నేత్ర‌దానం.. అపోహ‌లేంటి.. నిజాలేంటి?

 ‘‘సర్వేంద్రియానం నయనం ప్రదానం” అన్నారు పెద్దలు. మానవ శరీరంలో అన్నింటికంటే కళ్లు చాలా ప్రదానమైనవి. ప్రకృతిని, ప్రపంచాన్ని, మంచిని, చెడుని చూసే ఈ కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. ఈ ప్రపంచంలో కళ్లు లేని వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు నేత్రదానం చేయడం వల్ల చూపు తిరిగి వస్తుంది. మనం బతికి ఉన్నప్పుడు ఎలాగూ నేత్రదానం చేయలేం.. కానీ, చనిపోయాక మన కళ్లను వేరేవాళ్లకు దానం చేస్తే వారికి చూపు తిరిగి వచ్చే అవకాశ […]

Share:

 ‘‘సర్వేంద్రియానం నయనం ప్రదానం” అన్నారు పెద్దలు. మానవ శరీరంలో అన్నింటికంటే కళ్లు చాలా ప్రదానమైనవి. ప్రకృతిని, ప్రపంచాన్ని, మంచిని, చెడుని చూసే ఈ కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. ఈ ప్రపంచంలో కళ్లు లేని వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు నేత్రదానం చేయడం వల్ల చూపు తిరిగి వస్తుంది. మనం బతికి ఉన్నప్పుడు ఎలాగూ నేత్రదానం చేయలేం.. కానీ, చనిపోయాక మన కళ్లను వేరేవాళ్లకు దానం చేస్తే వారికి చూపు తిరిగి వచ్చే అవకాశ ఉంది. అయినా, చాలా మంది కండ్లను దానం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. నేత్ర దానంపై చాలా మందిలో ఉన్న అపోహల వల్లే ఎవ్వరూ ముందుకు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అపోహలను తొలగించేందుకు ఏటా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆగస్టు 25 నుచి సెప్టెంబర్‌‌ 8 వరకు 15 రోజుల పాటు ‘నేషనల్‌ ఐ డొనేషన్‌’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని ద్వారా నేత్ర దానంపై ఉన్న అపోహలను తొలగించడంతో పాటు అవగాహన కల్పిస్తారు.

మరణించిన  తర్వాత తమ నేత్రాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం, సంతకాలు తీసుకోవడం వంటవి ఈ 15 రోజులు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా దేశంలోనే కాదు ప్రపంచంలోనే కార్నియాస్‌ కొరతను తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీలైనంత మంది నేత్ర దానంపై ఉన్న అపోహలు వీడి కండ్లను దానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నారు. అయితే, ఇండియాలో సాంస్కృతిక పరంగా నమ్మకాలు ఎక్కువ. అందుకే చనిపోయాక నేత్రదానం చేస్తే ఏదో జరిగి పోతుంది అనుకుంటుంటారు. అందుకే ప్రజలు ఎక్కువగా ముందుకు రావడం లేదు. అందుకే ఈ 15 రోజుల అవగాహన కార్యక్రమంలో ఈ అడ్డంకులను ఛేదించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం, నేత్రదానం సంస్కృతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఎవరు నేత్ర దానం చేయొచ్చు?

‘‘ఏ వయసు వారైనా నేత్ర దానం చేయొచ్చు. కంటిలోని అతి ముఖ్యమైన పొర కార్నియా. ఇది కంటి పారదర్శక ముందు భాగం. 70 ఏండ్ల నుంచి 75 ఏండ్ల వరకు కూడా ఈ కార్నియాను దానం చేయొచ్చు. అయితే, యువకుల కార్నియాను మార్పిడి చేస్తే ఆపరేషన్‌ సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. కంటి శుక్లం, గ్లాకోమా లేదా రెటీనా వంటి వ్యాధులు ఉన్న వారు సరైన దాతలు కాకపోవచ్చు. అదేవిధంగా హెచ్‌ఐఈ, హెపటైటిస్‌ బీ, సీతో పాటు కొన్ని క్యాన్సర్లు వంటి వ్యాధుల చరిత్ర కలిగిన వ్యక్తులు నేత్ర దానం చేయకూడదు. నేత్ర దానం చేయడానికి వచ్చిన ప్రతి కేసును చెక్‌ చేస్తారు. కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేత్ర దానం చేసే వ్యక్తి అనర్హుడిగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంటుంది” అని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ కన్సల్టెంట్‌, ఆప్తాల్మాలజీ డాక్టర్‌‌ నీతూ అన్నారు. 

డాక్టర్‌‌ శర్మ వెల్లడించిన నేత్ర దానానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అపోహ: నేత్రదానం చేసే వ్యక్తి శరీరం వికృతంగా మారుతుందా?

వాస్తవం: నేత్ర దానం అనేది సున్నితమైన, గౌరవప్రదమైన ప్రక్రియ. నేత్ర దానం ప్రక్రియను శిక్షణ పొందిన వైద్య నిపుణులు నిర్వహిస్తారు. దీని వల్ల దాత శరీరం వికృతంగా కాదు. ఆపరేషన్ ద్వారా కళ్లు జాగ్రత్తగా తీసి, కావాలనుకునే వారికి అమరుస్తారు. ఈ ప్రాసెస్‌లో బాడీకి ఎలాంటి డ్యామేజ్‌ జరగదు.

