చంద్రయాన్ -3 సుదీర్ఘ ప్రయాణం..!

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్ -3 ఈరోజు అత్యంత కీలక దశలోకి అడుగు పెడుతుంది. సాయంత్రం 6:04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లి మీద సాప్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రోగ్రాం చేయబడింది. ఈ ప్రక్రియ విజయవంతం అయితే చందమామ దక్షిణ ఉపరితలం మీద సాప్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత దేశం ఘనత సాధిస్తుంది. ఇప్పటి వరకూ అమెరికా, చైనా మరియు సోవియట్ యూనియన్ దేశాలు విజయవంతంగా చందమామ మీద సాప్ట్ ల్యాండింగ్ చేశాయి. […]

Share:

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్ -3 ఈరోజు అత్యంత కీలక దశలోకి అడుగు పెడుతుంది. సాయంత్రం 6:04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లి మీద సాప్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రోగ్రాం చేయబడింది. ఈ ప్రక్రియ విజయవంతం అయితే చందమామ దక్షిణ ఉపరితలం మీద సాప్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత దేశం ఘనత సాధిస్తుంది. ఇప్పటి వరకూ అమెరికా, చైనా మరియు సోవియట్ యూనియన్ దేశాలు విజయవంతంగా చందమామ మీద సాప్ట్ ల్యాండింగ్ చేశాయి. ఈరోజు చంద్రయాన్ -3 ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేస్తే ఈ జాబితాలో నాలుగవ దేశంగా భారత్ అవతరిస్తుంది. జూలై 14 వ తేదీన తన ప్రయాణం ప్రారంభించిన చంద్రయాన్ -3 ఈరోజు కీలకమైన దశకు చేరుకున్నది. చందమామ మీద ల్యాండింగ్ దశ విజయవంతం అయితే 14 రోజుల పాటు అక్కడ ప్రయోగాలు నిర్వహించనున్నారు. 

సాప్ట్ ల్యాండింగ్ చాలా కీలకం 

జూలై 14 వ తేదీన తన ప్రయాణం ప్రారంభించిన చంద్రయాన్ -3 భూ కక్ష్య లోనికి వెళ్లి అక్కడి నుండి చంద్రుడి కక్ష్యలోకి మారి, క్రమ క్రమంగా చంద్రుడి చుట్టూ తిరిగే కక్ష్య తగ్గించుకుంటూ, తర్వాత వేగం తగ్గించుకుంటూ ఈరోజు సాప్ట్ ల్యాండింగ్ దశకు సిద్ధం అవుతుంది. భారతదేశం ఒక్కటే కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం ఈ దశ గురించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇస్రో గతంలో చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగం కూడా అత్యంత కీలకమైన ల్యాండింగ్ దశలోనే విఫలం అయ్యింది. చంద్రుడి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తిని సరిగా అంచనా వేయకపోవడం వలన చంద్రయాన్ -2 క్రాష్ ల్యాండింగ్ అయింది అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. చంద్రయాన్ -3 లో అటువంటి సమస్య రాకుండా అదనపు త్రస్టర్స్ ఏర్పాటు చేశారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుండి 30 కిలోమీటర్ల దూరం నుండి 4 త్రస్టర్స్ ఉపయోగించి వేగం తగ్గిస్తూ వెళ్తారు. ఈ దూరం 6.8 కిలోమీటర్లకు వచ్చిన తర్వాత 2 త్రస్టర్స్ ను మాత్రమే ఉపయోగిస్తారు. వాటి ద్వారా ల్యాండర్ వేగాన్ని నియంత్రిస్తూ సాప్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తారు. సాప్ట్ ల్యాండింగ్ ప్రక్రియను అత్యంత భయంకరమైన దశగా కొందరు ఇస్రో శాస్త్రవేత్తలు అభివర్ణించారు. 

సాప్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది? 

మనకు భూమి మీద 14 రోజులు అంటే చంద్రుడి మీద ఒక పగలుతో సమానం. ఈ 14 రోజుల పాటు అక్కడ సూర్యుడు ఉంటాడు. విక్రమ్ ల్యాండర్ చందమామ మీద సాప్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ల్యాండర్ లోపల ఉన్న ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. ప్రగ్యాన్ రోవర్ సహాయంతో చంద్రుడి ఉపరితలం మీద ఉన్న వాతావరణ పరిస్థితులతో పాటుగా చంద్రుడి ఉపరితలం మీద కొన్ని రసాయనిక విశ్లేషణ లు చేస్తుంది. 14 రోజుల పాటు చంద్రుడి గురించి వివిధ అధ్యయనాలు చేయనున్నది. 14 రోజుల తర్వాత చంద్రుడి దక్షిణ ఉపరితలం అంతా చీకటి అవుతుంది. అంటే చందమామ మీద మరో 14 రోజులు రాత్రి సమయం ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడి మీద ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోతాయి, దాదాపు మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వరకూ ఈ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఈ పరిస్థితులను ప్రగ్యాన్ రోవర్ తట్టుకోలేదు. అందుకే సాప్ట్ ల్యాండింగ్ తర్వాత మిషన్ జీవిత కాలం 14 రోజులుగా నిర్ణయించారు. ఒకవేళ ప్రగ్యాన్ రోవర్ కనక ఈ 14 రోజుల పాటు ( చంద్రుడి మీద ఒక రాత్రి) తట్టుకుని నిలబడితే మరిన్ని ప్రయోగాలు జరిపే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

స్కూల్ విద్యార్థులకు ప్రత్యేకంగా లైవ్ ప్రోగ్రాం

భారతదేశంలోని పాఠశాల విద్యార్థులకు చంద్రయాన్ -3 ల్యాండింగ్ దశ లైవ్ లో చూపించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా పాఠశాలలు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల లోపు ముగుస్తాయి. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఎక్కువ సేపు నిర్వహించనున్నారు. ఇలాంటి చారిత్రాత్మక ఘట్టం విద్యార్థులు అందరూ కలిసి చూడాలి అనే ఉద్దేశం చాలా మంచిది అని తల్లి తండ్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రుడి దక్షిణ ఉపరితలం మీద మొట్ట మొదటి గా సాప్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్ కు అవకాశం ఉంది. ఇటీవలే రష్యా కూడా లునా -25 ను చంద్రుడి మీద సాప్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలం అయ్యింది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల అన్నిటి చూపు చంద్రయాన్ – 3 మీదనే ఉన్నది. పైగా చంద్రయాన్ -3 అతి తక్కువ ఖర్చుతో నిర్మించారు. ప్రపంచంలో చంద్రుడి మీదకు పంపిన అన్ని ప్రయోగలలో కూడా చంద్రయాన్ ను అతి తక్కువ ఖర్చుతో నిర్మించడం విశేషం….