అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని ఉవ్విల్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ కు తొలి విజయం దక్కింది. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటి భాగమైన ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించాడు. నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లను వెనక్కి నెట్టి ట్రంప్ ముందు వరుసకు దూసుకుపోయాడు. 1600 పోలింగ్ కేంద్రాల్లో జనం ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారబోతుంది. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ప్రైమరీ తొలి పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలైంది. జనవరి 23న న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి పలు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ నిర్వహించి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకొంటారు. తొలి పోలింగ్‌లో ట్రంప్ ఘన విజయంతో.. రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్ పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది. అయితే, అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ కు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు దక్కించుకున్నారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం.
2021లో కేపిటల్ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్ ప్రమేయాన్ని నిర్ధారించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా అతని పేరును బ్యాలెట్‌లోంచి తొలగించాలని కొలరాడో కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ట్రంప్‌నకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వ్యక్తిని న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించడం ఇదే ప్రథమం. ఆ తర్వాత అదే బాటలో అమెరికాలోని మరో రాష్ట్రం కూడా ఆయనపై వేటు వేసింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైనే (Maine) రాష్ట్రం గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సెక్రటరీ (ప్రధాన ఎన్నికల అధికారి) 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా గురువారం ప్రకటించారు.