అపోహ: నేత్ర దానం చేయడం వల్ల వచ్చే జన్మలో అంధత్వంతో పుడుతారా?

వాస్తవం: ఇది ముమ్మాటికీ అబద్ధమే. కొన్ని సాంస్కృతిక, మత విశ్వాసాల్లో ఈ నమ్మకం పాతుకుపోయింది. అయితే, నేత్రదానం అనేది అవసరమైన వారికి సాయం చేయడానికి ఉద్దేశించిన మానవతా చర్య. అయితే, మరణానంతరం నేత్ర దానం చేస్తే మరు జన్మలో అంధత్వం వస్తుందని వైద్య శాస్త్రంలో ఎలాంటి ఆధారాలు లేవు. 

అపోహ: కళ్లద్దాలు, కొన్ని కంటి సమస్యలు ఉన్న వ్యక్తులు కళ్లను దానం చేయలేరు.

వాస్తవం: ఇది అబద్ధం. కళ్లద్దాలు, కొన్ని కంటి సమస్యలు ఉన్న వ్యక్తులు కూడా ఇప్పటికీ వారి కార్నియాలను దానం చేయొచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితులు కార్నియల్‌ కణజాలం అనుకూలతను ప్రభావితం చేయకపోవచ్చు.

అపోహ: యువకులు మాత్రమే నేత్ర దానం చేయగలరు.

వాస్తవం: ఏ వయసు వారైన నేత్ర దానం చేయొచ్చు. అయితే, యువకుల కార్నియా ట్రాన్స్ ప్లాంటేషన్‌లో సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. అందుకే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కార్నియల్‌ కణజాలం ఆరోగ్యం, నాణ్యత ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు.

అపోహ: మరణిచిన వెంటనే నేత్ర దానం చేయవచ్చు

వాస్తవం: కరెక్ట్ సమయానికి కార్నియాను దానం చేయడం వల్ల మరణించిన కొన్ని గంటల వరకు కార్నియాను మార్చవచ్చు. అప్పటివరకు కార్నియాను ప్రత్యేక పద్ధతుల్లో సేకరిస్తారు. కచ్చితమైన టెంపరేచర్‌‌, కంటి పరిస్థితులతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

అపోహ: కళ్లను దానం చేయడం అనేది సంక్లిష్ట, ఖరీదైన ప్రక్రియ

వాస్తవం: ఇది చాలా సులభమైన ప్రక్రియ. నేత్ర దానం అనేది శిక్షణ పొందిన వైద్య నిపుణులు, నేత్ర బ్యాంకుల చేత ఈజీగా సేకరిస్తారు. ఈ ప్రక్రియ కోసం దాత కుటుంబానికి ఎలాంటి ఖర్చు ఉండదు. 

అపోహ: మరణించిన వ్యక్తి కళ్లు ఖననం, దహన సంస్కారాలకు అవసరం

వాస్తవం: ఈ పురణాల సాంస్కృతిక నమ్మకాల నుంచి ఏర్పడిన విశ్వాసం.  నేత్ర దానం అనేది ఖననం లేదా దహన సంస్కారాలతో కలిసి ఉంటుంది. అనేక సందర్భాల్లో శరీరం మొత్తం రూపాన్ని ప్రభావితం చేయని విధంగా కళ్లు తీసివేస్తారు. 

అపోహ: ఐ బ్యాంకులు లాభాల కోసం కళ్లను కొనుగోలు చేసి విక్రయిస్తాయి

వాస్తవం: ఐ బ్యాంకులు నేత్ర దానం, ట్రాన్స్ ప్లాంటేషన్‌ను సులభతరం చేయడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థలు. వారు లాభం కోసం కళ్లు కొనడం లేదా అమ్మడం చేయరు. మార్పిడి కి అవసరమైన వ్యక్తులతో కార్నియాలను సరిపోల్చడ వారి లక్ష్యం.

అపోహ: ప్రతిజ్ఞ చేసిన తర్వాత కుటుంబం నేత్ర దానాన్ని తిరస్కరించవచ్చా 

వాస్తవం: మరణించక ముందు ప్రతిజ్ఞ చేసినా, నేత్ర దానం చేయాలా వద్దా.. అనే తుది నిర్ణయం కుటుంబసభ్యులదే. అందుకే నేత్ర దానానికి ప్రతిజ్ఞ చేసే ముందు వ్యక్తులు తమ కుటుంసభ్యులకు తెలియజేయడం ముఖ్యం.

అపోహ: వివిధ జాతి నేపథ్యాలకు చెందిన వ్యక్తులు నేత్ర దానం చేయలేరు

వాస్తవం: నేత్రదానం జాతికి సంబంధించింది కాదు. దానం చేసిన వ్యక్తి కణజాలం ఇతరులకు సరిపోయేంత వరకు అన్ని జాతి నేపథ్యాల వ్యక్తులు దానం చేయొచ్చు.. ట్రాన్స్ ప్లాంటేషన్‌ చేసుకోవచ్చు.