చంద్రయాన్‌ 3 సక్సెస్‌.. ఇప్పుడు సూర్యుడు వంతు

చంద్రయాన్‌ 3 సక్సెస్‌తో ఆనందంతో ఉన్న ఇస్రో.. అదే ఊపులో సూర్యుడి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అందుకు సెప్టెంబర్‌‌ 2న మూహుర్తం ఫిక్స్ చేసింది.  చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌ 3ని విజయవంతంగా ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. అంతరిక్ష రంగంలో కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2న సోలార్‌‌ మిషన్‌ను ప్రయోగించడానికి సన్నద్ధమవుతోంది. ఆదిత్య […]

Share:

చంద్రయాన్‌ 3 సక్సెస్‌తో ఆనందంతో ఉన్న ఇస్రో.. అదే ఊపులో సూర్యుడి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అందుకు సెప్టెంబర్‌‌ 2న మూహుర్తం ఫిక్స్ చేసింది. 

చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌ 3ని విజయవంతంగా ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. అంతరిక్ష రంగంలో కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2న సోలార్‌‌ మిషన్‌ను ప్రయోగించడానికి సన్నద్ధమవుతోంది. ఆదిత్య ఎల్‌1 అంతరిక్ష నౌక ద్వారా ఈ మిషన్‌ను పంపించనుంది.

ఈ మిషన్‌ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరపనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితుల గుట్టు విప్పేందుకు ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ, పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత ఇండియన్‌ మిషన్‌ కూడా ఇదే

మొత్తం ఏడు పేలోడ్స్‌..

ఆదిత్య ఎల్‌1 ప్రయోగంలో మొత్తం ఏడు పేలోడ్స్‌ ను తీసుకెళ్లనుంది. ఫోటోస్పియర్‌‌, క్రోమోస్పియర్‌‌, సూర్యడి బయటి పొర (కరోనా)పై అధ్యయనం చేయడంలో ఉపయోగపడనున్నాయి. ఆదిత్య ఎల్‌ 1 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపడుతున్నారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్‌‌ ఫర్‌‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్‌ కోసం పేలోడ్స్ ను అభివృద్ధి చేశాయి. ప్రయోగం కోస రెండు వారాల కిందటే పేలోడ్స్ ఏపీ శ్రీహరి కోటలోని ఇస్రో స్పేస్ స్టేషన్కు చేరుకున్నాయి. వచ్చే నెల 2న ఈ ప్రయోగం జరిగే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఎల్‌1 పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉంచిన ఉపగ్రహం… ఎలాంటి ఆటంకం లేకుండా సూర్యుడిని నిరంతరం పరిశోధిస్తుందని ఇస్రో పేర్కొంది. 

నిరంతరం పర్యవేక్షించేందుకు…

ఆదిత్య ఎల్‌1 కరోనాపై యూవీ పేలోడ్‌ ఉపయోగించి సోలార్‌‌ క్రోమోస్పియర్‌‌పై, ఎక్స్‌ రే పేలోడ్‌ను ఉపయోగించి సూర్యుడిపై మంటలను పరిశీలించనుంది. పార్టికల్‌ డిటెక్టర్లు, మాగ్నెటోమీటర్లు పేలోడ్‌ చార్జ్‌ చేసిన పార్టికల్స్‌, ఎల్‌1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యకు చేరే అయస్కాంత క్షేత్రంపై సమాచారాన్ని అందించగలవు. ఎలాంటి గ్రహణాలు లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే విధంగా ఎల్‌1 పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉపగ్రహం ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో పేర్కొంది. దీని ద్వారా సౌర కార్యకలాపాలను, అంతరిక్ష వాతావరణాన్ని గమనించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుందని తెలిపింది.

ప్రత్యేకమైన వాంటేజ్‌ పాయింట్‌ ఎల్‌1ని ఉపయోగించి నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్‌1 వద్ద పార్టికల్స్, క్షేత్రాల అధ్యయనాలను నిర్వహిస్తాయి. తద్వారా అంతర్భాగంలో సౌర డైనమిక్స్ గురించి ముఖ్యమైన అధ్యయనాలను చేపట్టనుంది. కరోనాల్‌ హీటింగ్‌, కరోనాల్‌ మాస్ ఎజెక్షన్‌, ప్రీఫ్లేర్‌‌, ఫ్లేర్‌‌ (మంటలు) యాక్టివిటీస్‌, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం డైనమిక్స్‌, పార్టికల్‌ ఫీల్డ్‌  మొదలైన సమస్యలను అర్థం చేసుకోవడంలో ఆదిత్య ఎల్‌1 పేలోడ్‌ల సూట్‌లు చాలా కీలకమైన సమాచారాన్ని అందిస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. కరోనాల్‌, కరోనాల్‌ లూప్స్‌ ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతలపై పరిశోధనలు చేయనుంది. సౌర విస్ఫోటనానికి దారితీసే బహుళ పొరలలో (క్రోమోస్పియర్‌‌, బేస్, ఎక్స్‌ టెండెడ్‌ కరోనా) సంభవించే ప్రక్రియల క్రమాన్ని గుర్తిస్తాయి. 

ఆదిత్య ఎల్‌1 ఎలా పనిచేస్తుందంటే..

ఆదిత్య ఎల్‌1లో ఉన్న ఏడు ప్రత్యేక పేలోడ్‌లు సూర్య కిరణాలను వివిధ మార్గాల్లో పరీక్షిస్తాయి. సౌర తుఫానులకు సంబంధించిన లెక్కలు చేస్తాయి. ఇందుకోసం హెచ్‌డీ కెమెరాలు అమర్చారు. ఇతర డేటాతో పాటు సూర్యుడి అధిక రెజల్యూషన్‌  ఉండే ఫొటోలు తీయనుంది. వీటిని ఇస్రో అధ్యయనం చేయనుంది.