అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు వాసుల దుర్మరణం

టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం కోనసీమ జిల్లా వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు.

Courtesy: IDL

Share:

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం కోనసీమ జిల్లా వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిని పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు ఇటీవల అమెరికా వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అమెరికాలో ప్రమాదానికి గురయ్యారు. పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి.

నాగేశ్వరరావు కుమార్తె, అల్లుడు కొద్ది నెలల క్రితం స్వస్థలమైన అమలాపురంకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారితో కలిసి నాగేశ్వరరావు దంపతులు టెక్సాస్‌ వెళ్లారు. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా పోలీసుల నుంచి బంధువులకు సమాచారం అందించారు. ఎదురెదురుగా వస్తున్న కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. అమెరికాలోని జాన్సన్ కౌంటీలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారి పార్థివదేహాలను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ తెలిపారు.