‘మధు మరుపు’ గురించి భయంకరమైన వాస్తవాలు..

భారతదేశంలో దాదాపు 3.7 మిలియన్ల మంది ప్రజలు అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నారు మరియు ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. అల్జీమర్ అనేది చిత్తవైకల్యం మరియు సంబంధిత రుగ్మతల యొక్క అత్యంత సాధారణ రకం. సాధారణ బ్లడ్ షుగర్ ఉన్నవారి కంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి అల్జీమర్ వ్యాధి వచ్చే ప్రమాదం 50 నుండి 65 శాతం ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనం సూచించింది. ఇదేంటి కొత్త వ్యాధి అని అనుకుంటున్నారా! అటువంటిదేం లేదు.. […]

Share:

భారతదేశంలో దాదాపు 3.7 మిలియన్ల మంది ప్రజలు అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నారు మరియు ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. అల్జీమర్ అనేది చిత్తవైకల్యం మరియు సంబంధిత రుగ్మతల యొక్క అత్యంత సాధారణ రకం. సాధారణ బ్లడ్ షుగర్ ఉన్నవారి కంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి అల్జీమర్ వ్యాధి వచ్చే ప్రమాదం 50 నుండి 65 శాతం ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనం సూచించింది.

ఇదేంటి కొత్త వ్యాధి అని అనుకుంటున్నారా! అటువంటిదేం లేదు.. మనం సాధారణంగా వినే మధుమేహం వల్ల అల్జీమర్స్ వస్తే దానిని మధు మరుపు అని అంటారు.  మధుమేహం.. సాధారణంగా మనమంతా షుగర్ అని పిలిచే ఈ వ్యాధి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇది గనుక మనకు వచ్చిందంటే చాలు మన జీవితం మన చేతుల్లో ఉండదిక. ఎన్ని మందులు వాడినా కానీ దీనిని రూపుమాపడం సాధ్యం కాదు. ఇక అల్జీమర్స్ మరో రకమైన వ్యాధి. ఈ వ్యాధి వస్తే ప్రతీదీ మర్చిపోతుంటారు. మధుమేహానికి కారణమయ్యే అంశాలే అల్జీమర్స్​కు దారి తీస్తాయని మనలో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అంటే మధుమేహంతో వచ్చే ముప్పేముంది మహా అయితే అన్నీ కంట్రోల్​గా తినాలని అనుకుంటే మనం పొరపాటు చేసినట్లే అవుతుంది. దీంతో అల్జీమర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఆరోగ్యమైన జీవనశైలిని పాటించి మధుమేహం రాకుండా చూసుకోవడం ఉత్తమం. ఒక వేళ వచ్చినా కానీ మరింత ఎక్కువ కాకుండా, అల్జీమర్స్​కు దారి తీయకుండా కాపాడుకోవచ్చు.

వయసు పెరిగే కొద్దీ..

మనకు వృద్ధాప్యం వచ్చే కొద్దీ మనకు వచ్చే వ్యాధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. అలా వయసు పెరిగినపుడు వచ్చే వ్యాధుల్లో ఒకటి అల్జీమర్స్. ఇది కనుక మనకు వచ్చిందంటే మనం అన్ని విషయాలను ఈజీగా మర్చిపోతుంటాం. మన జ్ఞాపకశక్తి లోపిస్తుంది. మన దేశంలో 60 సంవత్సరాలు పైబడిన 60 లక్షల మందికి  మతిమరుపు (డిమెన్షియా) ఉందని ఒక అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది అల్జీమర్స్ (తీవ్ర మరుపు) బాధితులే అన్న వాస్తవం ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ జబ్బు 50 సంవత్సరాల వయసులోనే వచ్చినా.. 60 సంవత్సరాల వయసు వచ్చే సరికి దీని లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అదే కనుక మనకు మధుమేహం ఉందనుకోండి.. ఈ వ్యాధి లక్షణాలు 60 సంవత్సరాలకు ముందే ఎక్కువయ్యేలా చేస్తుంది. కేవలం మధుమేహం ఉన్న వారికి మాత్రమే కాదు… ప్రీ డయాబెటిక్ పేషంట్లకు కూడా కాగ్నిటివ్​ సామర్థ్యం (ఎబిలిటీ) క్షీణిస్తున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

రెండు రెట్లు ఎక్కువ అవకాశం

మధుమేహం లేని వారితో పోలిస్తే మధుమేహం ఉన్న వారికి డిమెన్షియా వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. పక్షవాతం, పార్స్కిన్సన్ వంటి వాటితో తలెత్తే వ్యాస్కులర్ డిమెన్షియా వచ్చే ప్రమాదం కూడా మధుమేహం ఉన్న వారికి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముందే షుగర్ పేషంట్ల ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండేదంటే.. కోవిడ్ తర్వాత అయితే షుగర్ ఉన్న చాలా మందిలో డిమెన్షియా, అల్జీమర్స్ వెలుగు చూస్తున్నాయి. మరో 25 సంవత్సరాలు పోతే డిమెన్షియా బాధితుల సంఖ్య మరో మూడు రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

మతిమరుపుకు దీనికి తేడా అదే..

