అలిపిరి మెట్ల మార్గంలో 500 సీసీటీవీలు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శనము చేసుకోవడానికి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తిరుమల వెళ్తూ ఉంటారు. స్వామివారి భక్తులు నిత్యం అనేక మార్గాల ద్వారా తిరుమల కొండకు చేరుకుంటారు. తిరుపతి నుండి తిరుమల కు వేలాది మంది భక్తులు అలిపిరి కాలిబాట మార్గం ద్వారా తిరుమల నడిచి వెళ్తూ ఉంటారు. అయితే గత శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి ఆరేళ్ల బాలుడిని చంపడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పై టీటీడీ […]

Share:

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శనము చేసుకోవడానికి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తిరుమల వెళ్తూ ఉంటారు. స్వామివారి భక్తులు నిత్యం అనేక మార్గాల ద్వారా తిరుమల కొండకు చేరుకుంటారు. తిరుపతి నుండి తిరుమల కు వేలాది మంది భక్తులు అలిపిరి కాలిబాట మార్గం ద్వారా తిరుమల నడిచి వెళ్తూ ఉంటారు. అయితే గత శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి ఆరేళ్ల బాలుడిని చంపడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పై టీటీడీ ఈవో ధర్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

గతంలో కూడా ఇలాంటి ఘటన 

శేషాచలం అడవుల్లో నుండి వెళ్ళే అలిపిరి కాలిబాట మార్గంలో జూన్ నెలలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న బాలిక మీద చిరుత దాడి చేసి పాపను తీసుకుని వెళ్ళింది. అయితే అదృష్టవశాత్తు ఆ పాప గాయాలతో బయటపడింది. పాప కు వెంటనే వైద్య సహాయం అందించగా పూర్తిగా కోలుకుంది. కానీ ఈ ఘటన జరిగిన 2 నెలలు కూడా గడవక ముందే అలిపిరి మార్గంలో చిరుతపులి బాలుడిని చంపడం భక్తులను కలచి వేయడంతో పాటు టీటీడీ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు మీద కూడా ఆందోళన కలిగిస్తుంది. ఈ మార్గంలో నడిచి వెళ్ళడానికి భక్తులు భయపడుతున్నారు. 

మొత్తం మూడు చిరుతలు 

అలిపిరి కాలిబాట మార్గంలో మొత్తం మూడు చిరుతలు సంచరిస్తున్నాయి అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు, ఈ మూడు చిరుతలలో ఒక చిరుతను అటవీ శాఖ అధికారులు పట్టుకుని బోనులో బంధించారు అని మరో రెండు చిరుత పులులను పట్టుకుంటాం అని వివరించారు. వారం రోజుల క్రితం అలిపిరి మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తూ ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలిపిరి కాలిబాట మార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ ఈవో కొన్ని సూచనలు చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్ళడమే తప్ప ఒంటరిగా వెళ్ళవద్దు అని సూచించారు. పిల్లలను నడక మార్గంలో తీసుకుని వెళ్ళవద్దు అని సూచించారు. 

500 సీసీ కెమెరాలు అమరుస్తాం

బాలుడి మీద చిరుతపులి దాడి చేసిన ఘటన రాష్ట్రం అంతా చర్చనీయాంశం అయ్యింది, టీటీడీ భద్రతా ప్రమాణాలు మీద భక్తులు ఆందోళన చెందుతూ ఉండగా , రెండు నెలల క్రితమే చిరుత దాడి చేసిన ఘటన జరిగినా కూడా టీటీడీ భద్రత పెంచలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన మీద స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి అలిపిరి కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలను అమరుస్తున్నట్లు వివరించారు. చిరుత పులులు సంచరిస్తున్నట్టు అనుమానం ఉన్న అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమరుస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా అలిపిరి కాలిబాట మార్గంలో ఫారెస్ట్ రేంజర్ల సంఖ్య కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. అలిపిరి మార్గంలో తిరుమల వెళ్ళే భక్తులు గుంపుగా కలిసి వెళ్ళాలి అని అన్నారు, 100 మంది భక్తులను కలిపి ఒక బృందంగా చేసి వారికి ఫారెస్ట్ రెంజర్ల తో భద్రత కల్పిస్తాం అని అన్నారు. భక్తులు ఎవరూ కూడా ఒంటరిగా వెళ్ళవద్దు అని సూచించారు. శుక్రవారం జరిగిన ఘటన పై విచారణ జరుపుతామని అన్నారు. అయితే వరసగా జరుగుతున్న ఈ ఘటనలతో అలిపిరి మార్గంలో వెళ్ళాలి అంటే శ్రీవారి భక్తులు భయపడుతున్నారు. నడక మార్గంలో వచ్చే భక్తులకు భద్రత కల్పించడానికి టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.