హర్యానా హింసలో గో సంరక్షక నేత బిట్టూ బజరంగీ అరెస్ట్‌..

హర్యానాలోని నుహ్‌లో జులై 31న జరిగిన మత ఘర్షణలకు సంబంధించి గోసంరక్షక అధ్యక్షుడు బిట్టూ బజరంగీ అలియాస్‌ రాజ్‌కుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తావడూ పట్టణంలో పక్కా సమాచారంతో సివిల్‌ డ్రెస్‌ లో వచ్చిన పోలీసులు బిట్టూను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అల్లర్లు, హింస, దోపిడీ, బెదిరింపులు, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, మారణాయుధాలతో హాని కలిగించడం వంటి అభియోగాలు బిట్టూపై ఉన్నాయి.  బిట్టూ బజరంగీ ఫరీదాబాద్‌లో గో రక్షక బజరంగ్‌ బృందానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ […]

Share:

హర్యానాలోని నుహ్‌లో జులై 31న జరిగిన మత ఘర్షణలకు సంబంధించి గోసంరక్షక అధ్యక్షుడు బిట్టూ బజరంగీ అలియాస్‌ రాజ్‌కుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తావడూ పట్టణంలో పక్కా సమాచారంతో సివిల్‌ డ్రెస్‌ లో వచ్చిన పోలీసులు బిట్టూను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అల్లర్లు, హింస, దోపిడీ, బెదిరింపులు, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, మారణాయుధాలతో హాని కలిగించడం వంటి అభియోగాలు బిట్టూపై ఉన్నాయి. 

బిట్టూ బజరంగీ ఫరీదాబాద్‌లో గో రక్షక బజరంగ్‌ బృందానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ బృందం సోషల్‌ మీడియాలో తనను తాను ‘‘జంతు సంరక్షణ సేవ”గా చెప్పుకుంటూ ఉంటుంది. దాని సోషల్‌ మీడియా అకౌంట్లలో ‘లవ్‌ జిహాద్‌’కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్ట్‌ లు పెడుతూ ఉంటుంది. హిందూ స్త్రీలను మతం మార్చడానికి ముస్లింలు కుట్ర పన్నారని బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆరోపించారు. 

బిట్టూ బజరంగీ మోస్ట్ వాంటెడ్‌ బజరంగ్‌ దళ్‌ ముఖ్య నేత మోను మనేసర్‌‌కి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. అలాగే, నుహ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించి పోలీసుల దృష్టిలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు ముస్లింల హత్యలో మోను మనేసర్‌‌ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇంతవరకు మనేసర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడు. అయినా సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూనే ఉన్నాడు. 

హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్‌ నిర్వహించిన మార్చ్‌కు ముందు బిట్టూ బజరంగీ జనాలను రెచ్చగొట్టే వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ వీడియో మతపరమైన ఉద్రిక్తతను రేకెత్తించేవిగా ఉన్నాయన్నారు. వీహెచ్‌ నిర్వహించిన యాత్రలో ఆయన కూడా ఉన్నారు. ఈ క్రమంలో బిట్టూ బజరంగీ ఆగస్టు 4న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై అతన్ని విడుదల చేశారు. మళ్లీ తాజాగా మంగళవారం అరెస్ట్ చేశారు.  

సీనియర్‌‌ పోలీసు అధికారి ప్రకారం.. ఊరేగింపుపై దాడి జరిగిన సమయంలో బిట్టు బజరంగీ, అతని అనుచరులు ఆయుధాలతో ఉన్నారు. ఆ తర్వాత దాడులు జరిగాయి. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బజరంగీ, అతని సహాయకులు పోలీసు వాహనంపై దాడి చేశారు. పోలీసులను కూడా బెదిరించారని అధికారులు వెల్లడించారు. 

బిట్టూ బజరంగీ, అతని అనుచరులు మరో 15 మందిపై ఎఫ్‌ఐఆర్‌‌ నమోదైంది. అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం, ఆయుధాలు  కలిగి ఉండటం తదితరాలపై కేసు నమోదు చేశారు. 

రెచ్చగొట్టే ప్రసంగాలే కారణం..

గత నెల జులైలో హర్యానాలోని నుహ్‌లో వీహెచ్‌పీ కార్యకర్తలు చేపట్టిన  జలాభిషేకం యాత్ర హింసకు దారితీసింది. ఆ ర్యాలీ నంద్‌ గ్రామానికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ర్యాలీపై రాళ్లతో దాడి చేశారు. యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు పోలీసులు టియర్‌‌ గ్యాస్‌ను ప్రయోగించారు. రెచ్చగొట్టే ప్రసంగాలే ఈ అల్లర్లకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రసంగాలు బిట్టూ బజరంగీ  చేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం  చేశారు. పలువుర్ని చేసిన పోలీసులు.. మరికొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. 

కాగా, ర్యాలీపై రాళ్లు విసిరిన వారిపై హర్యానా రాష్ట్ర సర్కార్‌‌ కఠిన చర్యలు తీసుకుంది. సీసీ కెమెరాలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పలువురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, నిందితుల ఇళ్లను పోలీసులు, స్థానిక అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలపై ప్రశ్నించగా, ఇవన్నీ అక్రమ కట్టడాలు అయినందు వల్లే కూల్చివేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఓ హోటల్‌పై నిందితులు ర్యాలీపై రాళ్లు రువ్వారని గుర్తించిన పోలీసులు… ఆ మూడంతస్తుల హోటల్‌ను కూడా కూల్చివేశారు.