చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!

తమ పార్టీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు ఉనికి కోసం పాట్లు పడుతున్నారని, పైగా వైసీపీ ఉండదని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడంతో ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు వైసీపీ.. అటు టీడీపీ, జనసేన నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల వాలంటీర్ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ […]

Share:

తమ పార్టీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు ఉనికి కోసం పాట్లు పడుతున్నారని, పైగా వైసీపీ ఉండదని అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడంతో ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు వైసీపీ.. అటు టీడీపీ, జనసేన నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల వాలంటీర్ల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అధికార పార్టీ నేతలు మూకుమ్మడిగా పవన్‌పై మాటల దాడి చేశారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులుచెరిగారు. ఆయనో జిత్తుల మారి ముసలి నక్క అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడుతున్నది ఎవరు?

తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే వైఎస్సార్‌‌ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ గేట్లు పట్టుకుని చంద్రబాబు వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. మతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉగాది తర్వాత ఏపీలో టీడీపీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో, తమ సత్తా ఏంటో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ‘‘చంద్రబాబు గేట్లు తీస్తే మా పార్టీ ఉండదా? బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడుతున్నది ఎవరు? మతిపోయిందా? బుర్ర పాడైందా?” అని నిప్పులుచెరిగారు. బచ్చా ఎవరు? లుచ్చా ఎవరు? అని నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాటలేంటని ప్రశ్నించారు. ‘‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయనో జిత్తుల మారి ముసలి నక్క. అనడం, అనిపించుకోవడం ఎందుకు? వయసు రాగానే సరిపోదు. మంచి ఆలోచన ఉండాలి” అని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. 

ఎప్పుడు దూరుదామా అని ఆలోచన

చంద్రబాబు తరచూ ఢిల్లీకి వెళ్తున్నారని, బీజేపీ ఎప్పుడు గేట్లు తెరుస్తుందా? ఎప్పుడు అందులో దూరుదామా? అనే ఆలోచనతో ఉన్నారని బొత్స ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. పైగా వైసీపీ ఉండదని అంటున్నారు. అదేమంటే ‘కుర్రాడు, బచ్చా’ అని మాట్లాడుతున్నారు. నువ్వు ముసలి నక్కవి. జిత్తుల మారివి. ఈ విషయం మాకు తెలుసు” అని మండిపడ్డారు. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడనేది ప్రజలందరికీ తలుసని అన్నారు. ఎవరినైతే వెన్నుపోటు పొడిచాడో, ఏ మహానుభావుడి మృతికి కారణమయ్యాడో.. ఆయన కార్యక్రమానికి వెళ్లాడని ఆరోపించారు. 

ఉగాది తర్వాత ఉండదు

చంద్రబాబు బీజేపీతో చెలిమి చేస్తారో, ఎవర్ని పొగుడుతారో పొగుడుకోవాలని బొత్స అన్నారు. ఉగాది తర్వాత తెలుగుదేశం పార్టీ కనుచూపు మేర ఉండదని అన్నారు. చంద్రబాబు ఏమి మాట్లాడినా ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని చెప్పారు. సంయమనం పాటించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుత ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ మాటలేంటని మండిపడ్డారు. ‘‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో, మా సత్తా ఏంటో తేల్చుకుందాం. జగన్ ఆలోచన ఏంటో, ఆయన పరిపాలన ఏంటో అప్పుడు తెలుస్తుంది. నీ మాయ, నీ మోసం ఏంటో, నీ తత్వం ఏంటో రానున్న ఎన్నికల్లో తేలుతుంది. ఇలాంటి దుష్టశక్తుల వల్ల సంక్షేమ పాలనకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి” అని కోరారు.