నా జూనియర్లు అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్లు

ఓ మొక్కను నాటి.. తర్వాత కొన్నేళ్లకు అది భారీ వృక్షంగా మారితే చూడటానికి ఎంత సంతోషంగా ఉంటుంది. మనం సాయం అందించిన వ్యక్తులు.. ఉన్నత స్థాయికి ఎదిగితే ఎంత సంతృప్తిగా ఉంటుంది.. జీవితంలో కళ్లుమూసుకున్నప్పుడు మన మనసుల్లో మెదలాడే అపురూప క్షణాలివి. ఓ సాయం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తుంది.. 2017 నాటి ముచ్చట ఇది.. తన జూనియర్లకు కోడింగ్ క్లాసులు తీసుకోన్నాడో సీనియర్ స్టూడెంట్. ఆరేళ్లు గడిచాయి. ఇప్పుడు తాను గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మరి తన […]

Share:

ఓ మొక్కను నాటి.. తర్వాత కొన్నేళ్లకు అది భారీ వృక్షంగా మారితే చూడటానికి ఎంత సంతోషంగా ఉంటుంది. మనం సాయం అందించిన వ్యక్తులు.. ఉన్నత స్థాయికి ఎదిగితే ఎంత సంతృప్తిగా ఉంటుంది.. జీవితంలో కళ్లుమూసుకున్నప్పుడు మన మనసుల్లో మెదలాడే అపురూప క్షణాలివి. ఓ సాయం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తుంది..

2017 నాటి ముచ్చట ఇది.. తన జూనియర్లకు కోడింగ్ క్లాసులు తీసుకోన్నాడో సీనియర్ స్టూడెంట్. ఆరేళ్లు గడిచాయి. ఇప్పుడు తాను గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మరి తన జూనియర్లు? వాళ్లేం తక్కువ తిన్నారా? వాళ్లూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. ఇంతకీ సీనియర్, జూనియర్ల కథేంటి? 

ఫస్ట్ బెంచ్ బ్యాచ్!

2017లో పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి ప్రభుత్వ కాలేజీలో రాజ్ విక్రమాదిత్య చదువుకున్నాడు. అప్పట్లో తన జూనియర్లకు కోడింగ్ ఎలా చేయాలో చెప్పాడు. తాను చదువుకుంటూనే వాళ్లకు క్లాసులు చెప్పాడు. అప్పట్లో క్లాసులో కరెంటు పోతే.. స్టూడెంట్లు ఫోన్లలో లైట్లు ఆన్ చేసి మరీ క్లాసులు విన్నారట. ఈ విషయాన్నే అతడే వెల్లడించాడు. ట్విట్టర్‌‌ (ఎక్స్)లో ఈ మేరకు రాసుకొచ్చాడు. అప్పుడు తన క్లాసులో ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్న వాళ్లంతా ఇప్పుడు అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారని చెప్పాడు. ‘‘నాడు కరెంటుపోయినా లైట్లు ఆన్ చేసుకుని క్లాసులు విన్నారు. నా క్లాసుల్లో ఫస్ట్ బెంచ్‌లలో కూర్చున్న వాళ్లందరూ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారని తెలిసింది. ఈ క్షణం నా గుండెల్లో ఎన్నటికీ నిలిచిపోతుంది” అని విక్రమాదిత్య రాసుకొచ్చాడు.

గతంలో తాను అమెజాన్‌లో పని చేసి..

తన జూనియర్లు అమెజాన్‌లో పని చేయడంపై విక్రమాదిత్య ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్లు అమెజాన్‌లో ఉంటారని తాను ఎన్నడూ అనుకోలేదని చెప్పాడు. ఈ మేరకు క్లాస్‌ రూమ్ ఫొటోను విక్రమాదిత్య షేర్ చేశాడు. అలాగే తన జూనియర్లు ఏ హోదాలో పని చేస్తున్నారో వివరించాడు. వాళ్ల పేర్లు, పక్కన హోదా ఉన్న స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం పోలాండ్‌లో గూగుల్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా విక్రమాదిత్య పని చేస్తున్నాడు. నిజానికి ఇతడు కూడా గతంలో అమెజాన్‌లో పని చేయడం గమనార్హం. ‘‘నేను సెకండియర్‌‌లో ఉన్నప్పుడు.. ఓ క్లాస్‌ చెబుతుండగా తీసుకున్న ఫొటో ఇది.. కోడింగ్ క్లాస్ కొనసాగుతుండగానే.. కరెంటు పోయింది. వెంటనే అందరూ ఫోన్లలో ఫ్లాష్ లైట్‌ను ఆన్ చేశారు. మన జీవితంలో కొన్ని క్షణాలు హృదయంలో నిలిచిపోతాయి.. ఇవి అలాంటి క్షణాలే” అని పేర్కొన్నాడు  

లైకులు, కామెంట్ల వర్షం

విక్రమాదిత్య షేర్ చేసిన ఈ స్టోరీకి భారీగా లైకులు, కామెంట్లు వచ్చి పడుతున్నాయి. వేలాది మంది లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు. చాలా స్ఫూర్తిదాయకమని, గొప్ప విషమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘నువ్వు చేసిన పని చాలా గొప్పది సోదరా” అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. మరోవైపు తన పోస్టుకు కామెంట్ పెట్టిన ఓ వ్యక్తికి విక్రమాదిత్య రిప్లై ఇచ్చాడు. ‘‘అన్నయ్యా.. నేను బీ టెక్ చదువుతున్నాను. రేపు థర్డ్ ఇయర్‌‌లో నా మొదటి రోజు. ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలరా?” అని స్టూడెంట్ అడగ్గా.. ‘సహనం’ అంటూ విక్రమాదిత్య బదులిచ్చాడు.