హార్ట్ఎటాక్ అందరిని భయపెడుతోంది

హార్ట్ఎటాక్ తర్వాత సుస్మితా సేన్ మళ్ళీ వర్కవుట్ చేయడం మొదలు పెట్టిందిహార్ట్ఎటాక్ తర్వాత ఎలాటి వ్యాయామాలు చేయాలి? ఈ రోజుల్లో చిన్నవాళ్లు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ మధ్య ఎందరో సినీ ప్రముఖులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. తాజాగా నటి సుస్మితా సేన్ కూడా గుండెపోటు బారిన పడ్డారు. తాను చాలా తీవ్రమైన హార్ట్ఎటాక్ నుండి బయటపడ్డానని, ప్రధాన ధమనిలో 95 శాతం మూసుకు పోయిందని సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా […]

Share:

హార్ట్ఎటాక్ తర్వాత సుస్మితా సేన్ మళ్ళీ వర్కవుట్ చేయడం మొదలు పెట్టింది
హార్ట్ఎటాక్ తర్వాత ఎలాటి వ్యాయామాలు చేయాలి?

ఈ రోజుల్లో చిన్నవాళ్లు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ మధ్య ఎందరో సినీ ప్రముఖులు సైతం గుండెపోటుకు బలవుతున్నారు. తాజాగా నటి సుస్మితా సేన్ కూడా గుండెపోటు బారిన పడ్డారు.

తాను చాలా తీవ్రమైన హార్ట్ఎటాక్ నుండి బయటపడ్డానని, ప్రధాన ధమనిలో 95 శాతం మూసుకు పోయిందని సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. 

అయితే, తీవ్రమైన హార్ట్ఎటాక్ నుండి బయటపడిన సుస్మితా సేన్, సాధారణ స్ట్రెచ్‌ వ్యాయామాలు చేస్తూ తన రొటీన్‌ ఫిట్‌నెస్ కి తిరిగి వచ్చింది.  తాను వర్కవుట్ చేయవచ్చని.. తన కార్డియాలజిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.  

దీనికి ముందు, సుస్మిత ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది, ఆమె ఆరోగ్యం, వైద్యం గురించి తెలియజేసింది. ఈ నేపథ్యంలో హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్ళు వ్యాయామం చేయచ్చా? చేస్తే ఎలాంటివి చేయాలి అనేది జటిలమైన ప్రశ్నగా మారింది.

తీవ్రమైన హార్ట్ఎటాక్ నుండి బయటపడిన తర్వాత ఫిట్‌నెస్ జర్నీ ఎలా సాగించాలి? అనేది ప్రధానమైన ప్రశ్న. 

తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టడం మంచిదని అంటున్నారు హృద్రోగ నిపుణులు. మొదటి వారంలో ప్రతి రోజూ ఐదు నిమిషాలు నడవడం ప్రారంభించి, ఆపై ఆరు వారాల తర్వాత రోజుకు 30 నిమిషాలకు చేరుకునే వరకు ప్రతిరోజూ పది నిమిషాల చొప్పున  పెంచాలి. మొదట్లో ఒక మోస్తరు వేగంతో 5-10 నిమిషాలు నడవడం మొదలుపెట్టి, ఆ తర్వాత ప్రతి రోజూ ఒకటి లేదా రెండు నిమిషాలు పెంచవచ్చు. ఒక నెల చివరికి వచ్చేసరికి, వారానికి కనీసం ఐదు రోజులు, రోజుకు 30 నిమిషాలు నడవ గలిగేలా చూసుకోవాలి. చివరి మూడు నిమిషాలు నెమ్మదిగా నడవడం ద్వారా వ్యాయామం ముగిసే సమయానికి, ప్రశాంతత చేకూరుతుందని గుర్తుంచుకోవాలి. నాలుగు నుండి ఆరు వారాల తర్వాత, మీరు ఒకేసారి 15-20 నిమిషాలు వ్యాయామం చేయగలగాలి, మీకు పరిగెత్తడం అలవాటయితే, నెమ్మదిగా తక్కువ దూరం జాగింగ్ చేస్తూ, కాల క్రమేణా కొన్ని వారాలలో కొద్ది కొద్దిగా దూరం, వేగం పెంచాలి. ఇలా శరీరానికి ఒకే సారి శ్రమను అలవాటు చేయకుండా, కొద్దికొద్దిగా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

నడక, పరుగు, ఈత లేదా సైకిల్ తొక్కడం వంటి ఏరోబిక్ వర్కవుట్స్ చేయవచ్చని, అవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయనేది నిపుణుల మాట. స్ట్రెచింగ్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది.  అయితే స్ట్రెంగ్త్ వర్కౌట్‌లు స్టామినాను మెరుగుపరుస్తాయి. నడక, స్విమ్మింగ్, తేలికపాటి పరుగు లేదా బైకింగ్ అన్నీ మంచి ఏరోబిక్ వర్కవుట్లే అని నిపుణులు సూచిస్తున్నారు.

వారానికి కనీసం మూడు, నాలుగు రోజులు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడానికి ముందు ఐదు నిమిషాల పాటు స్ట్రెచింగ్ చేయడం ద్వారా మీ కండరాలను, గుండెను వేడెక్కించాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.  

ఎలాంటి వ్యాయామాలకు దూరంగా ఉండాలి?

ఎక్కువ తీవ్రత గల వ్యాయామాలు చేయకూడదని, పెద్ద పెద్ద బరువులు లేపడం కూడా అంత మంచిది కాదని అంటున్నారు డాక్టర్లు. నడిచే సమయంలో మాట్లాడలేకున్నా, బరువైన వస్తువులను తీసుకువెళ్లడానికి ఇబ్బంది పడుతున్నా, వేగాన్ని తగ్గించాలి. వ్యాయామం మన శరీరానికి ప్లస్ అవ్వాలి తప్ప.. ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇక డాక్టర్ సలహాతో మాత్రమే వ్యాయామం మొదలుపెట్టాలి.

వ్యాయామం కండరాలను గట్టిపరుస్తుంది. అయితే హార్ట్ఎటాక్ వచ్చిన తర్వాత చాలా వారాల పాటు పెద్ద బరువులు ఎత్తడం, భారీ వ్యాయామాలు చేయకపోవడమే మంచిదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, ఏది చేసినా డాక్టర్ సలహా మేరకు చేయడం ఉత్తమం.