ఇలా చేస్తే నెగిటివ్‌ ఆలోచనలు దూరం..

గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే నెగెటివ్‌ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతారు కనుక ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. మనకు చేదు అనుభవాలు ఎదురైన గతాన్ని ఓ పీడకలలా మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఇతరుల వల్ల మనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకోకూడదు. అదేవిధంగా మన వల్ల ఇతరులకు కలిగిన ఇబ్బందులు, […]

Share:

గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే నెగెటివ్‌ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతారు కనుక ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. మనకు చేదు అనుభవాలు ఎదురైన గతాన్ని ఓ పీడకలలా మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఇతరుల వల్ల మనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకోకూడదు. అదేవిధంగా మన వల్ల ఇతరులకు కలిగిన ఇబ్బందులు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. 

అనారోగ్యం.. ఇంట్లోనో.. ఉద్యోగంలోనో సమస్యలు.. కారణాలు ఏవైనా.. ఎక్కువ రోజులు ఇవే ఆలోచనలతో కాలం గడపడం మంచిది కాదు.. అందుకే మనసు బాలేనప్పుడు మళ్లీ కాస్త పాజిటివ్ మూడ్‌లోకి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్‌కు అలవాటు పడిపోతున్నాడు. దీని వల్ల టెన్షన్స్‌ పెరిగిపోతే రోగాల బారిన పడుతున్నాడు. అధిక ఆలోచనల వల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది. కొన్ని చిన్న చిన్న సంతోషాల ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చని, మనిషి ఎల్లపుడూ సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలని వదిలేయాల్సిందేనని చెబుతున్నారు మానసిక నిపుణులు. 

ఆలోచనలతో ఒత్తిడి: 

ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయని ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పరిస్థితి మరింత చేజారిపోతుంది. మీరెంత ఎక్కువగా వీటి గురించి ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. రోజువారీ పనులూ మందకొడిగా సాగుతాయి. అయితే ఈ ఆలోచనలను ఒక్కసారే నిర్మూలించడం సాధ్యంకాదు. ఇలాంటి ఆలోచనలు రావడం మొదలుపెట్టినప్పుడు మీ దృష్టిని మరో పని మీదకు మళ్లించాలి. చదువు, ఇతర పనులను కొనసాగిస్తూ బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆలోచనలు ఎప్పుడూ మీ నియంత్రణలో ఉండాలిగానీ మీరే ప్రతికూల ఆలోచనల నియంత్రణలోకి వెళ్లపోకూడదు. 

శిక్షణ ఇవ్వండి: 

మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందడానికి మీ మెదడుపై ప్రతికూల మనస్తత్వం నుంచి సానకూల మనస్తత్వానికి మళ్లీ శిక్షణ ఇవ్వండి. మంచి ఆలోచనలుచేయండి. చెడు ఆలోచనలను దరికి రానీవ్వకండి.

స్పందించే విధానం: 

మీ ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోగలిగితే వాటిని నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు. రోజువారీ సంఘటనల పట్ల మీ స్పందన ఎలా ఉంటుందనే విషయంలో ఒక అంచనాకు రావాలి. ప్రతి విషయానికీ సానుకూలంగా స్పందిస్తున్నారా లేదా ప్రతికూలంగా స్పందిస్తున్నారో తెలుసుకోవాలి. అలాగే ప్రతికూల ఆలోచనలు రావడం వెనుక ఉన్న కారణాన్ని అన్వేషించాలి. నిర్దిష్టమైన ప్రదేశం, పరిస్థితులు లేదా మనిషి మీ ప్రతికూల ఆలోచనలకు కారణమైతే సాధ్యమైనంత వరకు ఆయా పరిస్థితులు లేదా మనుషులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. 

