌‌, అజిత్‌ పవార్‌‌పై కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పలు అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. శరద్ పవార్‌‌ లేదా ఆయన కూతురు సుప్రియా […]

Share:

మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏడాది కిందట శివసేనను ఏక్‌నాథ్ షిండే చీలిస్తే.. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని అజిత్ పవార్ చీల్చారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వెళ్లి.. శివసేన–బీజేపీ ప్రభుత్వంతో కలిశారు. నెల రోజుల కిందట ఈ వ్యవహారం రేపిన ఈ అలజడి ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శరద్‌ పవార్‌‌, అజిత్‌ పవార్‌‌పై కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పలు అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. శరద్ పవార్‌‌ లేదా ఆయన కూతురు సుప్రియా సులేకు కేంద్ర మంత్రి పదవి ఖరారైందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై సుప్రియా సులే తీవ్రంగా స్పందించారు. తమకు ఎలాంటి ఆఫర్లు రాలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.

వాళ్లనే అడగండి..

మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్విరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లేదా సుప్రియా సులేలో ఎవరో ఒకరికి కేంద్ర కేబినెట్‌లో కేంద్ర మంత్రి పదవి కోసం ఆఫర్ వచ్చిందని ఆయన అన్నారు. ముంబైలో ఈ విషయాన్ని సుప్రియా సులే వద్ద మీడియా ప్రస్తావంచింది. దీంతో స్పందించిన ఆమె.. ‘‘కేంద్ర మంత్రి పదవిని ఇస్తామంటూ మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. అసలు ఆ విషయంలో ఎలాంటి చర్చలు కూడా జరగలేదు. కాంగ్రెస్ నేతలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్లు అలా ఎందుకు మాట్లాడుతున్నారో మీరే (మీడియా) అడగాలి. నాకైతే తెలియదు. నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గౌరవ్ గొగోయ్ వంటి నేతలతో టచ్‌లోనే ఉన్నాను. కానీ మహారాష్ట్రలోని ఆ పార్టీ నేతలతో మాత్రం టచ్‌లో లేను” అని చెప్పుకొచ్చారు. 

బాబాయ్, అబ్బాయ్‌ సమావేశంపై వివాదం

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్.. పార్టీలో కీలకంగా ఉండేవారు. అయితే ఇటీవల ఎన్సీపీలోని పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే బీజేపీలో చేరకుండా.. కేవలం ఎన్సీపీ చీలిక వర్గంగానే సంకీర్ణ ప్రభుత్వంలో భాగమయ్యారు. ఈ క్రమంలో తన చిన్నాన్న శరద్‌ పవార్‌‌తో ఇటీవల పలుమార్లు భేటీ అయ్యారు. కొన్ని రోజుల కిందట రహస్య భేటీ జరిగిందని వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు ఉండటమే ఇందుకు కారణం. శరద్, అజిత్ భేటీ కావడాన్ని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ప్రశ్నించారు. ‘‘అజిత్ పవార్‌‌ను సీఎంను చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ షరతు పెట్టారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరేలా శరద్ పవార్‌‌ను ఒప్పించాలని కండిషన్ పెట్టారు” అని ఆరోపించారు. 

‘‘శరద్‌ పవార్‌‌ను అజిత్ పవార్ తరచూ ఎందుకు కలుస్తున్నారు? ఎన్సీపీ, శివసేనలో చీలిక తర్వాత బీజేపీ మరింత బలోపేతం అయింది. శరద్ పవార్ ప్రజాబలం ఉన్న నేత కావడంతో ఆయన్ను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆయన సాయం లేకుంటే.. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను బీజేపీ గెలుచుకోలేదు” అని చెప్పుకొచ్చారు.  ‘‘శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య జరుగుతున్న సమావేశాలకు మరో కారణం కూడా ఉంది. శరద్‌ పవార్‌‌ను ఒప్పించలేకపోతే సీఎం కాలేవని అజిత్‌ పవార్‌‌కు ప్రధాని మోదీ చెప్పారు” అని విజయ్ వాడెట్టివార్ అన్నారు. 

నా అన్న కొడుకుతో మాట్లాడితే తప్పేంటి?: శరద్

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో తాము చేరుతామంటూ వస్తున్న ఊహానాగాలపై శరద్ పవార్ ప్రతిసారి స్పష్టత ఇస్తూనే ఉన్నారు. తాము బీజేపీతో కలిసేదే లేదని చెబుతున్నారు. అజిత్‌ పవార్‌‌తో జరిగింది రహస్య సమావేశం కాదని అంటున్నారు. ‘‘నా అన్న కొడుకును నేను కలిస్తే ఏంటి సమస్య? ఎవరో ఒకరి ఇంట్లో సమావేశమైతే అది రహ్యం ఎలా అవుతుంది? నేను అప్పుడు అజిత్ ఇంట్లో ఉన్నా” అని స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహారాష్ట్ర రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?