ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తడబడిన అమెరికా అధ్యక్షుడు.. మైక్ కట్ చేసిన సిబ్బంది

జీ20 సమిట్‌ను ముగించుకుని వియత్నాం వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతుండగానే మైక్‌ను కట్ చేసిన సిబ్బంది.. సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనో అగ్ర రాజ్యానికి అధిపతి.. ప్రపంచానికి పెద్దన్న మాదిరి. ఆయన కన్నెర్ర చేస్తే దేశాలకు దేశాలు వణకాల్సిందే. విదేశీ పర్యటనకు వెళ్లారంటే మందీ మార్బలమంతా కలిపి వందల్లో వెళ్తుంటారు. సెక్యూరిటీ కోసం కొందరు, ఏర్పాట్ల కోసం ఇంకొందరు.. అట్లుంటది ఆయనతోటి. ఆయనే అమెరికా […]

Share:

జీ20 సమిట్‌ను ముగించుకుని వియత్నాం వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతుండగానే మైక్‌ను కట్ చేసిన సిబ్బంది.. సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు.

ఆయనో అగ్ర రాజ్యానికి అధిపతి.. ప్రపంచానికి పెద్దన్న మాదిరి. ఆయన కన్నెర్ర చేస్తే దేశాలకు దేశాలు వణకాల్సిందే. విదేశీ పర్యటనకు వెళ్లారంటే మందీ మార్బలమంతా కలిపి వందల్లో వెళ్తుంటారు. సెక్యూరిటీ కోసం కొందరు, ఏర్పాట్ల కోసం ఇంకొందరు.. అట్లుంటది ఆయనతోటి. ఆయనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కానీ వియత్నాంలో ఓ ఇబ్బందికర, అవమానకర పరిస్థితిని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా చూసిన వాళ్లకే కాదు టీవీల్లో, సోషల్ మీడియాలో వీక్షించిన వాళ్లకూ ఆశ్చర్యం కలిగించింది. 

సమాధానమిస్తుండగానే..

జీ20 సమిట్ కోసం భారతదేశానికి వచ్చిన జోబైడెన్.. తన పర్యటన ముగించుకుని ఆదివారం నేరుగా వియత్నాం చేరుకున్నారు. 80 ఏళ్ల బైడెన్‌కు అధ్యక్షుడిగా ఇది తొలి ఆసియా పర్యటన. అయితే వియత్నాంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ అర్ధంతరంగా ముగిసింది. ఆదివారం రాత్రి వియత్నాం రాజధాని హనోయ్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ బైడెన్ తడబడ్డారు. ఇదే సమయంలో ఆయన ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియర్రీ గొంతు వినిపించింది. ‘‘అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసింది. థ్యాంక్యూ” అని ఆమె చెప్పారు. దీంతో బైడెన్ తాను చెప్పేది మధ్యలోనే ఆపేసి, మైక్ పక్కన పెట్టారు. అక్కడి నుంచి వెళ్తుండగా.. జర్నలిస్టులు ఏదో అనడం, బైడెన్ సీరియస్‌గా స్పందించడం కనిపించింది. బైడెన్ వెళ్తుండగా.. జాజ్ మ్యూజిక్ వినిపించింది. 

మైక్రో ఫోన్ మ్యూట్ కావడంతో..

ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో బైడెన్ మాట్లాడుతూ.. ‘‘మేం స్థిరత్వం గురించి మాట్లాడాం. మూడో ప్రపంచం గురించి మాట్లాడాం. దక్షిణార్ధగోళంలో మార్పులకు యాక్సెస్ ఉంది. ఇది అస్సలు ఘర్షణ కాదు” అంటూ బైడెన్ తడబడ్డారు. వెంటనే ప్రెస్ సెక్రటరీ కల్పించుకున్నారు. నిజానికి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ముగించాలని ఆమె బైడెన్‌కు మైక్రో ఫోన్ ద్వారా చెప్పాలని అనుకున్నారు. కానీ చాలా సేపటి కిందటే ఆయన మైక్రోఫోన్ మ్యూట్‌లో ఉండిపోయింది. దీంతో ఆయన అలానే మాట్లాడటాన్ని కొనసాగించారు. తాను మాట్లాడుతున్నంత సేపు విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు. కొన్ని సార్లు జోకులు వేశారు. ‘ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తయ్యాక వెళ్లి పడుకుంటా’ అని అన్నారు. తాను తన స్టాఫ్ ఆదేశాలను అనుసరిస్తున్నానని చెప్పారు. కొన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనని అన్నారు. 

బైడెన్‌పై తీవ్ర విమర్శలు

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బైడెన్ తడబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌ తర్వాత తాను వెళ్లాల్సిన దారిని కూడా ఆయన మర్చిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు వియత్నాంలోనూ ఇలానే జరగడంపై సోషల్ మీడియాతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మానసిక ఆరోగ్యం, నాయకత్వం సామర్థ్యం ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాను నిద్రపోతానంటూ బైడెన్ అడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘జో బైడెన్ తడబడుతూ మాట్లాడుతుండటంతో ఆయన సిబ్బంది మైక్‌ను కట్ చేశారు. ప్రెస్ కాన్ఫెరెన్స్‌ను మధ్యలోనే ఆపేశారు. గతంలో ఏ ప్రెసిడెంట్‌కూ ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం నేను చూడలేదు” అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. 

ఇప్పటికే తన ఆరోగ్యం, మానసిక స్థితి విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న బైడెన్.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం. మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తానని చెబుతూ వస్తున్నారు.