హైదరాబాద్‌లో 2 శాతం పెరిగిన క్రైం రేటు: సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి

Hyderabad annual crime report 2023: హైదరాబాద్ నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర వార్షిక నివేదికను ఆయన శుక్రవారం విడుదల చేశారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: హైదరాబాద్‌లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ  శ్రీనివాస్‌రెడ్డి  తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర వార్షిక నివేదికను ఆయన శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం మేర పెరిగాయన్నారు. ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్‌ పీఎస్‌లు పెరిగాయన్నారు.  నగరంలో ప్రస్తుతం 31 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

‘‘చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్‌ నిమజ్జనోత్సవం, మిలాద్‌ ఉన్‌ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి.  గతేడాది సైబర్‌ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయి. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నైపర్‌ డాగ్స్‌ను వినియోగిస్తాం. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నాం’’ అని సీపీ వెల్లడించారు.


సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు పెరిగాయని, అలాంటివాటిని వేగంగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది దోపిడీలు 9 శాతం అధికమవగా, పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయని వెల్లడించారు. మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయి. సైబర్‌ నేరాలు 11 శాతం పెరిగాయన్నారు.ఈ ఏడాది 79 హత్యలు, 242 కిడ్నాప్‌లు, 4,909 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2637 జరుగగా, 262 హత్యాయత్నాలు, 91 చోరీలు జరిగాయని తెలిపారు. పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ అయిందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో 63 శాతం నేరస్థులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందని చెప్పారు. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. దేశంలో మొదటిసారిగా సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించామని తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలను రాత్రి 1 లోపు ఆపివేయాలి: సీపీ
నూతన సంవత్సర వేడుకలను రాత్రి 1 లోపు ఆపివేయాలని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పబ్బులు, బార్‌లలో డ్రగ్స్‌ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల పోస్టింగ్‌లపై సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ.. సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగ్‌లు అడిగితే ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. సమర్థులైన అధికారులను మాత్రమే విధుల్లో ఉంచుతామన్నారు. పోస్టింగుల విషయంలో రాజకీయాలు లేకుండా చూస్తామని.. విధుల్లో నిర్లక్ష్యం, ఇప్పటికే నేరాల్లో పాల్గొన్న 8 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఏడుగురు సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారన్నారు.