గన్ను గురిపెట్టి పోలీస్ కారునే ఎత్తుకెళ్లారు

జీ20 సమిట్ మొదలైన శనివారం రోజున ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ కారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. జీ20 డ్యూటీ కోసం కానిస్టేబుల్ వెళ్తుండగా.. అడ్డగించి, గన్నులు గురిపెట్టి కారుతో ఉడాయించారు.   అతడో కానిస్టేబుల్.. ప్రతిష్ఠాత్మక జీ20 సమిట్‌లో భద్రత కోసం అతడికి డ్యూటీ వేశారు. శనివారం సాయంత్రం అక్కడికి వెళ్తుండగా.. అనుకోని ఘటన జరిగింది. తన కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు వచ్చి దోపిడీ చేశారు. గురుగ్రామ్‌లోని ఎస్‌పీఆర్‌‌ రోడ్డులో తలపై గన్‌ గురిపెట్టి మరీ […]

Share:

జీ20 సమిట్ మొదలైన శనివారం రోజున ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ కారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. జీ20 డ్యూటీ కోసం కానిస్టేబుల్ వెళ్తుండగా.. అడ్డగించి, గన్నులు గురిపెట్టి కారుతో ఉడాయించారు.  

అతడో కానిస్టేబుల్.. ప్రతిష్ఠాత్మక జీ20 సమిట్‌లో భద్రత కోసం అతడికి డ్యూటీ వేశారు. శనివారం సాయంత్రం అక్కడికి వెళ్తుండగా.. అనుకోని ఘటన జరిగింది. తన కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు వచ్చి దోపిడీ చేశారు. గురుగ్రామ్‌లోని ఎస్‌పీఆర్‌‌ రోడ్డులో తలపై గన్‌ గురిపెట్టి మరీ కారును ఎత్తుకెళ్లారు. శనివారం దేశ రాజధానిలో జరిగిన ఈ సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. 

‘‘శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ రాజ్‌కుమార్ (32).. జీ20 సమిట్‌ డ్యూటీ కోసం మహేంద్ర గఢ్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. 11 గంటల సమయంలో ఎస్‌పీఆర్‌‌ రోడ్డు వద్దకు కానిస్టేబుల్ చేరుకున్నాడు. ఈ సమయంలో ఓ తెల్ల కారు అతడి ఎదురుగా వచ్చి ఆగింది. ఇద్దరు వ్యక్తులు మాస్కుతో కారులో నుంచి దిగారు. చేతుల్లో ఆయుధాలతో వచ్చారు. ఒకరు కారు ఎదురుగా వచ్చి గన్ను గురిపెట్టగా.. మరొకరు కానిస్టేబుల్‌ వద్దకు వచ్చారు” అని పోలీసులు వివరించారు.

కారు దిగకపోతే కాల్పులు జరుపుతామన్నారు..

‘‘కారు దిగమని దుండగులు నాతో చెప్పారు. దిగకపోతే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు.  నేను కారు దిగి బయటికి రాగానే.. నన్ను పక్కకి తోసేశారు. నా కారును తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు” అని రాజ్‌కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘నా ఢిల్లీ పోలీస్ యూనిఫామ్, వ్యాలెట్‌, ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కారులోనే ఉన్నాయి. పర్సులో రూ.5 వేలు ఉన్నాయి. పూర్తిగా చీకటిగా ఉండటంతో.. దుండగులు వచ్చిన ష్విఫ్ట్ కారు నంబర్‌‌ను చూడలేకపోయా” అని తెలిపాడు. మరోవైపు ఖేర్కీ దౌలా టోల్‌ప్లాజా వద్ద రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలో తెల్ల ష్విఫ్ట్ కారు వెళ్లినట్లు మాత్రమే కనిపించిందని పోలీసులు చెప్పారు. మిగతా ఎలాంటి ఆధారాలు దొరకలేదని వివరించారు. 

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై పలు సెక్షన్ల కింద ఖేర్కీ దౌలా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘పోలీస్ టీమ్స్, క్రైమ్ యూనిట్ టమ్ సభ్యులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం” అని ఇన్‌స్పెక్టర్ అజయ్ మాలిక్ చెప్పారు.

ఢిల్లీలో తరచూ ఘటనలు

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల కిందట కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేయర్‌‌ నితీశ్ రాణా భార్య కారులో వెళ్తుండగా.. కొందరు దుండగులు వెంబడించారు. అయితే వారి బారి నుంచి ఆమె తప్పించుకుని బయటపడ్డారు. మరోవైపు ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌తో ఓ క్యాబ్ డ్రైవర్‌‌ అసభ్యంగా ప్రవర్తించడం పెను దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా పోలీస్‌ కారునే ఎత్తుకెళ్లడం చర్చనీయాంశమవుతోంది. అసలు పోలీసు కారును ఎందుకు ఆపారు? పోలీసు అని తెలిసే ఇలా చేశారా? లేక సాధారణ వ్యక్తులనుకుని దోపిడీకి పాల్పడ్డారా? జీ20 సమిట్ రోజే జరగడం వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది.

విదేశీ నేతలు బస చేసిన హోటల్‌లో హైడ్రామా

మరోవైపు ఢిల్లీలో విదేశీ నేతలకు బస ఏర్పాటు చేసిన ఫైవ్ స్టార్ హోటల్‌లో 12 గంటలపాటు హైడ్రామా నడిచిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనా ప్రతినిధి బృందం తమ వెంట తెచ్చిన భారీ బ్యాగులే ఇందుకు కారణం. డిప్లమాటిక్ బ్యాగేజీని తగ్గించుకోవాలని ప్రతినిధుల బృందానికి ముందే సూచించినా.. లగేజీని ఎక్కువగా తీసుకురావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయినప్పటికీ దౌత్యపరమైన ప్రోటోకాల్‌ను దృష్టిలో ఉంచుకుని.. భద్రతా సిబ్బంది బ్యాగ్‌లను హోటల్‌ లోపలికి అనుమతించారు. 
అయితే చైనా ప్రతినిధుల బృందానికి కేటాయించిన గదిలో అనుమానాస్పద సామగ్రి ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించి.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ బ్యాగులను స్కానర్‌‌లో ఉంచమని చైనా బృందాన్ని అధికారులు కోరడం.. అందుకు చైనీయులు నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు చైనా ప్రతినిధి బృందం ప్రత్యేక, ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోరగా.. వారి అభ్యర్థనను హోటల్ తిరస్కరించింది. చివరికి లగేజీని ఢిల్లీలోని తమ దౌత్య కార్యాలయానికి పంపేందుకు చైనా సెక్యూరిటీ అంగీకరించడంతో 12 గంటల హైడ్రామాకు తెరపడిందని హోటల్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయా బ్యాగుల్లో ఏమున్నాయనేది మాత్రం వెల్లడి కాలేదు.