తెలంగాణలో మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు

రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మొదటి రెండు రోజుల్లో మంచి స్పందన లభించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలను ప్రారంభించగా.. మొదటి రెండు రోజుల్లో మంచి ఆదరణ లభించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసే కార్యక్రమాన్ని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో […]

Share:

రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మొదటి రెండు రోజుల్లో మంచి స్పందన లభించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలను ప్రారంభించగా.. మొదటి రెండు రోజుల్లో మంచి ఆదరణ లభించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసే కార్యక్రమాన్ని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ బుధవారం నాడు ప్రారంభించారు. మహిళా పాత్రికేయులకు పూర్తి ఆరోగ్యం అందించాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరోగ్య శిబిరాలు ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలకూ ఉచితంగా హెల్త్ చెక్ అప్ నిర్వహించి, వారికి పూర్తి ఆరోగ్యం అందించడం కోసం సంకల్పించారని, అందులో భాగంగానే మహిళా పాత్రికేయులకు ఫ్రీ హెల్త్ చెక్ అప్ పరీక్షలు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా మార్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 

మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటీఆర్.. మహిళా జర్నలిస్టులకి భారీ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ ఆరోగ్య శిబిరం ప్రారంభిస్తున్నామని తెలిపారు.

అక్రిడేషన్ ఉన్న మహిళా జర్నలిస్టుల కోసం మాసబ్ ట్యాంక్‌లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలోని సమాచార భవన్‌లో పది రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మహిళా జర్నలిస్టులకు సూచించారు. ఉచిత ఆరోగ్య పరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్థిక భారం ఉండకూడదని పూర్తి ఆరోగ్యాంగా ఉండాలని సీఎస్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి మహిళా జర్నలిస్టు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచించారు. కాగా.. శిబిరం నిర్వహణ పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం  కంటి వెలుగు పరీక్షలు, కేసీఆర్ కిట్, ఉచిత ఆరోగ్య శిబిరాలు లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం మాతా, శిశు మరణాల రేటును తగ్గించడంలో మొదటి స్థానంలో ఉన్నదని చీఫ్ సెక్రటరీ అన్నారు.

ఇక మన తెలంగాణా రాష్ట్రంలో కంటి వెలుగు ప్రారంభ దశ కార్యక్రమంలో కోటిన్నర మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 45 లక్షల మందికి కంటి అద్దాల పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మరో వైపు రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమంలో ఒక కోటి 70 లక్షల మందికి కంటి పరీక్షలు చేయాలని సంకల్పించామని రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.

సమగ్ర ఆరోగ్య పరీక్షలో పూర్తి బ్లడ్ టెస్ట్, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయని శాంతికుమారి తెలిపారు.. ఇందులో ఇసిజి, ఎక్స్‌రే, అల్ట్రా సోనో గ్రఫీ, మామో గ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ పరీక్ష, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, గైనకాలజీ వంటి వివిధ పరీక్షలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి.. సమాచార శాఖ కమీషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్,  వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఆరోగ్య శాఖ కమీషనర్ శ్వేతా మహంతి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు.