ఏంటీ పార్లమెంటు ప్రత్యేక సెషన్.. ఎందుకు నిర్వహిస్తారు?

దాదాపు ఆరేళ్ల తర్వాత పార్లమెంటు ప్రత్యేక సెషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈనెల 18 నుంచి 22 దాకా ఈ సెషన్ కొనసాగనుంది. ఈ సమావేశాల ఎజెండా ఏంటనేది కేంద్రం ప్రకటించలేదు.  కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నుంచి ప్రతిదీ సంచలనమే. మేకిన్ ఇండియా, సర్జికల్ స్ట్రైక్స్, నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల రూ.2000 నోటు వెనక్కి తీసుకోవడం.. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకుంది. […]

Share:

దాదాపు ఆరేళ్ల తర్వాత పార్లమెంటు ప్రత్యేక సెషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈనెల 18 నుంచి 22 దాకా ఈ సెషన్ కొనసాగనుంది. ఈ సమావేశాల ఎజెండా ఏంటనేది కేంద్రం ప్రకటించలేదు. 

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నుంచి ప్రతిదీ సంచలనమే. మేకిన్ ఇండియా, సర్జికల్ స్ట్రైక్స్, నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల రూ.2000 నోటు వెనక్కి తీసుకోవడం.. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకుంది. తీసుకుంటూనే ఉంది. పార్లమెంటు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి మరో సంచలనానికి తెరలేపింది. సమావేశాల ఎజెండా ప్రకటించకపోవడం, జమిలి ఎన్నికలపై ఊహాగానాలు సాగుతుండటం, జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసేందుకు మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం, ఇండియా పేరును ‘భారత్‌’గా మారుస్తారాన్న ఊహగానాల నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాలతో కలిసి కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా? లేదా వచ్చే ఏడాది ఏప్రిల్– మే నెలల్లో జమిలి  ఎన్నికలకు వెళ్తుందా? అనేది  కీలకంగా మారింది. త్వరలో జరిగే స్పెషల్ స్పెషన్‌లో అన్ని సందేహాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అసలేంటీ ప్రత్యేక పార్లమెంటు సెషన్, ఎందుకు నిర్వహిస్తారు?

6 ఏళ్ల తర్వాత మరోసారి

ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మోదీ ప్రభుత్వం తొలి టర్మ్‌లో 2017 జూన్ 30న స్పెషన్‌ను ఏర్పాటు చేసింది. ఎన్డీయే ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన జీఎస్టీని ఆమోదించింది. ఇప్పుడు మరోసారి ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. అయితే ఎందుకనేది మాత్రం చెప్పలేదు. కనీసం ప్రతిపక్షాలకు కూడా సమాచారం ఇవ్వలేదు. సమావేశాల ఎజెండా గురించి చర్చించలేదు. ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ లేఖ రాశారు. ఈ క్రమంలో బుధవారం నాడు కేంద్రం ప్రభుత్వం ఓ తాత్కాలిక లిస్టును రిలీజ్ చేసింది. నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 75 ఏళ్ల పార్లమెంటు జర్నీపై చర్చ జరపనున్నట్లు ప్రకటించింది. 

ఇంతకీ ఏంటీ పార్లమెంట్ స్పెషల్ సెషన్?

ఏటా మూడు సార్లు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటాయి. బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సెషన్స్ నిర్వహిస్తుంటారు. ఎన్నికల ఏడాదిలో అయితే ఓట్ ఆన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తుంటారు. ఓ సెషన్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వానికి అధికారం ఇస్తూ రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి. అయితే పార్లమెంటు ‘స్పెషల్ సెషన్‌’ గురించి ప్రస్తావన ఏదీ రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 85(1) కింద సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి. స్పెషల్ సెషన్‌ను నిర్వహించాలనే నిర్ణయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్  కమిటీ తీసుకుంటుంది. సమావేశాలకు రాష్ట్రపతి ఆహ్వానిస్తున్నట్లుగా ఎంపీలకు సమాచారం అందజేస్తారు.

గతంలో స్పెషల్ సెషన్లు ఇలా..

= 1977 ఫిబ్రవరి.. రెండు రోజులపాటు రాజ్యసభ స్పెషల్ సెషన్ నిర్వహించారు. తమిళనాడు, నాగాలాండ్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. 

= 1991 జూన్‌.. రెండు రోజుల ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. హర్యానాలో రాష్ట్రపతి పాలనను ఆమోదించేందుకు నిర్వహించారు. 

= 1992 ఆగస్టు 9.. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మిడ్ నైట్ సెషన్ నిర్వహించారు.

= 1997 ఆగస్టు 26–సెప్టెంబర్ 1.. భారత స్వాతంత్ర్య గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించారు. 

= 2008 జులై.. ప్రధాని మన్మోహన్ సింగ్‌ సంకీర్ణ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో జులైలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక లోక్‌సభ సెషన్ నిర్వహించారు. ఈ అవిశ్వాస తీర్మానంలో యూపీఏ గట్టెక్కింది. తర్వాతి ఎన్నికల్లోనూ గెలిచి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.

= 2015 నవంబర్ 26.. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక సెషన్ నిర్వహించారు. 

= 2017 జూన్ 30.. పరోక్ష పన్ను సంస్కరణల  కోసం సెషన్ నిర్వహించారు. జీఎస్టీ బిల్లును ఆమోదించారు. 

నిర్ణీత తేదీ అంటూ లేదు

భారత పార్లమెంటుకు ఇప్పటికీ నిర్ణీత సెషన్ షెడ్యూల్ అంటూ లేదు. బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 1 నుంచి మే 7 వ తేదీ వరకు, వర్షాకాల సమావేశాలను జులై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, శీతాకాల సమావేశాలను నవంబర్ 5 నుంచి డిసెంబర్ 22 వరకు నిర్వహించుకోవచ్చని 1955లో నాటి లోక్‌సభ కమిటీ ప్రతిపాదించింది. రాజ్యాంగం ప్రకారం రెండు పార్లమెంటు సెషన్లకు మధ్య ఆరు నెలల వ్యవధి ఉండకూడదు. అంటే ఒక సెషన్ నిర్వహించిన ఆరు నెలల్లోగా మరో సెషన్ నిర్వహించాల్సిందే. రాష్ట్రాల అసెంబ్లీల విషయంలోనూ దాదాపు ఇవే నిబంధనలు వర్తిస్తాయి.