4 ఏళ్ల సొంత కుమారుడ్ని చంపిన మహిళా సీఈవో.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టి ప్రయాణం

గోవాలో దారుణం చోటుచేసుకుంది. తన నాలుగేళ్ల కుమారుడిని ఓ మహిళా వ్యాపారవేత్త అతి దారుణంగా హత్య చేసింది.

Courtesy: Top Indian News

Share:

బెంగళూరు: గోవాలో దారుణం చోటుచేసుకుంది. తన నాలుగేళ్ల కుమారుడిని ఓ మహిళా వ్యాపారవేత్త అతి దారుణంగా హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సుచనా సేత్‌ ఓ స్టార్టప్‌ని స్థాపించి, సీఈవో గా వ్యవహరిస్తోంది. గత శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు.

అక్కడ రక్తపు మరకలు కనిపించడంతో హౌస్ కీపింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హోటల్ లోని  సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ముందుగా హోటల్ కు వచ్చినప్పుడు తన కొడుకుతో వచ్చిన సుచనా సేథ్.. వెళ్లేటప్పుడు ఒంటరిగా కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో పోలీసులు ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్‌ చేసి సుచనాతో మాట్లాడారు. తన కుమారుడిని ఫ్రెండ్‌ ఇంటి వద్ద వదిలేసినట్లు చెప్పిన సుచనా సేథ్, ఇదే తన ఫ్రెండ్ అడ్రస్ అంటూ ఇచ్చింది. చివరకు ఆమె అబద్దాలు చెబుతుందని తేలడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీంతో కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. వారు క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి కొంకిణి  భాషలో మాట్లాడుతూ కారును  చిత్రదుర్గలోని పోలీస్ స్టేషన్‌కు  మళ్లించమని చెప్పారు.  

చివరకు ఆమెను చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆమె తన కుమారున్ని ఎందుకు చంపింది అనే దానిపై కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.