ఢిల్లీ హోటల్లో హైడ్రామా..

భారత్‌లో అత్యంత వైభవంగా జరిగిన జీ20 సమావేశాలకు దాదాపు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జీ 20 అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు విజయవంతమై.. ఢిల్లీ డిక్లరేషన్‌‌కు ఏకాభిప్రాయం లభించింది. సమావేశాలు విజయవంతంగా ముగిశాక వారంతా తమతమ దేశాలకు తిరిగి పయనమయ్యారు.  అయితే, ఈ సదస్సుకు ముందు ఢిల్లీలోని విదేశీ నేతలకు బస ఏర్పాటు చేసిన ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో 12 గంటల పాటు హైడ్రామా నడిచిన విషయం వెలుగులోకి వచ్చింది. […]

Share:

భారత్‌లో అత్యంత వైభవంగా జరిగిన జీ20 సమావేశాలకు దాదాపు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జీ 20 అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు విజయవంతమై.. ఢిల్లీ డిక్లరేషన్‌‌కు ఏకాభిప్రాయం లభించింది. సమావేశాలు విజయవంతంగా ముగిశాక వారంతా తమతమ దేశాలకు తిరిగి పయనమయ్యారు.  అయితే, ఈ సదస్సుకు ముందు ఢిల్లీలోని విదేశీ నేతలకు బస ఏర్పాటు చేసిన ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో 12 గంటల పాటు హైడ్రామా నడిచిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ వర్గాలను ఇది ఆందోళనకు గురిచేసింది.

జీ20 సదస్సు కోసం భారతదేశానికి వచ్చిన చైనా ప్రతినిధి బృందానికి తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఆతిథ్యం ఇచ్చారు. చైనా ప్రతినిధి బృందం తమ వెంట తీసుకొచ్చిన భారీ బ్యాగులు హోటల్ తాజ్ ప్యాలెస్‌లోని భద్రతా అధికారుల దృష్టిని ఆకర్షించడంతో హైడ్రామా మొదలైంది. ‘డిప్లమాటిక్ బ్యాగేజీ’ని తగ్గించుకోవాలని ప్రతినిధు బృందానికి సూచించినా.. వాటి పరిమాణం చాలా పెద్దదిగా ఉండటం అనేక అనుమానాలను రేకెత్తించింది. 

అయితే, దౌత్యపరమైన ప్రోటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని.. భద్రతా సిబ్బంది బ్యాగ్‌లను హోటల్ లోపలికి అనుమతించారు. వారికి కేటాయించిన గదిలో అనుమానాస్పద సామాగ్రి ఉన్నట్టు అక్కడ సిబ్బంది ఒకరు గుర్తించి, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే ఉన్నతాధికారులు స్పందించి స్కానర్‌లో బ్యాగ్‌లను ఉంచమని చైనా బృందాన్ని కోరారు. అందుకు చైనీయులు అంగీకరించకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

అంతేకాదు, చైనా ప్రతినిధి బృందం ప్రత్యేక, ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్‌ కోరగా.. వారి అభ్యర్థనను హోటల్ తిరస్కరించింది. చివరకు ఆ సామగ్రిని ఢిల్లీలోని తమ దౌత్య కార్యాలయానికి పంపేందుకు చైనా సెక్యూరిటీ అంగీకరించడంతో 12 గంటల హైడ్రామాకు తెరపడిందని హోటల్ వర్గాలు తెలిపాయి. యాదృచ్ఛికంగా వచ్చే ఏడాది జీ20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే బ్రెజిల్ అధ్యక్షుడు లూలూ కూడా అదే హోటల్‌లో బస చేశారు. 

బ్యాగుల్లోని సామాగ్రిని తనిఖీ చేయాలన్న అభ్యర్థనను చైనా భద్రతా సిబ్బంది ప్రతిఘటించారని తాజ్ హోటల్‌ వద్ద భద్రతా విధులు నిర్వహించిన వర్గాలు ధ్రువీకరించాయి. అయితే, భారత భద్రతా బృందం తొందరపడకుండా వేచిచూసిందని తెలిపాయి. ‘చైనా భద్రతా అధికారి వచ్చే వరకూ ముగ్గురు భద్రతా సిబ్బంది ఆ గది బయట సుమారు 12 గంటల పాటు వేచి చూశారు… అనంతరం ఆ అధికారి బ్యాగులను రాయబార కార్యాలయానికి పంపుతామని చెప్పారు’ అని పేర్కొన్నాయి.

బ్యాగులోని సామాగ్రిని పరిశీలించే అవకాశం లభించనందున ఇవి ‘నిఘాకు సంబంధించినవి’ అని ఖచ్చితంగా చెప్పలేమని ఉన్నతాధికారులు అన్నారు. ఇంటెలిజెన్స్ అధికారి తన సీనియర్లకు అందించిన సమాచారం ప్రకారం.. సాధారణంగా ఇటువంటి పరికరాలు సురక్షిత కమ్యూనికేషన్ ఛానెల్‌లను జామ్ చేయడానికి, అంతరాయం కలిగించడానికి ఉపయోగిస్తారు. అయితే, సూట్‌కేసుల్లో ఏముందో మిస్టరీగా మిగిలిపోయింది.

సెప్టెంబరు 9-10 తేదీలలో జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సు సందర్భంగా భారత్ పలు దేశాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో చైనా టెన్షన్ బాగా పెరిగింది. జీ-20 సదస్సులో భారత్ బలాన్ని చూసి చైనా చలించిపోయింది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. జిన్‌పింగ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రాలేదు. ఆయన స్థానంలో ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు. చివరి నిమిషంలో తన పర్యటనను వెల్లడించిన లీ.. సీనియర్ నాయకుల కోసం ఉద్దేశించిన సాధారణ ‘ప్రత్యేక విమానం’లో కాకుండా చార్టర్డ్ ఫ్లైట్‌లో వచ్చి భారతీయ ఏజెన్సీలను ఆశ్చర్యపరిచారు.