డిప్రెష‌న్ నుంచి బయటపడటం ఎలా..? 

డిప్రెష‌న్.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో దీని బారిన పడడం ఖాయం. చిన్నా.. పెద్దా.. ఆడ.. మగ.. ఇలా ఎటువంటి భేదం లేకుండా ఎవరికైనా ఈ సమస్య రావొచ్చు. ఒక సారి మానసిక ఒత్తిడికి గురయ్యామంటే క్రమేపీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఆందోళన, చెప్పలేనంత బాధ.. డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. ఒత్తిడికి కారణాలు అనేకం .. ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడిన, ఏదైనా కోల్పోయినా, ఎవరితోనైనా […]

Share:

డిప్రెష‌న్.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో దీని బారిన పడడం ఖాయం. చిన్నా.. పెద్దా.. ఆడ.. మగ.. ఇలా ఎటువంటి భేదం లేకుండా ఎవరికైనా ఈ సమస్య రావొచ్చు. ఒక సారి మానసిక ఒత్తిడికి గురయ్యామంటే క్రమేపీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఆందోళన, చెప్పలేనంత బాధ.. డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి.

ఒత్తిడికి కారణాలు అనేకం ..

ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడిన, ఏదైనా కోల్పోయినా, ఎవరితోనైనా గొడవ పడినా, మనకు నచ్చింది దక్కకపోయినా, అనుకున్నది అవకపోయినా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా మనలో మానసిక ఒత్తిడి మొదలవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారుతుంది. ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటివి కూడా డిప్రెషన్‌కి కారణమవుతాయి. కొన్ని రకాల మందులు ఎక్కువ కాలం వాడడం, సామాజిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా తీవ్రమైన స్ట్రెస్ కి గురి చేస్తాయి.

మైండ్‌ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే ..

కారణాలేవైనా సరే.. డిప్రెషన్ కి గురైతే మానసికంగా చిత్తు కావడం ఖాయం. ఈ ఒత్తిడిని జయించేందుకు చాలా మంది మందులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇది సరైనదేనా అని అంటే.. కాదని చెప్పలేం.. అలా అని అవునని చెప్పలేం. ఐతే.. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేయడంతోపాటు మన మైండ్‌ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే ఈ ఒత్తిడి మన దరిదాపుల్లోకి కూడా రాలేదు. మనకు వచ్చిన సమస్య ఎటువంటిదైనా సరే తీవ్రంగా ఆలోచించడం సరి కాదు. ఇటువంటి అంశాలే డిప్రెషన్‌కి కారణమవుతాయి.

ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే ..

ఎవరైనా రిజెక్ట్ చేసినా లేదా అవహేళన చేసినా లేదా బాధ పెట్టినా సరే మనం అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంటాం. ఐతే.. ప్రతి ఒక్కరినీ, ప్రతి విషయాన్నీ మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎందుకు ఆ మాట అన్నారు ? ఉన్న మాటే అన్నారా లేదా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా ? వారికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వంటి అంశాల దిశగా మన ఆలోచన ఉండాలి. ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే ఇక జీవితంలో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేం.

ఆత్మ విశ్వాసం కూడా దెబ్బ తింటుంది..

ఆశకు హద్దుండాలి. ఆలోచనలకు పరిధి ఉండాలి. లక్ష్యాలకు లిమిట్స్ ఉండాలి. ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంచనాలకు మించి గోల్స్ సెట్ చేసుకుని వాటిని అందుకోలేక పోయామని నిరుత్సాహపడే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి కారణాల వల్ల కూడా స్ట్రెస్ మొదలవుతుంది. అంచనాలను అందుకోలేకపోతే ఆత్మ విశ్వాసం కూడా దెబ్బ తింటుంది. అందుకే ఆశలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి.

గమ్యం చేరాలంటే సర్వ శక్తులూ ఒడ్డాలి..

మనం కోరుకున్న ప్రతిదీ మనకు అనుకున్న వెంటనే దక్కదు. అందుకే అప్పటి వరకు మన ఆర్థిక, సామాజిక స్థితి గతులు ఏవైనా, ఎలాంటివైనా సరే అనుక్షణం ఎంజాయ్ చేయాలి. జీవితాన్ని ఆస్వాదించాలి. ఇక మీ లక్ష్యాలంటారా.. ? వాటి సాధన కోసం ప్రణాళికా బద్ధంగా అడుగుల వేయాలి. గమ్యం చేరాలంటే సర్వ శక్తులూ ఒడ్డాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఉంటేనే మీరు అనుకున్న సమయంలో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.

ఈ లక్షణాలుంటే అశ్రద్ధ చేయకండి..

ప్రతికూల ఆలోచనలు ఎక్కువైనా, ఏదైన విషయంపైన కాన్‌సెంట్రేట్ చేయలేకపోయినా, కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా, చిన్న చిన్న విషయాలకే కొన్నిసార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లూ వచ్చినా, అకారణంగా ఏడుపు వచ్చినా, అనవసర విషయాలకు కూడా చిరాకు కలిగినా, కారణం లేకపోయినా గిల్టీ ఫీలింగ్ కలిగినా అశ్రద్ధ చేయకండి. ఇటువంటి లక్షణాలు ఎక్కువ రోజులపాటు ఉంటే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఖాయం. 15 రోజులైనా ఈ లక్షణాల్లో మార్పు కనిపించకపోతే మానసిక వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి.

ఆహార అలవాట్లు ఇలా ఉంటే..

మంచి ఆహార అలవాట్లు ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాహారం, గుడ్లు, చేపలు వంటివి వారానికి మూడు సార్లయినా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం ఆరు రకాల పండ్లతోపాటు తగినన్ని కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. తరచూ తృణధాన్యాలు తింటే స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుందట.

మానసిక ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి..

  • వాకింగ్, జాగింగ్, వ్యాయామం..ఇలా శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు ఏదో ఒక కసరత్తు చేయండి.స్ట్రెస్ కు చెక్ పెట్టాలంటే వీటికి మించింది లేదు.
  • ప్రతి రోజూ ధ్యానం చేయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మెడిటేషన్‌ను దినచర్యలో భాగం చేసుకుంటే మనసు, మెదడు రిలాక్స్ అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
  • యోగాసనాలపై కాన్‌సెన్‌ట్రేట్ చేయండి. ఆసనాలు వేయడం ద్వారా మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఫిట్‌గా మారుతారు.
  • మీకు సంగీతం అంటే ఇష్టముంటే రోజూ ఓ అరగంట సేపైనా మీకు నచ్చిన పాటలను విని ఎంజాయ్ చేయండి. మీకు డ్రాయింగ్ అంటే ఇష్టమైతే రోజూ ఓ గంటసేపు అందులోనే నిమగ్నమవ్వండి.
  • కంటి నిండా నిద్ర లేక పోయినా స్ట్రెస్ మొదలవుతుంది. అందుకే ప్రతి రోజూ తప్పనిసరిగా 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపొండి.
  • కొంతమందికి ఒంటరిగా ఉంటే ఇష్టం. కానీ మానసిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు మాత్రం పది మందిలో గడపడానికి ప్రయత్నించండి. దీని వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆలోచనలకు బ్రేక్ పడుతుంది.