సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.. సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి

CM Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా, సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి కీలక వ్యాఖ్యలు చేశారు.

Courtesy: x

Share:

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా, సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి కీలక వ్యాఖ్యలు చేశారు. నవ్వుతూనే సిఎం జగన్‌కు చురకలు అంటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘దురదృష్టవశాత్తూ మన ప్రియతమ నాయకుడు జగన్‌ నన్ను గుర్తించకపోయినప్పటికీ.. ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారు. నన్ను వారి గుండెల్లో పెట్టుకుని, ఎటువంటి అవమానాలు ఎదురైనా కాపాడుతూ వస్తున్నారు' అని కామెంట్స్ చేశారు. ప్రజలే తన బలం అని, తాను ఎక్కడ ఉన్నా వారు ఖచ్చితంగా గెలిపిస్తారని సారధి చెప్పారు.

సారథి వ్యాఖ్యలతో వేదిక దిగిన మంత్రి జోగి:
ఈ వ్యాఖ్యలు పార్థసారథి నవ్వుతూ చేసినా అందులో చాలా అర్థాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్థసారథి వ్యాఖ్యలతో అక్కడే ఉన్న మంత్రి జోగి రమేష్‌ వేదిక దిగి వెళ్లిపోయారు. స్థానిక నేతలు ఆపుతున్నా ఆగకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు కంకిపాడులో జరిగిన సామాజిక సాధికార సభలో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

'ప్రజలు ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటున్నారు. వారికి ఎప్పటికీ ఓ సేవకుడిగా ఉంటాను అన్నారు. నేను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటా. నామినేషన్ వేసిన ప్రతీసారి సారథి ఓడిపోయాడు.. పెనమలూరు తెలుగుదేశందేనని ప్రచారం చేస్తారు. కానీ అన్నీ వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నా.' అని సారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో వేదికపై ఉన్న మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ‌వేదిక దిగి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా.. జోగి ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సీఎం జగన్ తనను గుర్తించలేదని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించడం పార్టీ నేతల్లో ఆగ్రహం వచ్చేలా చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన కొలుసు పార్థసారథికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన తండ్రి రెడ్డయ్య ఎంపీగా పనిచేశారు. 2009 నుంచి 2014వరకు సారథి మంత్రిగా పనిచేశారు. 2014లో వైసీపీలో చేరిన సారథి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని చాలా కాలం పాటు సారథి సొంత స్థలంలోనే నిర్వహించారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దానిని తాడేపల్లికి తరలించారు. 2019 ఎన్నికల్లో పెనమలూరు నుంచి గెలిచిన తర్వాత తొలి క్యాబినెట్‌లో మంత్రి పదవి ఆశించినా ఆయనకు చోటు దక్కలేదు. తర్వాత చేపట్టిన విస్తరణలోను సారథికి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దక్కకపోవడంపై సారథి పలుమార్లు సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు షికారు చేశాయి.