ఏపీలో విద్యార్థులకు మరోసారి ట్యాబ్‌లు పంపిణీ చేసిన జగన్ సర్కారు

పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.

Courtesy: x

Share:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న సీఎం జగన్ లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. "మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు విష ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం" అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు. 

గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారని, దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదని ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలే మన భవిష్యత్తని, వీరంతా మన వెలుగులని, వీరంతా మన తరువాత కూడా మన రాష్ట్ర భవిష్యత్‌ నిలిపే మన వారసులని సీఎం జగన్ అన్నారు. వీరి భవిష్యత్‌ గురించి ఆలోచించి, మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు పోటీ ప్రపంచంతో గెలవాలని ఈ 55 నెలలు కూడా ఒక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయని సీఎం జగన్ తెలిపారు. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామని చెప్పారు. 

రూ.620 కోట్లతో ట్యాబ్ ల పంపిణీ:
రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మండలాన్ని సందర్శించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రోజు ట్యాబ్‌లు ఇస్తున్నామని, డిజిటల్‌ విప్లవంలో భాగంగానే  గత ఏడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.15 లక్షల ట్యాబ్‌లను పిల్లలకు, చదువులు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేశామని చెప్పారు. పిల్లలకు అవసరమైన బైజూస్‌ కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌ సైట్‌లో పని చేసేలా అప్‌లోడ్‌ చేసి ఇస్తున్నామని, ప్రతి పిల్లాడికి పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఈ ట్యాబ్‌లు ఉపయోగపడుతున్నాయని స్పష్టం చేశారు. 

"ఈ ట్యాబ్‌లు రిపేరైతే మీ హెచ్‌ఎంకు ఇవ్వండి, లేదా గ్రామ సచివాలయాల్లో ఇవ్వండి..వాళ్లు రసీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీకు రిపేరీ చేసి ఇస్తారు. అలా కాకపోతే ఇంకో ట్యాబ్‌ ఇస్తారు. సెక్యూర్‌ మెబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఏం జరుగుతుందంటే..పిల్లలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూస్తున్నారన్నది ఈ సాప్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది. వీటి పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ ట్యాబ్‌లు మంచి చేసే ఒక ఇంధనంగా ఉంటుంది. ఈ ట్యాబ్‌ పాఠాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్‌లో డౌట్లు వస్తే ఎవరు చెబుతారన్న సందేహం ఉంటుంది. అందుకే ఈ సారి పిల్లలకు ఇచ్చే ఐ ప్యాడ్లో ఒక యాప్‌ అప్‌లోడ్‌ చేయించాం. ఇందులో డౌట్‌ క్లియరెన్స్‌ యాప్‌ ఉంటుంది. దీన్ని వాడుకుని పిల్లలకు ఏ డౌట్‌ ఉన్నా కూడా క్లియర్‌ అవుతుంది." అని సీఎం జగన్ పేర్కొన్నారు.