మతిమరుపుది ఏముంది.. ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా? దీనికి ఇంత పెద్ద సీన్ చేయాలా? అని చాలా మందికి అనిపిస్తుంటుంది. మామూలు మతిమరుపు అయితే మర్చిపోయిన విషయంలో ఏదో ఒక భాగం గుర్తుంటుంది. కానీ అదే అల్జీమర్స్ మతిమరుపు అనుకోండి.. అసలు మనం మరిచిపోయిన విషయం గురించి ఒక్క ముక్క కూడా మనకు గుర్తుండదు. అల్జీమర్స్ కనుక వస్తే అనేక విషయాలు మన కంట్రోల్​లో ఉండవు. అనేక బాధలు పడాల్సి వస్తుంది.

గుర్తించడమెలా?

అల్జీమర్స్ వచ్చిందని గుర్తించడం చాలా కష్టం. అల్జీమర్స్ వస్తే ఎటువంటి లక్షణాలు పెద్దగా బయటికి కనిపించవు. కానీ కనిపించే లక్షణాలతోనే మనం వ్యాధిని గుర్తించగల్గాలి. అల్జీమర్స్ వచ్చిన వ్యక్తుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మధుమేహం ఉన్న చాలా మంది తమకు అల్జీమర్స్ వచ్చిందేమో అని భయపడిపోతుంటారు. కానీ ఇలా అనుమానించే వారికి అసలు ఆ వ్యాధి లేనే లేదనుకోవాలి. అల్జీమర్స్ వస్తే ప్రతి విషయాన్ని మర్చిపోతుంటాం. ఉదాహరణ చెప్పుకుంటే మనం ఒక స్టోర్​కు వెళ్లి కీపర్​కు డబ్బులిచ్చి చేంజ్ తీసుకోకుండానే తిరిగొస్తాం. అంతెందుకు మన ఇంటికి వెళ్లే దారిని కూడా మర్చిపోతుంటాం. వస్తువులను ఎక్కడో పెట్టి.. ఎక్కడో పెట్టామని వెతుకుతుంటాం. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. కొత్త విషయాలను అదే పనిగా మర్చిపోతే.. అల్జీమర్స్ ఉందని తప్పకుండా అనుమానించాలి.

చికిత్స లేకున్నా కానీ..

అల్జీమర్స్​కు పూర్తిగా నయం చేసేందుకు ఇంకా ఎటువంటి చికిత్స లేదు. తొలి దశలోనే గుర్తిస్తే కొన్ని మందులతో లక్షణాలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. మధుమేహం కంట్రోల్ అయ్యేందుకు.. అల్జీమర్స్ కంట్రోల్ అయ్యేందుకు సెపరేట్ చికిత్సలు ఏమీ లేవు. ఈ రెండింటికి ఒకే చికిత్స ఉంటుంది. ఈ వ్యాధులను కంట్రోల్​లో ఉంచుకునేందుకు గ్లూకోజ్​ను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అల్జీమర్స్​ను తగ్గించుకునేందుకు మెట్​ఫార్మిన్.. లిరాగ్లుటైడ్ వంటి జీఎల్​పీ–1 రకానికి చెందిన మందులను తీసుకోవాలి.

జాగ్రత్తలే శ్రీరామ రక్ష

మధుమేహం వచ్చిన తర్వాత ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ.. అనేక మందులు వాడుతూ… అయినా వ్యాధి సరిగ్గా నయం కాక బాధపడే బదులు ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నిప్పు అంటుకున్న తర్వాత నీళ్లు పోసి ఆర్పేందుకు ట్రై చేసే బదులు అసలు నిప్పు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఇక ఈ మధుమేహం గర్భవతులకు కనుక వస్తే గర్భధారణ మధుమేహం అని పిలుస్తారు. ఇది పుట్టబోయే చంటి పిల్లలను ప్రభావితం చేస్తుంది.