ఇండియా కాదు… భారత్..? 

ఇండియా పేరును భారత్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతున్నదా? లోక్‌సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో భావోద్వేగ అంశానికి మోదీ సర్కారు తెరలేపనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతిథుల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌ ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంపింది. అయితే వాటిల్లో సంప్రదాయానికి విరుద్ధంగా […]

Share:

ఇండియా పేరును భారత్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చబోతున్నదా? లోక్‌సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో భావోద్వేగ అంశానికి మోదీ సర్కారు తెరలేపనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతిథుల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌ ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంపింది. అయితే వాటిల్లో సంప్రదాయానికి విరుద్ధంగా రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’గా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విందు ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. పేరు మార్పునకు సంబంధించి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి.

జీ20 పత్రాల్లోనూ మార్పు

జీ20 సదస్సుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లలో కూడా దేశం పేరును భారత్‌గా ప్రస్తావించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జీ 20 అతిథుల కోసం ‘భారత్‌-ది మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ పేరుతో ఓ బుక్‌లెట్‌ తయారు చేశారు. ‘భారత్‌ అనేది దేశ అధికారిక పేరు. రాజ్యాంగంలో దీని ప్రస్తావనతో పాటు 1946-48 చర్చల్లో కూడా ఉన్నది’ అని అందులో పేర్కొన్నారు. భారత్‌ అంటే ఇండియాలో పాలనలో ప్రజల సమ్మతి తీసుకోవడం చరిత్ర తొలినాళ్ల నుంచి జీవితంలో భాగమైంది’ అని బుక్‌లెట్‌లో రాశారు.

రాజకీయ దుమారం..

దేశం పేరు మార్పు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. దేశంలో నెలకొన్న ధరాఘాతం, నిరుద్యోగం, వ్యవసాయ, పరిశ్రమ రంగాల సంక్షోభం, సరిహద్దు అంశం, తదితర సమస్యలతో పాటు అదానీ వ్యవహారం, మణిపూర్‌ హింసాకాండ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నదని విపక్షాలు పేర్కొన్నాయి. దేశాన్ని మారుస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు అందులో విఫలమై, పేర్లు మార్చు పనిలో పడిందని విపక్ష నేతలు దుయ్యబట్టారు. విపక్ష కూటమికి ‘ఇండియా’గా పేరు పెట్టుకోవడంపై అధికార బీజేపీ భయపడుతున్నదని, అందుకే పేర్పు మార్పును తెరపైకి తీసుకొచ్చిందని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు.

ఆరెస్సెస్‌ చీఫ్‌ చెప్పిన నాలుగు రోజులకే..

‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ ప్రస్తావనను అధికార బీజేపీ సమర్థించుకొన్నది. ‘భారతదేశం అనే పేరు రాజ్యాంగంలో ప్రస్తావించబడింది. ఆ పేరుతో దేశాన్ని వేల సంవత్సరాలుగా పిలుస్తున్నారు. మన దేశం భారత్‌.. భారత్‌గానే ఉంటుంది. ఇండియా అనేది ఇంగ్లిష్‌ పదం. దాన్ని బ్రిటీష్‌ వాళ్లు ఉపయోగించారు’ అని అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. భారత్‌ పదం వినియోగాన్ని వీహెచ్‌పీ ఆహ్వానించింది. దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్‌గా పేర్కొనాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అస్సాంలో జరిగిన ఓ సమావేశంలో నొక్కిచెప్పిన నాలుగు రోజులకు తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

పేర్ల మార్పు తప్ప ఏమీ లేదు- తమిళనాడు సీఎం స్టాలిన్‌

దేశాన్ని మారుస్తానని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, తొమ్మిది సంవత్సరాల తర్వాత జరిగింది దేశం పేరు మాత్రమే. విపక్షాల కూటమిని చూసి అధికార బీజేపీ భయపడినట్టు కనిపిస్తున్నది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీని తప్పకుండా ఓడిస్తాం.

హడావిడిగా ఎందుకు- బెంగాల్‌ సీఎం మమత

ఇండియా పేరును మారుస్తున్నారని విన్నాను. దేశాన్ని ఇప్పటికే భారత్‌ అని కూడా పిలుస్తున్నాం. అందులో కొత్తేముంది? ఇంగ్లిష్‌లో ఇండియా అని అంటాం. ఇక కొత్తగా చేయాల్సిన పనిలేదు. ఈ ప్రపంచానికి మనం ఇండియాగా తెలుసు. ఇంత అకస్మాత్తుగా దేశం పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతున్నది.

ప్రజల దృష్టి మరల్చే యత్నం- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ దేశం 140 కోట్ల మందికి చెందినది, ఏ ఒక్క పార్టీకో చెందినది కాదు. ఒకవేళ విపక్ష ‘ఇండియా’ కూటమి తన పేరును ‘భారత్‌’గా మార్చుకొంటే, అప్పుడు బీజేపీ దేశం పేరును మారుస్తుందా? దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చింది.