Liquor Scam: నేడు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయనున్న ఈడీ? ఆప్ నేతల ఆందోళన

Delhi CM Arvind Kejriwal: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) గురువారం ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)’ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Courtesy: Top Indina News

Share:

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)’ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందంటూ ఆప్‌ పార్టీ నాయకులు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌, జాస్మిన్‌ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెళ్లడించారు. 

‘‘కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇంట్లో ఈడీ సోదాలు జరపనున్నట్లు మాకు సమాచారం అందుతోంది. బహుశా ఆయన్ని అరెస్ట్‌ చేయొచ్చు’’ అని ఆప్‌ కీలక నేత ఆతిశీ బుధవారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ఈడీ ఆయన ఇంటికి వెళ్లనుందంటూ భరద్వాజ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్లే రోడ్లను ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆయన అరెస్టుపై తమ అనుమానాలకు బలం చేకూరిందంటూ పార్టీ నాయకులు అంటున్నారు.

కాగా, ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరోసారి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన.. మూడోసారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై దర్యాప్తు సంస్థ స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై ఈడీ మౌనం చూస్తుంటే ఏదో అవాంఛనీయ రహస్యాన్ని దాయడమే కాక, అపారదర్శకంగా, పక్షపాతంతో ఉన్నట్టు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు.