నిన్నటి దాకా ట్యాక్సీ డ్రైవర్..

కృషి ఉంటే మనుషులు రుషులవుతారట. కావాల్సిందల్లా పట్టుదల, నిబద్ధత, కష్టించేతత్వం.. వీటన్నింటికీ మించి సహనం. ఇవి ఉంటే ఎంతటి లక్ష్యమైనా పాదాక్రాంతమవుతుంది. ఆ యువతి కష్టాలకు లొంగలేదు, పరిస్థితులు పరీక్షించినా పట్టు వీడలేదు, కుటుంబ భారాన్ని మోసింది. అమ్మాయి డ్రైవరా? అంటూ వెక్కిరించే మాటలను భరించింది.‘‘మొదట నిన్ను పట్టించుకోరు, తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆ తర్వాత నీతో పోరాడుతారు, అప్పుడు నువ్వు గెలుస్తావు” అంటూ జాతి పిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలను నిజం చేసింది. […]

Share:

కృషి ఉంటే మనుషులు రుషులవుతారట. కావాల్సిందల్లా పట్టుదల, నిబద్ధత, కష్టించేతత్వం.. వీటన్నింటికీ మించి సహనం. ఇవి ఉంటే ఎంతటి లక్ష్యమైనా పాదాక్రాంతమవుతుంది. ఆ యువతి కష్టాలకు లొంగలేదు, పరిస్థితులు పరీక్షించినా పట్టు వీడలేదు, కుటుంబ భారాన్ని మోసింది. అమ్మాయి డ్రైవరా? అంటూ వెక్కిరించే మాటలను భరించింది.‘‘మొదట నిన్ను పట్టించుకోరు, తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, ఆ తర్వాత నీతో పోరాడుతారు, అప్పుడు నువ్వు గెలుస్తావు” అంటూ జాతి పిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలను నిజం చేసింది. తనను చూసి నవ్విన నోళ్లే, ఇప్పుడు ప్రశంసించే స్థాయికి చేరింది. ఇంతకీ ఎవరామె? ఏమా కథ?

ఓయూలో ఎంఏ చదివినా..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడి రేగుంత గ్రామంలో నివసిస్తోంది కిరణ్ కుర్మా. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివింది. ఆమెకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక. కానీ కుటుంబ భారం, కష్టాలు. అయినప్పటికీ ఎన్నడూ నిరుత్సాహపడలేదు. తన తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ పోషణ కోసం గిరిజన ప్రాంతాల్లో ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తోంది. రేగుంత – సీరొంచ మధ్య ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తోంది. నడుపుతుంది. తన వద్ద ప్రస్తుతం మూడు ట్యాక్సీలు ఉన్నాయి.ఈ క్రమంలో ఉన్నత చదువులు చదువుకోవాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు సీఎంను ఆర్థిక సాయం అడగాలని భావించింది.

సీఎంనే సాయం అడుగుదామని.. 

అనుకుందే తడవుగా ముంబైకి బయలుదేరింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసేందుకు వెళ్లింది. కానీ ఆమెకు తొలుత షిండేను కలవడం సాధ్యపడలేదు. కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో తన ఫ్రెండ్‌ను సాయం అడిగింది. అలా మిత్రుల సాయంతో విధాన్‌ భవన్‌లోకి వెళ్లేందుకు అవకాశం దక్కించుకుంది. అదృష్టంకొద్దీ విధాన్‌ భవన్‌కు కిరణ్ చేరుకున్న సమయంలో సీఎం అక్కడే ఉన్నారు. ఆయన్ను కలిసిన కిరణ్, తన దరఖాస్తును ఆయనకు అందజేసింది. తన పరిస్థితిని, తన కలను ఆయనకు వివరించింది. సానుకూలంగా స్పందించిన షిండే, ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సుమంత్ భంగేకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వీలైనంత త్వరగా సాయం మంజూరు చేయాలని సూచించారు. సాంఘిక శాఖ ఆఫీసుకు వెళ్లాలని కిరణ్‌కు సీఎం సూచించారు. 

రూ.40 లక్షలు మంజూరు

సాయం త్వరగా మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఆమె దరఖాస్తును వాట్సాప్‌లో సుమంత్ భంగేకు సీఎం షిండే పంపారు. దీంతో ఆమె సాంఘిక శాఖకు వెళ్లకముందే అప్లికేషన్ అక్కడికి చేరుకుంది. ఇంకేముంది అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయింది. సుమారు రూ.40 లక్షల స్కాలర్‌‌షిప్‌ను కిరణ్ అందుకోనుంది. తనకు వచ్చిన సాయంతో బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ లో ఏడాది కోర్సును కిరణ్ చదువుకోనుంది. ఆ చదువు తర్వాత అక్కడే రెండేళ్లు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత దేశానికి తిరిగి రావాలని అనుకుంటోంది. ఇన్ని రోజుల కష్టాలకు ఇక తెరపడనుంది. ఉన్నత స్థాయి చదువులకు అవకాశం వచ్చింది. నీ కష్టం ఊరికే పోలేదు కిరణ్ కుర్మా.. విజయీభవ!!

చేసే పనిలో చెప్పే మాటలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా విజయం సాధించవచ్చు, కిరణ్ ను చూసి వెక్కిరించిన వారే ఇప్పుడు ఆమెను చూసి ఔరా అంటున్నారు. అంతేకాదు కష్టాలను చూసి భయపడకుండా ఇష్టమైన దాని కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించవచ్చు అని కూడా నిరూపించింది కిరణ్ కుర్మా.