వ‌ర్షాల‌తో డెంగీ ముప్పు..!

డెంగీ.. దోమ కాటుతో వచ్చే వైరల్ ఫీవర్. అందరికీ కాకున్నా.. కొందరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరం కాస్త బలహీనంగా ఉన్నా ప్రాణాలను తీసేస్తుంది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. గర్భిణులకు డెంగీతో ముప్పు ఎక్కువ. తల్లీబిడ్డల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలలు నిండకుండానే కాన్పు జరగడం, పిల్లలు చనిపోయి పుట్టడమో జరగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వానలు జోరుగా పడుతుండటంతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘‘గర్భధారణ సమయంలో.. […]

Share:

డెంగీ.. దోమ కాటుతో వచ్చే వైరల్ ఫీవర్. అందరికీ కాకున్నా.. కొందరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరం కాస్త బలహీనంగా ఉన్నా ప్రాణాలను తీసేస్తుంది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. గర్భిణులకు డెంగీతో ముప్పు ఎక్కువ. తల్లీబిడ్డల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నెలలు నిండకుండానే కాన్పు జరగడం, పిల్లలు చనిపోయి పుట్టడమో జరగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వానలు జోరుగా పడుతుండటంతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

‘‘గర్భధారణ సమయంలో.. పెరుగుతున్న పిండానికి అనుగుణంగా రోగ నిరోధక వ్యవస్థ మార్పులకు లోనవుతుంది. గర్భిణులు డెంగీ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు జరిగితే.. తీవ్రత మరింత పెరుగుతుంది. డెంగీ ఇన్ఫెక్షన్ సమయంలో నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. తక్కువ బరువుతో, లేదా కడుపులోనే శిశువు చనిపోవడం వంటివీ జరుగుతాయి” అని బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రిక చెప్పారు.

ఇంట్లోనే నివారణ చర్యలు

డెంగీ రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడమే శ్రీరామరక్ష. ఇంట్లో, ఆఫీసులో ఉన్నా.. ప్రయాణిస్తున్నా సరైన దుస్తులు ధరించాలి. చేతులు పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోవాలి. అవసరం ఉన్న చోట దోమలు కుట్టకుండా క్రీములు పూసుకోవాలి. ఎక్కడా నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. రాత్రిళ్లు పడుకునేటప్పుడు డోర్లు, కిటికీలు మూసి ఉంచాలి. గర్భిణి తనకు డెంగీ ఉందని అనుమానిస్తే.. వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. ఎంత త్వరగా స్పందిస్తే.. ప్రమాదానికి అంత దూరంగా ఉండొచ్చు. ప్లేట్‌లెట్లు పడిపోతున్నా, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నా హాస్పిటల్‌కు వెళ్లాలని అర్థం చేసుకోవాలి. 

కాన్పు సమయంలో ప్రత్యేక శ్రద్ధ 

జ్వరం తగ్గిన తర్వాతే అసలు ప్రమాదం మొదలవుతుంది. రక్తపోటు, ప్లేట్‌లెట్లు పడిపోయేది ఈ సమయంలోనే. జ్వరం తగ్గిందని సంతోషపడేలోపు.. ప్లేట్‌లెట్లు భయపెడుతాయి. అందుకే మరింత అప్రమత్తంగా ఉండాలి. కాన్పు సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరికి రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పనిసరైతేనే సిజేరియన్‌కు ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు సహజ కాన్పు అయ్యేలా చూసుకోవడమే మంచిది. 

ఇవీ డెంగీ లక్షణాలు

డెంగీ తొలి దశలో ఒకలా, తీవ్రంగా మారితే మరోలా లక్షణాలు ఉంటాయి. తొలి దశలో ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల నొప్పి, వాంతి, వికారం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఆకలి మందగించడం వంటివి కనిపిస్తాయి. 

డెంగీ తీవ్రంగా మారితే కడుపు నొప్పి, ఆయాసం, పొట్ట లేదా ఛాతీలో నీరు పోగుపడటం, వాంతులు, చిగుళ్ల నుంచి రక్తం రావడం, చర్మంపై మచ్చలు, బీపీ పడిపోవడం, కాళ్లు చేతులు చల్లబడటం, నిస్సత్తువ, చికాకు, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటివి జరుగుతాయి. 

పెరిగిపోతున్న కేసులు

భారీ వర్షాలకు ప్రతి చోట నీళ్లు చేరడంతో దోమలు గుడ్లు పెట్టి.. దోమల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగీ పంజా విసురుతోంది. చాలా మందికి పారాసిటమాల్‌ మాత్ర వేసుకుంటేనే తగ్గిపోతుంది. అతి కొద్ది మందికి మాత్రమే ప్రాణాంతకమవుతుంది. కడుపునొప్పి, వాంతులు వదలకపోవడం, నిస్సత్తువ, కాలేయం పెద్దగా అవడం వంటి కనిపిస్తే ఆసుపత్రిలో చేర్చాలి. బీపీ పడిపోవడం, రక్తస్రావం, చాతీలో నొప్పి, ఆయాసం వంటివి కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. 

ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే..

ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గితే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. ప్లేట్‌లెట్లు 50 వేల కన్నా పడిపోతే ఆసుపత్రిలో చేర్చి, నిశితంగా పరిశీలిస్తుండాలి. 20 వేల కన్నా తగ్గి, రక్తస్రావం అవుతుంటే.. ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. 10 వేల పడిపోయాయంటే.. రక్తస్రావం జరగకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.