పంద్రాగస్టు సందర్భంగా సెల్ఫీల జాతర..

‘‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే” అంటూ ఉప్పొంగిన దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు భారతీయులు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఊరూ వాడా.. గుండెల నిండా మువ్వన్నెల జెండాను నింపుకుని.. 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకున్నారు. ప్రధాని మోదీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వ ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో భారీగా సెల్ఫీలను అప్‌లోడ్ చేశారు. ఒకటో రెండో.. పదో పరకో కాదు.. ఏకంగా 8.9 కోట్ల మంది జాతీయ జెండాతో సెల్ఫీ దిగి […]

Share:

‘‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే” అంటూ ఉప్పొంగిన దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు భారతీయులు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఊరూ వాడా.. గుండెల నిండా మువ్వన్నెల జెండాను నింపుకుని.. 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకున్నారు. ప్రధాని మోదీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వ ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో భారీగా సెల్ఫీలను అప్‌లోడ్ చేశారు. ఒకటో రెండో.. పదో పరకో కాదు.. ఏకంగా 8.9 కోట్ల మంది జాతీయ జెండాతో సెల్ఫీ దిగి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అది కూడా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకే.

ఇళ్లలో జెండాలు ఎగురవేయాలన్న ప్రధాని

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ ఫ్లాగ్‌తో ఫొటో దిగి, హర్ ఘర్‌‌ తిరంగా వెబ్‌సైట్‌లో ఆ ఫొటోలను షేర్ చేయాలని గత ఆదివారం ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తమ ఇళ్లపై 13, 14, 15 తేదీల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో యువత ఫొటోలతో పోటెత్తారు. మంగళవారం మధ్యాహ్నం వరకు 8,81,21,591 సెల్ఫీలు వచ్చినట్లు హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌ హోమ్‌ పేజ్‌లో వెల్లడించారు. ఫ్లాగ్, డిజిటల్ తిరంగాతో సెల్ఫీని అప్‌లోడ్ చేయాలని హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్ హోమ్ పేజీలో పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో కిందికివెళ్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్, నటడు అనుపమ్ ఖేర్, గాయకుడు కైలాశ్ ఖేర్‌‌తోపాటు కేంద్ర మంత్రులు, ఇతర క్రీడాకారులు, నటుల ఫొటోలను చూడవచ్చు. 

సోషల్ మీడియా డీపీ మార్చిన ప్రధాని

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా  హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్‌ను గతేడాది జులై 22న ప్రధాని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అకౌంట్లలో తమ డీపీని మార్చాలని ప్రజలకు గత ఆదివారం ప్రధాని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను డీపీగా పెట్టాలని కోరారు. తర్వాత ఆయన తన డీపీని మార్చారు. మరోవైపు స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వద్ద నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీకి కిషన్‌రెడ్డి, అనురాగ్ ఠాకూర్, శోభ కరండ్లాజే, తదితర కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

ఎర్రకోటపై పదోసారి

మంగళవారం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు మిన్నంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై నుంచి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ  కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి సర్పంచులు, నర్సులు సహా ప్రత్యేక అతిథులు 1,800 మంది హాజరయ్యారు. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 10 వేల మందికి పైగా పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండాను ఎగురువేసిన తర్వాత 90 నిమిషాలపాటు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారతదేశం టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తుందని, ఇది తన హామీ అని చెప్పారు. దేశంలో అవినీతి, కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలపై యుద్ధం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014లో తనకు ఓ అవకాశం ఇచ్చారని, 2019లో మరోసారి నమ్మకం ఉంచారని, ప్రజలు దీవిస్తే 2024 ఆగస్టు 15న మళ్లీ వచ్చి ప్రసంగిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పరోక్షంగా ప్రజలను కోరారు. వచ్చే ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి దేశం సాధించిన విషయాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు.