మన ఆరోగ్యం గురించి పెదవులే చెప్పాస్తాయి.. !

పదాలు పలికే పెదవులే.. మన ఆరోగ్యం గురించి కూడా చెబుతాయట. మనం ఎంత హెల్దీగా ఉన్నాం..? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను వెల్లడిస్తాయట. శరీరంలో వివిధ భాగాలు.. మన ఆరోగ్యం గురించి సంకేతాలు ఇస్తున్నట్లే.. పెదవులు ఉండే పరిస్థితిని బట్టి కొన్ని విషయాలను అంచనా వేయొచ్చట.  ఆరోగ్యంగా ఉన్న పెదవులు మృదువుగా ఉంటాయట. హైడ్రేటెడ్‌గా, సహజ రంగును కలిగి ఉంటాయి. అయితే ఆరోగ్యకరమైన సహజ పెదవుల రంగు.. వ్యక్తులను బట్టి మారుతుంటుంది. అయితే సాధారణంగా పెదవులు […]

Share:

పదాలు పలికే పెదవులే.. మన ఆరోగ్యం గురించి కూడా చెబుతాయట. మనం ఎంత హెల్దీగా ఉన్నాం..? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను వెల్లడిస్తాయట. శరీరంలో వివిధ భాగాలు.. మన ఆరోగ్యం గురించి సంకేతాలు ఇస్తున్నట్లే.. పెదవులు ఉండే పరిస్థితిని బట్టి కొన్ని విషయాలను అంచనా వేయొచ్చట. 

ఆరోగ్యంగా ఉన్న పెదవులు మృదువుగా ఉంటాయట. హైడ్రేటెడ్‌గా, సహజ రంగును కలిగి ఉంటాయి. అయితే ఆరోగ్యకరమైన సహజ పెదవుల రంగు.. వ్యక్తులను బట్టి మారుతుంటుంది. అయితే సాధారణంగా పెదవులు గులాబీ రంగులో ఉంటాయని ఢిల్లీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరోరా చెప్పారు. పెదవులను ఉన్న పరిస్థితి బట్టి ఆయా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అంచనా వేయొచ్చట. ఇంక ఆమె ఏం చెప్పారంటే.. 

పెదవులు ఇలా ఉంటే..

1.పాలిపోయిన పెదవులు

పాలిపోయిన లేదా నీలిరంగు పెదవులు రక్తహీనత, బలహీనమైన రక్త ప్రసరణ లేదా శ్వాసకోశ సమస్యలను సూచిస్తాయి. పెదవులు ఇలా ఉంటున్నాయంటే.. రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లుగా అనుమానించాలి.

2.పొడిబారిన, చీలిన పెదవులు

చలి పరిస్థితులు ఉన్నప్పుడు పెదవులు పొడిబారిపోతాయి. కానీ వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండానే.. కొన్ని సందర్భాల్లో లిప్స్ పొడి బారుతుంటాయి. డీ హైడ్రేషన్, విటమిన్‌ లోపాలు వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. పెదవులు తరచూ చీలడం పోషకాహార లోపం లేదా చర్మ పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పడానికి సంకేతం.

3.పెదవుల్లో వాపు

అలర్జీలు, అంటువ్యాధులు, ఆంజియోడెమో వంటి ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితుల వల్ల పెదవులు ఉబ్బుతుంటాయి. లేదా వాస్తుంటాయి. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు కొన్నిసార్లు వైద్య సాయం తీసుకోవాల్సి ఉంటుంది.

4.పెదవులపై పుండ్లు, గాయాలు

పెదవులపై తరచూ పుండ్లు లేదా గాయాలు అవుతుంటే.. నోటిలో ఇన్ఫెక్షన్లు అవుతున్నాయని గమనించాలి. 

5.పెదవుల చివరి కొనల్లో పగుళ్లు

పెదవుల చివరి కొనల్లో పగుళ్లు విటమిన్ బి లేదా ఐరన్ లోపానికి సంకేతం కావచ్చు. లేదా యాంగులర్ చీలిటిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు.

6. రంగు మారడం

పెదవులు రంగు మారడం, నల్ల మచ్చలు ఏర్పడటం, హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు. విటమిన్ లోపం, కొన్ని మందులు వాడటం వల్ల కలిగిన రియాక్షన్ కూడా కావచ్చు.

పెదవుల ఆరోగ్యం కోసం ఇవి చేయండి

మీకు అనారోగ్య సమస్యలుంటే ముందుగా వాటికి చికిత్స తీసుకోండి. ఆ తర్వాతే పెదవుల ఆరోగ్యం గురించి ఆలోచించాలి. లోపల ఆరోగ్యంగా ఉంటే.. పెదవులూ ఆరోగ్యంగా ఉంటాయి. కింద పేర్కొన్న విషయాలను ఫాలో కావాలి.

1.ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండండి

పెదవుల ఆరోగ్యం కోసం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే అవసరమైనంత మేరకు మంచి నీళ్లు తాగుతూ ఉండాలి. తద్వారా పెదాలకు కావాల్సినంత తేమ అందుతుంది. ఇదే సమయంలో అతిగా నీళ్లు తాగకూడదు. అవసరమైనంత మేరకే తాగాలి. 

2.లిప్ బామ్ వాడండి

చలి కాలంలో లిప్ బామ్ ఉపయోగించడం తప్పనిసరి. అయితే కొన్ని సార్లు ఎండలకు, ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా పెదవులు పగులుతుంటాయి. అందుకే లిప్‌ బామ్‌ అవసరమైన సమయాల్లో ఉపయోగించాలి. పెదవులు చీలినప్పుడు, పొడిబారినప్పుడు లిప్‌ బామ్ పని చేస్తుంది. అయితే నాణ్యమైన లిప్ బామ్‌ను మాత్రమే ఉపయోగించాలి. 

3.లాలాజలంతో తడి చేయొద్దు

పెదవులు ఆరిపోతున్నాయనో, చీలాయోనో కొందరు లాలాజలంతో పెదవులను తడి చేస్తుంటారు. అంటే నాలుకతో తడుపుతుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకే వీలైనంత వరకు అలా చేయకుండా ఉంటే మంచింది. 

4.సమతుల్య ఆహారం తీసుకోండి

పెదవుల ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫుడ్‌లో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ బి, ఐరన్ ఉండాలి.

5. వాతావరణం మారినప్పుడు జాగ్రత్త

తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు పెదాలను రక్షించుకోవాలి. చలి, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. బయటికెళ్లినప్పుడు లిప్ బామ్ రాసుకోవడంతోపాటు స్కార్ప్‌లు, ఫేస్ మాస్క్‌లు ధరించాలి.