మామా.. వచ్చేస్తున్నా..

‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పిలుస్తుంటే చంద్రుడు రావట్లేదని.. మనోళ్లు మామా అనుకుంటూ చంద్రుడి దగ్గరికే వెళ్లేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ‘అడుగూ’ వేసుకుంటూ.. పడుతూ లేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ‘చంద్రయాన్–1’తో తొలి అడుగు విజయవంతంగా వేశారు. ‘చంద్రయాన్–2’తో ముందుకు సాగినా చివరి నిమిషంలో అడుగుతడబడింది.. 20 రోజుల కిందట ‘చంద్రయాన్–3’తో మరోసారి మొదలైన యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. దూరం తరుగుతోంది.. సమయం దగ్గర పడుతోంది.. మరో రెండు రోజుల్లో చంద్రయాన్–3 కీలక దశకు […]

Share:

‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అని పిలుస్తుంటే చంద్రుడు రావట్లేదని.. మనోళ్లు మామా అనుకుంటూ చంద్రుడి దగ్గరికే వెళ్లేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ‘అడుగూ’ వేసుకుంటూ.. పడుతూ లేస్తూ.. ముందుకు సాగుతున్నారు. ‘చంద్రయాన్–1’తో తొలి అడుగు విజయవంతంగా వేశారు. ‘చంద్రయాన్–2’తో ముందుకు సాగినా చివరి నిమిషంలో అడుగుతడబడింది.. 20 రోజుల కిందట ‘చంద్రయాన్–3’తో మరోసారి మొదలైన యాత్ర దిగ్విజయంగా సాగుతోంది.

దూరం తరుగుతోంది.. సమయం దగ్గర పడుతోంది.. మరో రెండు రోజుల్లో చంద్రయాన్–3 కీలక దశకు చేరుకోనుంది. చంద్రుడి కక్ష్యలోకి ల్యాండర్ ప్రవేశించనుంది. ఇప్పటిదాకా అనుకున్నది అనుకున్నట్లుగా సవ్యంగా సాగింది. ఇక మిగిలింది రెండే దశలు.. ఒకటి చంద్రుడి కక్షలోకి వెళ్లడం, రెండు చంద్రుడి ఉపరితలంపై రోవర్ దిగి.. చందమామను ముద్దాడటం.

18 రోజులు భూమి చుట్టూ తిరిగి..

చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్–3ని చేపట్టింది. జులై 14న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌– 3ని ప్రయోగించింది. 2,148 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్‌, 1,723.89 కిలోల ల్యాండర్, 26 కిలోల రోవర్‌‌తో కూడిన రాకెట్.. నిప్పులుకక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. అప్పటి నుంచి 18 రోజులపాటు భూకక్ష్యలో తిరిగిన రాకెట్.. ఇప్పుడు చంద్రుడి దిశగా పయనం మొదలుపెట్టింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ మేరకు చంద్రయాన్–3 కక్ష్యను పెంచి లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ‘‘చంద్రయాన్–3 విజయవంతంగా భూకక్ష్యలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు చంద్రుడి వైపుగా సాగుతోంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, నెట్‌వర్కింగ్ కేంద్రం (ఇస్‌ట్రాక్)లో పెరిజీ– ఫైరింగ్ దశ పూర్తయింది. చంద్రయాన్‌ను ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టాం. ఇక తర్వాతి అడుగు చంద్రుడే. ఆగస్టు 5న లూనర్ – ఆర్బిట్ ఇన్సర్షన్‌ను ప్లాన్ చేశాం” అని ఇస్రో ట్వీట్ చేసింది. 

23న సాయంత్రం 5.47 గంటలకు..

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఆగస్టు 5న అంటే మరో రెండు రోజుల్లో చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్–3 ప్రవేశించనుంది.  చంద్రుడి కక్ష్యలోకి వెళ్లగానే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరుపడనుంది. ఇదంతా సక్రమంగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై దక్షిణ ధృవంపై ల్యాండర్ దిగుతుంది. ఇది విజయవంతమైతే.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌‌ను దింపిన దేశంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోనుంది. ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ తన పని ప్రారంభించనుంది. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయనుంది. శాంపిల్స్‌ను సేకరించనుంది. 

చంద్రుడిపైకి మూడో ప్ర‌య‌త్నం

చంద్రుడిపైకి మనదేశం చేసిన మూడో ప్రయోగం ఇది. గతంలో చంద్రయాన్–1, చంద్రయాన్‌–2లను చేపట్టింది. చంద్రయాన్–1 విజయవంతంగా కాగా, రెండో సారి చేపట్టిన ప్రయోగం కేవలం పాక్షికంగా విజయవంతమైంది. చంద్రయాన్–1ను 2008 అక్టోబర్ 22న ప్రయోగించారు. మన దేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన తొలి అంతరిక్ష వాహనం ఇది. చాలా తక్కువ ఖర్చుతో ఈ మిషన్‌ను చేపట్టి, ఇస్రో అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందింది. చంద్రుడిపై నీటి అణువుల జాడను పసిగట్టడం ద్వారా చంద్రయాన్–1 చరిత్ర సృష్టించింది. దీంతో చంద్రుడిపై నీటిజాడను గుర్తించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్–1కి కొనసాగింపుగా చంద్రయాన్‌–2ని ఇస్రో చేపట్టింది. అయితే లాంచింగ్ నుంచి.. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లే దాకా అంతా సవ్యంగానే సాగింది. కానీ సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చివరి క్షణంలో ప్రయోగం విఫలమైంది. కానీ ఇప్పటికీ చంద్రయాన్–2 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారం సేకరిస్తూనే ఉంది. దాదాపు చంద్రయాన్–2 లక్ష్యాలతోనే చంద్రయాన్–3 బయల్దేరింది. ఇది విజయవంతమైతే.. ‘చంద్రయాన్–4’తో చందమామను నేరుగా మనుషులు చేరుకోవడమే తరువాయి!!