స్లీప్‌ మోడ్‌లోకి చంద్రయాన్ 3 ల్యాండర్‌, రోవర్‌..!

సూర్యుడిపై అధ్యయనానికి ఆద్యిత- ఎల్1 ప్రయాణం మొదలుకాగా.. చంద్రుడిపై చంద్రయాన్ 3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ మరో ఫీట్ సాధించింది. ఆగస్టు 23 రాత్రి విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. శివశక్తి పాయింట్ నుంచి ఇప్పటి వరకూ 100 మీటర్ల దూరం ప్రయాణించింది. ఇంకా, బలంగా ముందుకు కదులుతోంది. ఈ మేరకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విట్టర్‌లో రోవర్ ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేసింది. ‘ప్రజ్ఞాన్ రోవర్ […]

Share:

సూర్యుడిపై అధ్యయనానికి ఆద్యిత- ఎల్1 ప్రయాణం మొదలుకాగా.. చంద్రుడిపై చంద్రయాన్ 3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ మరో ఫీట్ సాధించింది. ఆగస్టు 23 రాత్రి విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. శివశక్తి పాయింట్ నుంచి ఇప్పటి వరకూ 100 మీటర్ల దూరం ప్రయాణించింది. ఇంకా, బలంగా ముందుకు కదులుతోంది. ఈ మేరకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విట్టర్‌లో రోవర్ ప్రయాణానికి సంబంధించిన వివరాలను తెలియజేసింది. ‘ప్రజ్ఞాన్ రోవర్ సెంచరీ కొట్టింది.. అంటే.. చంద్రుడి ఉపరితలంపై ఇప్పటి వరకూ 100 మీటర్ల దూరం ప్రయాణం పూర్తిచేసుకుంది.. ఇంకా ముందుకు సాగుతోంది’ అని ఎక్స్‌లో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై రెండు వారాల పాటు పరిశోధనలకు చంద్రయాన్-3 మిషన్‌కు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగి ఇప్పటికే 11 రోజులు పూర్తయ్యింది. మరో రెండు రోజుల్లో అక్కడ రాత్రి సమయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోవర్, ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం వెల్లడించారు. మరో రెండు రోజుల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రాణ ప్రక్రియ ప్రారంభిస్తామని సోమనాథ్ తెలిపారు. ‘రోవర్, ల్యాండర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపే ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది.. ఎందుకంటే అవి చంద్రుడిపై రాత్రివేళ అతిశీతల వాతావరణాన్ని తట్టుకోవాల్సి ఉంటుంది’ అని ఇస్రో చీఫ్ చెప్పారు. చంద్రయాన్-3 ఇప్పటి వరకూ చంద్రుడి గురించి ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్, మాంగనీస్ వంటి మూలకాలు ఉన్నట్టు రోవర్ ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

కాగా,  ఉక్రెయిన్ యుద్ధ ఆంక్షలతో సతమతమవుతోన్న రష్యా.. లూనా-25 కోసం భారీగానే ఖర్చు చేసింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి అమెరికా దాని మిత్రదేశాలకు బలమైన సందేశం పంపాలని భావించింది. కానీ, పుతిన్ ఆశలపై లూనా నీళ్లుచల్లింది. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయ్యే ముందు, రష్యా ప్రయోగించిన మూన్ మిషన్ లూనా-25 చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. చంద్రుడి ఉపరితలంపై లూనా-25 వ్యర్థాలను తాజాగా కనిపెట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. రష్యా 47 ఏళ్ల తర్వాత, ఆగస్టు 10 2023న, చంద్రుడిపైకి తన ల్యూనా-25 మిషన్‌ను పంపింది. అంతకుముందు 1976లో అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగినప్పుడు ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. భారతదేశం తరహాలో, రష్యా తన మిషన్‌ని చంద్రుని దక్షిణ ధ్రువానికి పంపింది.

ఆగస్టు 23న చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే ముందు లూనా-25 చంద్రుడిపై దిగుతుందని భావించారు, అయితే అది ఆగస్టు 19న క్రాష్ అయ్యింది. నాసా బృందం నిరంతరం చందమామ ఉపరితలాన్ని LRO మిషన్‌కి ఉండే కెమెరాలతో పరిశీలిస్తూ ఉంటుంది. ల్యూనా-25 కూలిన ప్రదేశాన్ని కనిపెట్టింది. ఎందుకంటే.. ఓ ప్రదేశంలో ఉపరితలంలో మార్పు కనిపించింది. ఆగస్టు 24న తీసిన ఫొటోకీ, జూన్ 2022లో అదే స్థలానికి సంబంధించిన ఫొటోకీ తేడా కనిపించింది. తాజా ఫొటోలో.. ఒక గొయ్యి ఏర్పడినట్లుగా కనిపించింది. ఈ కొత్త గొయ్యి ఏర్పడటానికి కారణం లూనా-25 అని నాసా అంచనా వేసింది. కొత్త బిలం 33 అడుగుల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఉందనీ, చంద్రుని పొంటెక్యులెంట్ G క్రేటర్ దగ్గర్లో ఇది ఉందని నాసా ఎల్ఆర్ఓ టీమ్ తెలిపింది. 

69.5 డిగ్రీల దక్షిణ అక్షాంశంలో ఉన్న లూనా-25… ప్లాన్ ప్రకారం ల్యాండ్ కావాల్సిన ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుని ఉపరితలంపై కనిపించే ఈ కొత్త బిలం మరెవరిదో కాదని, లూనా-25 క్రాష్ ల్యాండింగ్ వల్ల ఏర్పడిందని నాసా స్పష్టం చేసింది. భారతదేశ చంద్రయాన్-3 మిషన్ జూలై 14న ప్రారంభమైంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన చంద్రయాన్ తన ప్రయాణాన్ని 40 రోజుల్లో పూర్తి చేసి, చందమామను చేరింది. అదే సమయంలో, పవర్‌ఫుల్ రాకెట్‌తో కేవలం 10 రోజుల్లో చంద్రునిపై లూనా-25 మిషన్‌ను ల్యాండ్ చేయాలని ప్లాన్ వేసింది. దక్షిణ ధృవం మీద మొదట తానే అడుగు పెట్టాలి అనుకుంది. కానీ రష్యా కోరిక నెరవేరలేదు. భారతదేశం అలా చేసిన మొదటి దేశంగా నిలిచింది.