కరోనా కొత్త వేరియంట్ .. వారం తర్వాతే పాజిటివ్ వస్తుంది..

రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలను వణికించింది కరోనా. లక్షలాది మందిని బలి తీసుకుంది. ఎంతో మంది తమ ఆప్తులను పోగొట్టుకున్నారు. ఇంకెంతో మంది కరోనా వల్ల కలిగిన అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. ఏడాదిన్నరగా కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. కానీ ఇప్పటికీ అక్కడకక్కడా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల మరో కొత్త వేరియంట్ వచ్చింది. డెల్టా, ఒమిక్రాన్ స్థాయిలో కాకున్నా.. పలు దేశాల్లో భారీగానే వ్యాప్తి చెందుతోంది. అయితే స్టార్టింగ్‌లో కనిపించిన కరోనా వేరియంట్లతో పోలిస్తే […]

Share:

రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలను వణికించింది కరోనా. లక్షలాది మందిని బలి తీసుకుంది. ఎంతో మంది తమ ఆప్తులను పోగొట్టుకున్నారు. ఇంకెంతో మంది కరోనా వల్ల కలిగిన అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. ఏడాదిన్నరగా కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. కానీ ఇప్పటికీ అక్కడకక్కడా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల మరో కొత్త వేరియంట్ వచ్చింది. డెల్టా, ఒమిక్రాన్ స్థాయిలో కాకున్నా.. పలు దేశాల్లో భారీగానే వ్యాప్తి చెందుతోంది. అయితే స్టార్టింగ్‌లో కనిపించిన కరోనా వేరియంట్లతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్‌గా ఉంటోంది. 

మిగతా వేరియంట్ల మాదిరే

ఈజీ.5గా పిలుస్తున్న ‘ఎరిస్’ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. లక్షణాలు తేలికపాటివిగానే ఉంటున్నాయి. ప్రాణాపాయం పెద్దగా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ఈజీ.5 వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య నిపుణులు.. దాని మ్యుటేషన్లను పర్యవేక్షిస్తున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. చాలా దేశాలకు విస్తరించవచ్చని చెబుతున్నారు. మరోవైపు ‘ప్రీకొవిడ్’ ఎఫెక్ట్ ఎక్కువ అవుతోంది. అంటే కరోనా వచ్చినా సరే.. టెస్టులు చేయించుకుంటే ప్రారంభ రోజుల్లో నెగటివ్‌గానే వస్తోంది. ఓ వారం రోజుల తర్వాత చేయించుకుంటే మాత్రం పాజిటివ్ అని వస్తోంది. 

కరోనా లాంటి వైరస్‌లు సోకినప్పుడు.. అవి బయటపడటానికి సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అది వృద్ధి చెందేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటిదాకా నెగటివ్‌ మాత్రమే వస్తుందని అంటున్నారు. వైరస్‌ లోడ్‌ తక్కువగా ఉండటం మూలంగానే ప్రారంభ రోజుల్లో టెస్టులు చేయించుకుంటే రిపోర్టు నెగటివ్‌గా వస్తుందని వెల్లడిస్తున్నారు. రోజులు గడిచే కొద్ది వైరస్ లోడ్ పెరుగుతుందని చెబుతున్నారు. ప్రీ కొవిడ్ పరిస్థితిని ఎవరైనా ఎదుర్కొంటున్నట్లయితే.. టెస్ట్ చేయించుకున్న వారం తర్వాత మరోసారి టెస్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

ఇంక్యుబేషన్ ఎఫెక్ట్

వైరస్ ఇంక్యుబేషన్ పీరయడ్‌ మూలంగానే నెగటివ్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘‘ఎవరికైనా వైరస్ సోకినప్పుడు.. దాన్ని మనం గుర్తించే స్థాయికి లోడ్ పెరిగేందుకు సమయం పడుతుంది. వైరస్ సోకినప్పటి నుంచి.. దాని లక్షణాలు బయటపడే వరకు ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. కరోనా వైరస్‌కు సంబంధించిన రెండు కొత్త ఉప వేరియంట్లలో ఎరిస్ ఒకటి. కరోనా మిగతా వేరియంట్ల మాదిరే ఎరిస్ లక్షణాలు కూడా ఉంటాయి. సోకిన వారం తర్వాత మాత్రమే.. మనకు టెస్టుల్లో పాజిటివ్ కనిపిస్తుంది” అని ప్రైమస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హెచ్‌వోడీ, డాక్టర్ అనురాగ్ సక్సేనా వెల్లడించారు. 

ఆర్టీపీసీఆర్ టెస్టులకు వెళ్లండి

‘‘కొందరు రోగుల్లో టెస్టుల్లో కొవిడ్ నెగటివ్ వస్తుంది. ఇంకొందరిలో కొవిడ్ ఉన్నప్పటికీ వైరస్ లోడ్ తక్కువ ఉన్న కారణంగా నెగటివ్ వస్తుంది. అంటే టెస్టుల ద్వారా గుర్తించేంత స్థాయి వైరస్‌ మన శరీరంలో వృద్ధి చెంది ఉండదు. అలాంటి సందర్భాల్లో ఓ వారం తర్వాత మరోసారి టెస్టులకు వెళ్లాలి. అప్పుడు కచ్చితమైన రిజల్ట్ వస్తుంది. రోగనిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. కొందరు రోగుల్లో కొవిడ్ ఉన్నప్పటికీ.. వేగవంతమైన యాంటీజెన్ పరీక్షల వల్ల, శాంపిల్స్‌ సరిగ్గా తీయకపోవడం వల్ల నెగటివ్ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో యాంటీజెన్ కంటే ఆర్టీపీసీఆర్ టెస్టులకు వెళ్లడం ఉత్తమం. అది కూడా శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ద్వారా శాంపిల్ సేకరించాలి” అని ఫరీదాబాద్‌లోని అమృత ఆసుపత్రిలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్ డాక్టర్ రోహిత్ గార్గ్ చెప్పారు. ‘‘ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, జ్వరం, అలసట వంటి లక్షణాలు సాధారణంగా ప్రీ కోవిడ్ పీరియడ్‌లో కనిపిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ వచ్చిన మొదటి 7 రోజుల వరకు ఉంటాయి. మునపటి వేరియంట్లతో పోలిస్తే.. దీని విషయంలో భయాందోళన అవసరం లేదు.

ఎరిస్ లక్షణాలు ఇవే

ఎరిస్ వేరియంట్ విషయంలో ఇప్పటిదాక గుర్తించిన లక్షణాలను నోయిడాకు చెందిన డాక్టర్ సైబల్ చక్రవర్తి వెల్లడించారు. దగ్గు, తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసంగా ఉండటం, అలసట, ఆకలి మందగించడం వంటివి ఉంటాయని తెలిపారు.