వివాదాల ట్రంప్‌పై కేసులెన్నో!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్.. ముందు నుంచీ వివాదాలతోనే ఆయన సావాసం.  అధ్యక్షుడిగా కన్నా.. వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఎన్నో కాంట్రవర్సీలు.. మరెన్నో కేసులు.. ఇంకెన్నో ఆరోపణలు! 2020 సార్వత్రిక ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం లొంగిపోయారు. తర్వాత కొద్ది సేపటికే వ్యక్తిగత పూచీకత్తుతో బయటపడ్డారు. ఈ క్రమంలో అమెరికా చరిత్రలో తొలి ‘మగ్‌షాట్’ తీయించుకున్న మాజీ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. ఇలా […]

Share:

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్.. ముందు నుంచీ వివాదాలతోనే ఆయన సావాసం.  అధ్యక్షుడిగా కన్నా.. వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఎన్నో కాంట్రవర్సీలు.. మరెన్నో కేసులు.. ఇంకెన్నో ఆరోపణలు! 2020 సార్వత్రిక ఎన్నికల్లో జార్జియాలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం లొంగిపోయారు. తర్వాత కొద్ది సేపటికే వ్యక్తిగత పూచీకత్తుతో బయటపడ్డారు. ఈ క్రమంలో అమెరికా చరిత్రలో తొలి ‘మగ్‌షాట్’ తీయించుకున్న మాజీ అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. ఇలా ఇదొక్కటే కాదు.. ఎన్నో కేసులు ఆయనపై నమోదయ్యాయి. 2024 ఎన్నికల్లో అధ్యక్షుడిగా మారోసారి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌పై ఉన్న ప్రధాన లీగల్ కేసులివీ..

క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల కేసు

ట్రంప్‌నకు సంబంధించిన రెండు విచారణలకు అమెరికా న్యాయ శాఖ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కేసుల్లో ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. తన ఫ్లోరిడా ఎస్టేట్‌లో టాప్ సీక్రెట్ డాక్యుమెంట్ల విషయంలో తప్పుగా వ్యవహరించారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు రహస్య పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రహస్య పత్రాలను బాత్‌రూమ్‌లలో కూడా పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయా పత్రాలను తన సహాయకులు, న్యాయవాదులకు చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల కేసులో ఏకంగా 40 నేరాలను ఆయన ఎదుర్కొంటున్నారు. వీటిలో అత్యంత తీవ్రమైన అభియోగంలో 20 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 

ఎన్నికల్లో జోక్యం

2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ యత్నించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలోనే ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హౌస్‌లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు, అధికారిక ప్రక్రియను అడ్డుకునేందుకు కుట్ర పన్నారని ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. తాను గెలిచానని మద్దతుదారులు, ఇతరులకు ట్రంప్ పదేపదే అబద్ధం చెప్పారు. చట్టబద్ధంగా రావాల్సిన ఫలితాలను తారుమారు చేసేందుకు అధికారులను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ యత్నాలు సాధ్యం కాకపోవడంతో అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను ఒప్పించేందుకు యత్నించారు. ఓట్ల లెక్కింపును మరింత ఆలస్యం చేసేందుకు క్యాపిటల్ హిల్ అల్లర్లను ట్రంప్ ఉపయోగించుకున్నారని ప్రభుత్వ లాయర్లు ఆరోపించారు. 

హష్ మనీ స్కీమ్

శృంగార తారలతో లైంగిక సంబంధాలను నెరిపారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తన వివాహేతర లైంగిక సంబంధాలు బయటపడకుండా డబ్బు చెల్లించారని (హష్ మనీ) ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేరారోపణ ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం. పోర్న్ స్టార్‌‌ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల వ్యవహారం పెను దుమారమే రేపింది. ఈ కేసులో వచ్చే జనవరిలో న్యూయార్క్‌ రాష్ట్ర కోర్టులో ఆయన హాజరుకావాల్సి ఉంది. రిపబ్లికన్లు తమ నామినేటింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు ఈ విచారణ జరగనుండటం గమనార్హం. 

న్యూయార్క్ సివిల్ కేసులు

ట్రంప్‌పై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ లాసూట్ దాఖలు చేశారు. రుణాలు, పన్ను ప్రయోజనాలను పొందడానికి గోల్ఫ్‌ కోర్సులు, భారీ బిల్డింగులు సహా ఆస్తుల విలువ విషయంలో ఆయన, ఆయన సంస్థలు బ్యాంకులను మోసం చేశాయనే ఆరోపణలున్నాయి. 250 మిలియన్ డాలర్ల జరిమానా వేయాలని జేమ్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే న్యూయార్క్‌లో ట్రంప్ చేస్తున్న వ్యాపారంపై నిషేధం విధించాలని కోరుతున్నారు. ఈ అక్టోబర్‌‌లోనే న్యూయార్క్ రాష్ట్ర కోర్టులో దీనిపై విచారణ జరగనుంది. 1990లో మ్యాగజైన్ కాలమిస్ట్ ఇ.జీన్‌ కరోల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసునూ ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కరోల్‌కు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. అయితే జీన్ కరోల్ ఆరోపణలను ఖండించిన ట్రంప్.. జ్యూరీ ఆదేశించిన డబ్బును చెల్లించేందుకు నిరాకరిస్తూ అప్పీలు దాఖలు చేశారు.  అయితే ఫెడరల్ కోర్టు జ్యూరీ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పింది.