నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఖలిస్థానీలకు అనుకూలం

భారత్‌, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్‌పై నిందలు వేశారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ దేశ చట్టసభలో పేర్కొన్నారు. అయితే భారత్‌ దీనిని ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్యాధికారులను బహిష్కరించాయి. అలాగే కెనడా పౌరులకు […]

Share:

భారత్‌, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవల మరింత దిగజారాయి. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనంతరం భారత్‌పై నిందలు వేశారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ దేశ చట్టసభలో పేర్కొన్నారు. అయితే భారత్‌ దీనిని ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్యాధికారులను బహిష్కరించాయి. అలాగే కెనడా పౌరులకు వీసా జారీని భారత్‌ నిలిపివేసింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా దిగ జార్చాయి. 

కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కూడా ఆ దేశ 15వ ప్రధానిగా ఉన్నారు. 1971 జనవరిలో ఐదు రోజుల పాటు భారత్‌లో ఆయన పర్యటించారు. తాజ్‌మహల్‌ను సందర్శించడంతోపాటు ఒంటెపై షికారు చేశారు. పియరీ ట్రూడో టూర్‌ ముగిసిన కొంత కాలం తర్వాత భారత్‌, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఖలిస్థానీ అంశంపై మాత్రం కాదు. భారత్‌ పౌర అణు శక్తి కార్యక్రమానికి అమెరికా, కెనడా సహకరించాయి. కెనడాతో కలిసి నిర్మించిన కెనడా డ్యూటెరియం యురేనియం (CANDU) రియాక్టర్, అణు విద్యుత్‌ ఉత్పత్తి కోసం యురేనియం వినియోగాన్ని అనుమతించింది.

మరో వైపు పియరీ ట్రూడో పర్యటన తర్వాత మూడేళ్లకు 1974లో పోఖ్రాన్‌లో అణ్వాయుధాన్ని భారత్‌ పరీక్షించింది. కెనడాతో కలిసి నిర్మించిన రియాక్టర్‌లోని ప్లూటోనియంను దీని కోసం వినియోగించినట్లు అమెరికా, కెనడా ఆరోపించాయి. సంబంధిత ఒప్పందాలను భారత్‌ ఉల్లంఘించినట్లు కెనడా మండిపడింది. శాంతియుత అణు పరీక్షగా పేర్కొన్న భారత్ వాదలను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో భారత అణుశక్తి కార్యక్రమానికి మద్దతును పియరీ ట్రూడో నేతృతంలోని కెనడా ప్రభుత్వం ఉపసంహరించింది. అలాగే భారత్‌లోని మరో రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కెనడియన్ అధికారులను వెనక్కి రప్పించింది. అయితే 2010లో జీ 20 సమ్మిట్ కోసం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కెనడా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య అణు సహకార ఒప్పందం మళ్లీ కుదిరింది.

కాగా, ఖలిస్థానీ అనుబంధ సంస్థ బబ్బర్ ఖల్సా సభ్యుడు పర్మార్‌కు నాటి కెనడా ప్రధాని, జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ట్రూడో మద్దతిచ్చారు. విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై దాడులకు పిలుపునిచ్చిన పర్మార్‌ను అప్పగించాలని భారత్‌ చేసిన అభ్యర్థనను ఆయన ప్రభుత్వం తిరస్కరించింది. భారత్ పంపిన ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి బ్రిటన్‌ రాజధాని లండన్‌కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం 182 (కనిష్క)లో రెండు సూట్‌ కేసులలో బాంబులు అమర్చారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు వాటిని పేల్చడంతో ఆ విమానంలో ఉన్న 329 మంది ప్రయాణికులు మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది కెనడియన్లే. కనిష్క బాంబు దాడి కెనడా చరిత్రలో అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడిగా మిగిలిపోయింది.

భారత్‌లో వేర్పాటువాదాన్ని కోరుకునే ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతిచ్చిన పియరీ ట్రూడో.. తమ దేశంలో ఇలాంటి ప్రత్యేక క్యూబెక్‌ ఉద్యమాన్ని అణచివేశారు. ఫ్రెంచ్‌ మాట్లాడే ప్రజల రాష్ట్రమైన క్యూబెక్‌.. కెనడా నుంచి విడిపోవాలని భావించింది. సైన్యాన్ని రంగంలోకి దించి, పౌరహక్కులను రద్దు చేసి, అత్యంత దారుణంగా అణచివేశారు పిరె ట్రూడో.

కనిష్క బాంబు దాడి సూత్రధారి, పియరీ ట్రూడో మద్దతిచ్చిన పర్మార్, 1992లో పంజాబ్‌ పోలీసుల చేతిలో హతమయ్యాడు. అయితే ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని పలు ప్రాంతాల్లో పర్మార్‌ను గౌరవిస్తూ పోస్టర్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తన తండ్రి పియరీ ట్రూడో బాటను అనుసరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.