మీ శరీరంలో ఒత్తిడిని ప్రేరేపించే 5 ఆహార పదార్థాలు

ఆహారం మానవ శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మనం తినే వాటిలోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే, ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మనం ఎక్కువగా తినాలి లేదా అస్సలు తినకూడదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం లేదా దాని స్థాయిని పెంచడం ద్వారా శరీరాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ మధ్య పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా శరీరంలో ఒత్తిడిని కలిగించే ఆహారం గురించి మనకు తెలియజేశారు. అవేమిటో […]

Share:

ఆహారం మానవ శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మనం తినే వాటిలోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే, ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మనం ఎక్కువగా తినాలి లేదా అస్సలు తినకూడదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం లేదా దాని స్థాయిని పెంచడం ద్వారా శరీరాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ మధ్య పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా శరీరంలో ఒత్తిడిని కలిగించే ఆహారం గురించి మనకు తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం:

అవేమిటో ఇప్పుడు చూద్దాం

చక్కెర

ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ పెరుగుతుంది. ఇది మన మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇలా షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం వలన తీవ్ర భయాందోళనలను కూడా కలిగి కొన్నిసార్లు అసౌకర్యంగా, ఆత్రుతగా అనిపిస్తూ ఉండవచ్చు. చక్కర ఎక్కువగా తీసుకోవడం ఆందోళనకు దారితీస్తాయి. కేక్‌లు, పేస్ట్రీల వంటి ఆహారాలు రక్తంలో షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులకు కారణం అవుతాయి. దానితో పాటు, శక్తిస్థాయిలు కూడా పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. బ్లడ్ షుగర్ తగ్గినప్పుడు, మానసిక స్థితి దెబ్బతిని, ఆందోళన స్థాయిలు పెరుగుతాయి.

కెఫిన్

కెఫీన్ ఆందోళనను పెంచుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఒత్తిడిని నియంత్రించే హార్మోన్. అందువల్ల, అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుంది. అయినప్పటికీ, దీనిని మితంగా తీసుకుంటే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది కూడా. అధిక కెఫీన్ శరీరాన్ని ఎక్కువగా ప్రేరేపించడం ద్వారా అడ్రినల్ గ్రంథులకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది కాబట్టి, కెఫీన్ రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుదలకు కారణమవుతుంది, అది చివరికి మానసిక ఆందోళనను పెంచుతుంది.

వేయించిన ఆహారం

వేయించిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. వేయించిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ అధిక మొత్తంలో ఉంటుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌‌కి ట్రాన్స్ ఫ్యాట్ ఒక ప్రధాన కారణం. శరీరం ఇన్ఫ్లమేషన్ స్థితికి వెళ్ళినప్పుడు ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి.

శుద్ధి చేసిన పిండి పదార్థాలు

కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం అవడం ద్వారా శరీరానికి గ్లూకోజ్ లేదా చక్కెర లభిస్తుంది. ఇది శరీరం పనిచేయడానికి ఉపయోగపడే ప్రాథమిక ఇంధనం. కార్బోహైడ్రేట్లను శుద్ధి చేసినప్పుడు వాటిలో చక్కెర స్థాయి పెరుగుతుంది, ఇది పడిపోవడానికి ముందు పదునైన స్పైక్‌ను కలిగిస్తుంది. ఇది ఒత్తిడి ప్రతిస్పందనను, ఆందోళనను పోలి ఉండే లక్షణాలను ప్రేరేపిస్తుంది. శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఇన్ఫ్లమేషన్‌ను పెంచుతాయి. శరీరాన్ని అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెరతో ముంచెత్తుతాయి, ఇది ఒత్తిడి పెంచి, మానసిక అస్థిరతకు కారణమవుతుంది.

కృత్రిమ స్వీటెనర్లు

ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో గతంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. ఒక సాధారణ కృత్రిమ స్వీటెనర్ ‘అస్పర్టమే’కి ఒత్తిడికి మధ్య గల సంబంధాన్ని గమనించారు. దానిని ఎలుకలపై ప్రయోగించినపుడు..  అవి ఆందోళన వంటి ప్రవర్తనను ప్రదర్శించాయి. ఒకసారి వినియోగించిన తర్వాత.. కృత్రిమ స్వీటెనర్ విచ్ఛిన్నమై మిథనాల్, అస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాలనైన్ అనే మూడు రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కృత్రిమ స్వీటెనర్లను తరచుగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా సిఫార్సు చేస్తారు. అయితే నాన్ న్యూట్రిషియస్ స్వీటెనర్స్ (పోషక రహిత స్వీటెనర్లు) వాడకం మన శరీరంలో ఒత్తిడిని కూడా పెంచుతుందని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అస్పర్టమే వాడకం శరీరంలో ఒత్తిడికి, అదనపు ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తికి దారితీయవచ్చు.

ఆహారంలో కొన్ని మార్పులు చేయడం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాబట్టి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.