ఎడమ చేతి వాటం ఎందుకొస్తుంది?

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటాడు దేవదాసు.. నిజమే పొరపాటేముంది? ప్రపంచంలో మెజారిటీ జనం కుడి చేతి వాటమే. మహా అయితే ప్రతి లక్ష మందిలో ఓ పది మంది ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఉంటారేమో! ఇంకా తక్కువ లేదా ఎక్కువ కూడా కావచ్చు. వాళ్ల సంఖ్యను పక్కన పెడితే.. అసలు ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుంది? ఎడమ చేయినే బలంగా ఎందుకు ఉపయోగిస్తారు? ఎక్కువ మందికి కుడి చేయి వాటం ఎందుకు […]

Share:

‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటాడు దేవదాసు.. నిజమే పొరపాటేముంది? ప్రపంచంలో మెజారిటీ జనం కుడి చేతి వాటమే. మహా అయితే ప్రతి లక్ష మందిలో ఓ పది మంది ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు ఉంటారేమో! ఇంకా తక్కువ లేదా ఎక్కువ కూడా కావచ్చు. వాళ్ల సంఖ్యను పక్కన పెడితే.. అసలు ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుంది? ఎడమ చేయినే బలంగా ఎందుకు ఉపయోగిస్తారు? ఎక్కువ మందికి కుడి చేయి వాటం ఎందుకు ఉంటుంది? ఈ అనుమానాలకు సమాధానాలు సిద్దంగా ఉన్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ముందుకు పదండి.

అదీ అసలు కథ..

ఎడమ చేయి వాటం, కుడి చేయి వాటం ఎందుకు ఉంటాయనే దానిపై తాజాగా ఓ అధ్యయనం వెల్లడైంది. అందులో ఆశ్చర్యకర విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నట్లు చేతి వాటానికి, మన మెదడుకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. మనం పుట్టకముందే.. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనలో ఏర్పడే అవయవాల్లోనే ఓ ప్రత్యేక ప్రక్రియ జరుగుతుందట.  రహ్ర్ యూనివర్సిటీకి చెందిన బయో ఫిజిసిస్టుల ఆధ్వర్యంలో జర్మనీ, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా తదితర దేశాల పరిశోధకులు అధ్యయనం చేశారు. చేతి వాటాన్ని.. మన వెన్నెముకలోని జన్యువుల ప్రత్యేక మిశ్రమం నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన స్టడీ.. ఈలైఫ్ జర్నల్‌లో ప్రచురితమైంది. 

ఇలా అధ్యయనం చేశారట

ఈ కీలక పరిశోధనలో శాస్త్రవేత్తలు పలు విషయాలను పరిశీలించారు. తల్లి కడుపులో 8 నుంచి 12 వారాల మధ్యలో శిశువు ఉన్న సమయంలో వెన్నెముకను నిశితంగా గమనించారు. శరీరంలోని కదలికను నియంత్రించే మెదడులోని భాగం.. వెన్నెముకకు కనెక్ట్ కావడానికి ముందే ఈ కొత్త యాక్టివిటీ మొదలవుతుందని గుర్తించారు. మన చేతులు, కాళ్లు, భుజాలు, పాదాలకు సంకేతాలను పంపే వెన్నెముకలోని ప్రాంతాలకు ఇది అనుసంధానమైందని తెలుసుకున్నారు. ఈ యాక్టివిటీనే.. మనది కుడిచేతి వాటమా? ఎడమ చేతి వాటమా? అనేది నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు తమ స్టడీలో రాసుకొచ్చారు.  

అలా ఎందుకు జరుగుతుంది?

వెన్నెముకలోని ఓ యాక్టివిటీ వల్లే కుడి లేదా ఎడమ చేతి వాటాలు ఉంటాయని చెబుతున్న శాస్త్రవేత్తలు.. అలా జరగడానికి స్పష్టమైన కారణాలు ఏంటనేది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటికీ.. బయటి కారణాల వల్ల ఇలా జరగొచ్చని వారు చెప్తున్నారు. ఎంజైమ్‌లు పని చేసే విధానాన్ని మార్చే అంశాలు శిశువు చుట్టూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎంజైమ్‌ల చర్యను జన్యువులు అనుసరిస్తాయని, భవిష్యత్తులో శిశువు కుడి లేదా ఎడిమ చేతి వాటంగా మార్చేలా వెన్నెముకలోని ప్రత్యేక జన్యు మిశ్రమానికి ఇది దారి తీస్తుందని అంచనా వేశారు.

‘సవ్యసాచి’లు ఉన్నారు..

కుడి చేతి వాటం ఉన్నవాళ్లు.. ప్రధాన పనులన్నీ కుడి చేత్తోనే చేస్తారు. అంటే తినడం, రాయడం, పళ్లు తోమడం.. ఇలా రోజు వారీ పనుల్లో కుడి చేయి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఎడమ వాటం అయితే.. ఎడమ చేయిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా రెండు చేతులను సమానంగా ఉపయోగించగలిగిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు అతి తక్కువ మంది మాత్రమే. ఈ విషయంలో మహాభారతంలో అర్జునుడి పేరు ముందుగా ప్రస్తావనకు వస్తుంది. విలు విద్యలో అగ్రగణ్యుడైన ఆయన తన రెండు చేతులతో బాణాలను వేయగల దిట్ట. అందుకే ఆయన్ను ‘సవ్యసాచి’ అంటారు. క్రికెట్‌లో ఇలాంటి వాళ్లు కనిపిస్తుంటారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజాలు రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ తదితరులు కుడి, ఎడమ చేతులతోనూ బంతిని విసరగలరు. మన క్రికెట్‌ ప్లేయర్లలో సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, సురేశ్ రైనా తదితరులు లెఫ్ట్‌ హ్యాండ్ బ్యాటింగ్ ఆడతారు.. రైట్‌ హ్యాండ్‌తో బౌలింగ్ చేస్తారు.