చిన్న చిన్న విజయాలు:

 ప్రతి మనిషి జీవితం ఒడిదొడుకులతో సాగిపోతుంటుంది. మనకు పెద్దగా గుర్తించలేని చిన్న చిన్న విజయాలు ఉంటాయి. అలాంటి చిన్నపాటి విజయాలను ఆనందంగా జరుపుకోవడం కోసం కొంత సమయం కేటాయించండి. అప్పుడు మీలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. స్నేహితులు, ప్రియమైన వారితో కొంత సమయం గడపడండి. దీని వల్ల జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది సంతోషాలు ఏర్పడతాయి.

పరిష్కరించే దిశగా:

 ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలి. ఈ ఆలోచనల్లో వాస్తవం ఎంతో గుర్తించాలి. అవి వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నాయో లేదో తెలుసుకోవాలి. లేదా మీకున్న భయాలే ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తున్నాయా అనే దిశగానూ ఆలోచించాలి. ఇలా తార్కికంగా ఆలోచించడం వల్ల నిరంతరంగా వచ్చే ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడొచ్చు. 

పోలికలతో నష్టం:

 విద్యార్థులుగా, ఉద్యోగార్థులుగా మీ మీద మీకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోలేనప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి. అలాగే ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటే.. ఆ సందర్భంగా  ఆత్మన్యూనత తలెత్తవచ్చు. దీనివల్ల కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అందుకే పోల్చుకోవడం మానేయటం ఉత్తమం.

విమర్శలతో ఎదుగుదల:

 సాధారణంగా విమర్శలను వినగానే ఎవరైనా ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడతారు. ఉదాహరణకు మీరు రాసినదాంట్లో సరైన పాయింట్లు లేవని ఎవరైనా విమర్శించారు అనుకుందాం. అంటే దానర్థం మీకు రాయడమే రాదని కాదు. మీరు రాసే దాంట్లో అదనంగా మరిన్ని అంశాలను చేర్చితే సరిపోతుంది. విమర్శలను నేర్చుకోవడానికో అవకాశంగా భావిస్తే.. మీ ఎదుగుదలకూ తోడ్పడతాయి.

బలాలను గ్రహిస్తే మేలు: 

ఇతరులు చేసిన విమర్శలు మీకు ఎక్కువకాలంపాటు గుర్తుండిపోతాయి. పొగడ్తలను మాత్రం మర్చిపోతుంటారు. అలాగే మీలోని బలహీనతల మీదే దృష్టి కేంద్రీకరిస్తారుగానీ బలాల గురించి ఆలోచించరు. కాబట్టి ముందుగా మీ దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. అప్పుడు సానుకూలంగా స్పందించడం అలవాటు అవుతుంది. మీలో ఉన్న బలాల గురించి మీకు స్పష్టంగా తెలిసుండాలి. ఈ స్పష్టత మీకుంటే ప్రతికూల ఆలోచనల వేగం తగ్గుతుంది. మీ బలాల పట్ల అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. గతంలో మీరు చేసిన పొరపాట్లు, పొందిన అపజయాల  గురించి పదేపదే ఆలోచించడం మానేయాలి. వీటి స్థానంలో మీ బలాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. బలహీనతలు ఆత్మన్యూనతనూ, బలాలు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

మ్యూజిక్‌ వినండి: 

నెగెటివ్ థింకింగ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట వినడమో, పాడడమో చేయండి. మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే అవకాశాలుంటాయి.. 

ఉన్నదానితోనే తృప్తి: 

మీరు కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి. మీ వద్ద ఉన్నదానితోనే తృప్తి పడండి. మీ దగ్గర ఉన్న కృతజ్ఞతతోనే మీ జీవితంలో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో నిరాశ పడకూడదు. ఉన్నదానితోనే సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. మీరు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి. ఇతరులకు డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉన్నవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మానవత్వం అలవాటు చేసుకోండి. 

ధ్యానం: 

ఎంత నియంత్రించుకుందామని ప్రయత్నించినా నెగెటివ్ ఆలోచనలు అస్సలు ఆగట్లేదా? అయితే ముందుగా మీ మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి కొద్ది నిమిషాల పాటు ధ్యానం లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం వంటివి చేయండి. ఆ తర్వాత పాజిటివిటీని పెంచే కొటేషన్స్ చదవండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.