లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. 

27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు.. చట్టంగా మారితే లోక్‌సభ, అసెంబ్లీల్లో ప్రతి ముగ్గురు సభ్యుల్లో ఒకరు మహిళే ఉంటారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా బిల్లును మొదలుపెట్టిన దాదాపు 27 ఏళ్ల తర్వాత.. చట్టంగా మార్చేందుకు ముందడుగు వేసింది. […]

Share:

27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు.. చట్టంగా మారితే లోక్‌సభ, అసెంబ్లీల్లో ప్రతి ముగ్గురు సభ్యుల్లో ఒకరు మహిళే ఉంటారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా బిల్లును మొదలుపెట్టిన దాదాపు 27 ఏళ్ల తర్వాత.. చట్టంగా మార్చేందుకు ముందడుగు వేసింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అభినియం’ అని పేరు పెట్టారు. అయితే ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొంది.. చట్టంగా మారినా ఇప్పటికిప్పుడే రిజర్వేషన్లు అమల్లోకి రావు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు కూడా గత రిజర్వేషన్ల ఆధారంగానే సాగుతాయి.

2029లో అమల్లోకి వచ్చే అవకాశం

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రెండు మూడు రోజుల్లోనే ఆమోదం దక్కే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లు విషయంలో సానుకూలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగానే లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు పాస్ కానుంది. కానీ పార్లమెంటు బిల్లు పాస్ చేసినా.. రిజర్వేషన్లు మాత్రం 2029లోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేయాల్సి ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 2026లో జనాభా లెక్కింపు జరిగన తర్వాతే 2027లో డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుంది. అంటే మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కింపు జరగాలి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసి అమల్లోకి తెస్తారు. 

2027లో జనాభా లెక్కింపు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 82కు 2002లో సవరణలు చేశారు. దాని ప్రకారం 2026 తర్వాత చేపట్టే జనాభా లెక్కింపు ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. అంతా సవ్యంగా జరిగి ఉంటే 2026 తర్వాత 2031లో జనాభా లెక్కింపు జరగాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ చేపట్టాల్సి ఉంది. కానీ ఇంతకుముందు 2021లో జనాభా లెక్కింపు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సెన్సస్‌ 2027లో జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అప్పటివరకు ఆగకుండా డీలిమిటేషన్ చేపట్టాలంటే ఆర్టికల్ 82కు మళ్లీ సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. 

15 ఏళ్లు మాత్రమే అమల్లో..

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు కాల పరిమితి 15 ఏళ్లుగా బిల్లులో పేర్కొన్నారు. అవసరం అనుకుంటే ఆ తర్వాత చట్టాన్ని పొడిగించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అలాగే డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లు రొటేషన్ పద్ధతిలో మారుతుంటాయి.

ఆరు పేజిలతో కూడిన మహిళా బిల్లులో.. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని, అది వాటిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లకు ఈ రిజర్వేషన్ వర్తించదని స్పష్టం చేశారు. మహిళలకు రిజర్వ్ చేసిన 33 శాతం సీట్లలో మూడో వంతు సీట్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు. అయితే ఈ బిల్లులో ఓబీసీలకు కోటా గురించి మాత్రం పేర్కొనలేదు. బీసీ మహిళలకూ కోటా ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  

మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. మొదట ఈ బిల్లును 1996లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1998, 1999, 2008, 2010లో పార్లమెంటు ముందుకు వచ్చింది. కానీ ముందుకు కదల్లేదు. 1996లో జాయిం పార్లమెంటరీ కమిటీ చేసిన ఏడు సూచనల్లో ఐదింటిని 2008 బిల్లులో చేర్చారు. కాంగ్రెస్ హయాంలో 2010 మార్చి 9న రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుకు నాడు బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, జేడీయూ తదితర పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ లోక్‌సభలో ఈ బిల్లుకు ముందుకు సాగలేదు. నిజానికి అంతకుముందు 1999, 2002, 2003–2004లో ఈ బిల్లును ఆమోదించేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారాలంటే.. ముందు లోక్‌సభలో ఆమోదించాలి, తర్వాత రాజ్యసభ పాస్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రవేస్తారు. అప్పుడే మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వస్తుంది. ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అన్నీ అనుకున్నట్లు సాగితే.. రిజర్వేషన్ల అమలు తర్వాత లోక్‌సభలో ప్రతి ముగ్గురు సభ్యుల్లో ఒక మహిళ ఉంటారు.