మరికాసేపట్లో తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. చేవెళ్లలో జరిగే సభ కోసం మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఆయన దాదాపు ఐదు గంటల పాటు హైదరాబాద్ లోనే గడపనున్నారు. ఇక మధ్యాహ్నం గం.3.30 ని.లకు రాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అదే విధంగా రాత్రి గం.7.50  ని.లకు తిరిగి ఢిల్లీకి […]

Share:

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. చేవెళ్లలో జరిగే సభ కోసం మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఆయన దాదాపు ఐదు గంటల పాటు హైదరాబాద్ లోనే గడపనున్నారు. ఇక మధ్యాహ్నం గం.3.30 ని.లకు రాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అదే విధంగా రాత్రి గం.7.50  ని.లకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. 

కేంద్ర హోమ్ శాఖ విడుదల చేసిన పర్యటన షెడ్యూల్ ప్రకారం.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నోవాటెల్ హోటల్​కు చేరుకుంటారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న RRR టీంతో సాయంత్రం 4 గంటల నుండి 4.30ల వరకు సమావేశం కానున్నారు. ఆ తరువాత సాయంత్రం 4.30 నుండి గం.5.10 ని.ల వరకు అక్కడే ఉండి భాజపా రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ కానున్న అమిత్ షా.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల సభకు చేరుకొని సాయంత్రం 7 గంటల వరకు అక్కడే ఉంటారు. 7 గంటలకు అక్కడి నుండి బయలుదేరి గం.7.45 ని.లకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 7.50 గంటలకు ఢిల్లీ బయలు దేరుతారు.

కాగా పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. గత మూడు రోజులుగా సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక  పరిశీలించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన సమీకరణపై ఆ పార్టీ నేతలతో చర్చించారు. కనీసం లక్ష మందిని సభకు తీసుకు రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ నగరానికి సభ దగ్గరగా ఉండడం, అదే విధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సభ జరుగనుండడంతో పెద్ద సంఖ్యలో జనాన్నిసమీకరణించడంపై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు.

కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డును గెలుచుకోవడం గమనించదగ్గ విషయం.

దీంతో అమిత్ షా ఎక్కడికి వెళ్లినా సెలబ్రిటీలను కలవడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఇంతకు ముందు పర్యటనలో నటులు జూనియర్ ఎన్టీఆర్ మరియు నితిన్‌లను కలిశారు. 

అటు మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణలో కాషాయ పార్టీ మరింత దృష్టి సారిస్తుందని, ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణాలో అధికార BRS మరియు BJP మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం దాదాపు రోజువారీ వ్యవహారంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRSకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది. గత రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలలో జాతీయ పార్టీ కూడా సహేతుకమైన విజయాన్ని సాధించింది.