మెడిసిన్స్ వాడి పీరియడ్స్ ను ప్రీపోన్, పోస్ట్ పోన్ చేసుకోవచ్చా.. ఇది ఆరోగ్యానికి మంచిదేనా దీనిపై డాక్టర్లు ఏం అంటున్నారు. ఆరోగ్యానికి ఎలాంటి దుష్ర్పభావాలు వస్తాయి..
ఇంట్లో పెద్ద ఈవెంట్‌ను ప్లాన్ చేసుకున్నారు.. చాలా రోజుల తర్వాత సెలవులు రావడం వల్ల వెకెషన్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీలో మీ ప్రొగ్రామ్ ఉంది.. కానీ, సడెన్‌గా ఓ అవన్నీ క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అమ్మాయిలకు పీరియడ్స్ రావడం వల్ల.. అమ్మాయిలు సంతోషంగా వెకెషన్, ఫంక్షన్లు ప్లాన్ చేసుకున్నప్పుడు సడెన్‌గా పీరియడ్స్ వస్తే, వాటన్నింటినీ క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు బాగా అప్సెట్ అవుతారు. అందుకే చాలా మంది ఇలాంటి ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేసుకున్నప్పుడు పీరియడ్స్ వస్తుందేమోనని భయపడి అది రాకుండా పిల్స్ వేసుకుంటుంటారు. పీరియడ్స్ వచ్చి వెళ్లిపోతే ఓ పని అయిపోతుందని అనుకొని, డేట్ రావడానికి చాలా రోజుల ముందే పిల్స్ వేసుకొని పీరియడ్స్ ను తెచ్చుకుంటారు. అయితే, ఇలా చేయడం మంచిదా… కాదా.. అనేది డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు.. అవేంటో తెలుసుకుందాం…
ఈ విషయంపై గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య వోరా మాట్లాడుతూ, ‘‘ఆరు నెలల క్రితం బీచ్ వెకేషన్‌కు మీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ టైమ్ రానే వచ్చింది. అదే సమయంలో పీరియడ్స్ వస్తున్నట్లు సిగ్నల్ వచ్చింది. అయితే, డేట్ రాకుండా చేయడం సురక్షితమేనా..? ముందుగా డేట్ ఎలా వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. అండాశయం నుంచి గుడ్డు విడుదల అవుతుంది. దీనిని నిరోధించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏమిటంటే, ఆహార పదార్థాలు, వ్యాయామం, సెక్స్, నిద్ర, హార్మోన్ల అసమతుల్యత.. ఇవన్నీ పీరియడ్స్ పై ప్రభావం చూపుతాయి. పీరియడ్స్ ను వాయిదా వేయడం గానీ, టైమ్ కాకుండా ముందుస్తుగా పీరియడ్స్ ను తెచ్చుకోవడం గానీ 100 శాతం మంచి పద్దతి కాదు” అని డాక్టర్ వోరా పేర్కొన్నారు. అయితే, ఇలాంటివి చేసేటప్పుడు కచ్చితంగా గైనకాలిజిస్ట్ ల సలహాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
‘‘ఏదైనా కారణాల చేత పీరియడ్‌ను ఆలస్యం చేయాలనుకోవడం, ముందస్తుగా వాయిదా వేయాలనుకుంటే.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ కలయిక లేదా ప్రొజెస్టెరాన్ మాత్రమే ఉండే మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. అయితే, మెడికల్ కారణాల వల్ల పీరియడ్స్ ఎక్కువ కాలం ఆలస్యమైతే, ఇంజెక్షన్ హార్మోన్లు, ఇంప్లాంట్లు, గర్భ నిరోధక పరికరాలు వంటివి కూడా ఉన్నాయి” అని డాక్టర్ వోరా వివరించారు.
జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెటర్, కన్సల్టెంట్ గైనకాలజీ డాక్టర్ డానీ లాలివాలా మాట్లాడుతూ, ‘‘అవసరమైతే మెడిసిన్స్ ద్వారా పీరియడ్స్‌ను వాయిదా వేసుకోవచ్చు లేదా ఆలస్యం చేసుకోవచ్చు. మతపరమైన కార్యక్రమాలు, ప్రయాణాలు చేసేటప్పుడు, పరీక్షలు ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా చూడొచ్చు. అందుబాటులో ఉన్న హార్మోన్ల ద్వారా చేయొచ్చు. మెడిసిన్స్ ఎప్పుడు వాడతారనేది పీరియడ్స్ వచ్చే సమయంపై ఆధారపడి ఉంటుంది” అని లాలివాలా పేర్కొన్నారు.
‘‘ఇలాంటి మందులన్నీ తీసుకోవచ్చు. కానీ, అనుకున్న టైమ్ కంటే ముందుగానే వాడటం మానేయొచ్చు. కాబట్టి సాధారణ రుతు క్రమానికి అంతరాయం కలిగించకుండా ఉండటం, అలాంటి మందులు తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా ఇది శరీరంలోని హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ కు దారి తీస్తుంది. దీని వల్ల కొన్ని నెలలపాటు రుతు క్రమం సక్రమంగా రాకపోవచ్చు” అని డాక్టర్ లాలివాలా అన్నారు.
1. హార్మోనల్ కాంట్రాసెప్షన్: కొన్ని హార్మోన్ల కాంట్రాసెప్టివ్, కాంబినేషన్ బర్త్ కంట్రోల్ మాత్రలు వంటివి పీరియడ్స్ సమయాన్ని ఆలస్యం చేయడం, నియంత్రిండానికి ఉపయోగించవచ్చు. ప్లేసిబో లేదా షుగర్ పిల్‌ను వేసుకోవడం స్కీప్ చేసి, కొత్త ప్యాక్‌ను ప్రారంభించం వల్ల పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయొచ్చు.
2. ప్రొజెస్టిన్ మెడిసిన్స్: ప్రొజెస్టిన్ అనేది పీరియడ్స్ ఆలస్యం చేయడానికి ట్యాబెట్లు లేదా ఇంజెక్షన్ల రూపంలో సూచించే హార్మోన్. ఇది సాధారణంగా ఒక నిర్ధిష్ట వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రుతుస్రావాన్ని తొందర రావడానికి ప్రేరేపిస్తుంది.
3. నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్టేమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఏఐడీ): ఇబుప్రోఫెన్ వంటి కొన్ని ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు రుతు రక్తస్రావాన్ని తాత్కాలికంగా తగ్గించగలవు. అంతేకాకుండా పీరియడ్స్ ను వాయిదా వేయడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే, ఈ పద్ధతి హార్మోన్ల ఎంపికల వలే నమ్మదగినది కాదు.
సాధారణంగా పీరియడ్స్ ఆలస్యం చేయడానికి లేదా ముందుగా రావడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న లత తెలిపారు. అయితే, ఇలాంటి మందులు వాడేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దుష్ర్పభావాలు ఉంటాయని, అందుకే డాక్టర్లు సూచన మేరకు వీటిని వాడాలని సూచించారు. ‘‘హార్మోనల్ కాంట్రాసెప్టివ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయి. వికారం, తలనొప్పి, రొమ్ములు సున్నితత్వంగా మారడం, మానసికంగా మార్పులు రావడం జరుగుతాయి. కడుపు ఉబ్బరం, రుతు క్రమంలో మార్పులు వంటి దుష్ర్పభావాలకు కారణమవుతాయి. అప్పుడప్పుడు వాడితే సాధారణంగా తక్కువ దుష్ర్పభావాలు ఉంటాయి. కొంతమందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి” అని ఆమె చెప్పింది. అలాగే, ‘‘రుతుచక్రం తరచుగా లేదా ఎక్కువ కాలం ఇన్‌బ్యాలెన్స్ వల్ల సహజ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి, పీరియడ్స్ వాయిదా వేయడానికి, డేట్ కంటే ముందు రావడానికి వ్యక్తిగతంగా కాకుండా డాక్టర్ల సలహాలు తీసుకోవడం మంచిది” అని డాక్టర్ ప్రసన్న లత పేర్కొన్నారు.